Kamala Harris Sworn : అమెరికా దేశ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ కొత్త చరిత్ర
అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి కమలా హారిస్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా 56ఏళ్ల కమల చరిత్రలో నిలిచారు...
Kamala Harris Sworn : అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి కమలా హారిస్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా 56ఏళ్ల కమల చరిత్రలో నిలిచారు. ఉపాధ్యక్ష పదవిని ఓ మహిళ చేపట్టడం కూడా ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టే కొద్ది నిమిషాల ముందు ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్.. కమల చేత ప్రమాణం చేయించారు. అంతకుముందు.. తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు కమల. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తల్లి అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
US: Kamala Harris sworn-in as the first female Vice President of the United States of America. pic.twitter.com/fYEcCd5oD4
— ANI (@ANI) January 20, 2021
ప్రమాణ స్వీకారం చేసిన తర్వత కమల అధికారికంగా తొలి ట్వీట్ చేశారు. రెడీ టూ సర్వ్.. అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Ready to serve.
— Vice President Kamala Harris (@VP) January 20, 2021
షిర్లేనే స్ఫూర్తిగా…
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కమలా హ్యారిస్ చీరకట్టులో మెరిసిపోతారంటూ భారత్‌లోని మీడియా వర్గాలు రాసుకొచ్చాయి. కానీ ఆమె చీరలో కాకుండా పర్పుల్ కలర్ డ్రెస్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కమలా హ్యారిస్ ఈ రంగు దుస్తులు వేసుకోవడం వెనుక పెద్ద కారణం కూడా ఉంది. దశాబ్దాల క్రితం షిర్లే క్రిషోల్మ్ అనే నల్ల జాతి మహిళ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. తన రాజకీయ జీవితానికి షిర్లేనే స్ఫూర్తి అని కమలా హ్యారిస్ తన ప్రచారంలో చెప్పారు. షిర్లేకు గుర్తుగా కమలా హ్యారిస్ ఈ పర్పుల్ కలర్ దుస్తులను ధరించారు. కాగా.. బైడెన్- కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
తొలి మహిళగా.. సెకండ్ జెంటిల్‌మన్‌గా కమలా భర్త..
అమెరికా తొలి మహిళా వైస్‌ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టిస్తే.. ఆమె భర్త డగ్లస్ ఎంహోఫ్ అమెరికాకు తొలి సెకండ్ జెంటిల్‌మన్ గా చరిత్రలో నిలిచిపోయారు. కమల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆమె భర్త గురించి గూగుల్ చేశారు. కమల భర్త డగ్లస్ ఎంహోఫ్.. ఒక న్యాయవాది.
కమలా హారిస్ తల్లిదండ్రులు..
కమలా హారిస్ తల్లిదండ్రులిద్దరూ అమెరికాకు వలస వెళ్లినవాళ్లే. ఆఫ్రికా మూలాలున్న తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకా నుంచి వెళ్లారు. తల్లి శ్యామలా గోపాలన్ ఇండియా నుంచి 1958లో వలస వెళ్లారు. శ్యామల ఢిల్లీ వర్సిటీలో చదువుకున్నారు. ఈమె తండ్రి గోపాలన్ భారత్‌లో దౌత్యాధికారి. తాతతోనూ కమలకి మంచి అనుబంధం ఉంది. ఎన్నోసార్లు చెన్నైలోని తాతయ్య ఇంటికి కమలా హారిస్ వచ్చారు.