Johnson and Johnson: మా వ్యాక్సిన్ సింగిల్ షాట్‌తో డెల్టా వైరస్ నుంచి రక్షణ.. జాన్సన్ అండ్ జాన్సన్ కీలక ప్రకటన..!
తాము అభివృద్ధి చేసిన సింగిల్ డోసు టీకా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా డెల్టా రకం వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది.
Johnson and Johnson Covid 19 Vaccine: రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజుకో రూపంతో కలవరపెడుతోంది. ఇదేక్రమంలో వైరస్ కట్టడి చేసేందుకు విశ్వవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము అభివృద్ధి చేసిన సింగిల్ డోసు టీకా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా డెల్టా రకం వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. వైరస్ సంక్రమణ నుంచి విస్తృతమైన రక్షణ కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు డెల్టాతో పాటు ఇతర రకాలను సైతం తట్టుకోగలుతుందని గుర్తించామని తెలిపింది. దాదాపు ఎనిమిది నెలల పాటు మానవ శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తయినట్లు వెల్లడించింది.
తొలి డోసు తీసుకున్న 29 రోజుల్లోనే డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాతో ఉత్పత్తి అయినట్లు సంస్థ పేర్కొంది. సమయం గడుస్తున్న కొద్ది వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం మరింత మెరుగైనట్లు వెల్లడించింది. ఇదిలావుంటే, తాజాగా తమ వ్యా్క్సిన్ తీసుకున్నవారికి కీలక సూచన చేసింది. ఇప్పటికే తమ టీకా తీసుకున్నవారు ఏడాది తర్వాత బూస్టర్ డోసు తీసుకోవల్సి ఉంటుందని సంస్థ అధికారులు తెలిపారు. అయితే, అందుకోసం టీకా ఫార్ములాను మార్చాల్సిన అవసరమేమీ లేదని తెలిపారు. ఇప్పటి వరకు సింగిల్ డోసుగా ఉన్న టీకాను మరింత మెరుగైన ఫలితాల కోసం రెండు డోసుల్లో ఇవ్వడాన్ని కూడా పరీక్షిస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ తమ ప్రకటనలో పేర్కొంది.