World War 2: నాణేనికి మరో వైపు… రెండో ప్రపంచ యుద్దంలో సోవియట్ సేనల అత్యాచారాలు

రెండో ప్రపంచ యుద్దంలో సోవియట్‌ యూనియన్‌ సైన్యం వీరోచిత పోరాట పటిమ చూపింది. ప్రపంచంపై యుద్దాన్ని రుద్దిన నాజీ నియంత హిట్లర్‌ను సోవియట్‌ నాయకత్వంలోని మిత్రపక్ష సైన్యాలు అణచివేశాయి. కానీ అదే సందర్భంలో నాణేనికి రెండో వైపు కూడా ఉన్నట్లే...సోవియట్ సైనికుల దురాగతాలు బయటపడ్డాయి.

World War 2: నాణేనికి మరో వైపు... రెండో ప్రపంచ యుద్దంలో సోవియట్ సేనల అత్యాచారాలు
Russian Army Museum
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 19, 2021 | 6:16 PM

W‌orld War 2: రెండో ప్రపంచ యుద్దానికి ప్రధాన కారణం జర్మనీ… మహా క్రూరుడు జర్మనీ అధ్యక్షుడు, నాజీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే… రెండోవైపు మరో చీకటి కోణం ఉంది. రెండో ప్రపంచ యుద్దంలో జర్మన్లపై సోవియట్‌ యూనియన్‌ సైనికులు అత్యాచారాలకు పాల్పడ్డారు. యుద్దం చివరి రోజులలో సోవియట్‌ సైనికుల పాశవిక చర్యలకు బెర్లిన్‌ నగరం వణికిపోయింది. నాటి యుద్దంలో పాల్గొన్న ఒక సైనికుడి డైరీలో ఈ దారుణాలు వెలుగు చూశాయి. 1939లో పోలెండ్‌పై జర్మనీ దాడితో రెండో ప్రపంచ యుద్దం ప్రారంభమయ్యింది. పోలెండ్‌కు అండగా సోవియట్‌ యూనియన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, చైనా మిత్రపక్ష కూటమిగా ఏర్పడటంతో ప్రపంచ యుద్దంగా పరిణామం చెందింది. జర్మనీకి మద్దతుగా నిలిచిన జపాన్‌, ఇటలీ చేశాలు నిలిచాయి. దాదాపు ఆరేళ్లపాటు ఈ యుద్దం కొనసాగింది. తొలిదశలో జర్మనీయే పైచేయి సాధించింది. 1944 వచ్చేసరికి పోలెండ్ మిత్రపక్ష కూటమి ముందంజలో నిలిచింది. 1945 మధ్యనాటికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. 1945 మేలో జర్మనీ రాజధాని బెర్లిన్‌‌ను సోవియట్‌ సేనలు ఆక్రమించాయి. ఈ క్రమంలోనే ప్రపంచం తలదించుకునే సంఘటనలు చోటు చేసుకున్నాయి.

పురుషులంతా యుద్దంలో పాల్గొనాలనే హిట్లర్‌ ఆదేశాలతో ఇళ్లలో మిగిలింది మహిళలు మాత్రమే. నగరాన్ని కాపాడుకునేందుకు సోవియట్‌ సేనలపై ఎదురుదాడికి మహిళలు సాహసించారు. బెర్లిన్‌ నగరంలోకి చొచ్చుకువచ్చిన 5వేల మంది సోవియట్‌ సైనికులను ఆ నగర మహిళలు ఎదురొడ్డి నిలిచారు. అయితే సోవియట్‌ సేనలు ముందు మహిళలు తేలిపోయారు. తమ చేతిలో చిక్కిన బెర్లిన్ మహిళల పట్ల సోవియట్‌ సైనికులు కర్కశంగా వ్యవహరించారు. చిన్నా, పెద్దా కూడా చూడకుండా కనిపించిన ప్రతి మహిళపై అత్యాచారాలకు పాల్పడ్డారు. తల్లుల ముందే కన్నకూతుళ్లను చెరపట్టి వికృత చేష్టలకు పాల్పడింది.

World War 2

World War 2

అయితే ఈ ఆరోపణలను అప్పట్లో రష్యా మీడియా  కొట్టిపారేసింది.అదంతా బూటకపు ప్రచారమన్న సోవియట్‌ ప్రభుత్వం బుకాయించింది. యుద్దంలో పాల్గొన్న ఉక్రెయిన్‌కు చెందిన వ్లాదిమిర్‌ జెల్ఫాండ్‌ అనే సైనికుని డైరీలో భయంకర నిజాలు వెలుగుచూశాయి. నిజానికి అప్పట్లో సైనికులు డైరీ రాయడంపై సోవియట్‌ యూనియన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ముఖ్యంగా యుద్దానికి సంబంధించిన ఎలాంటి అంశాలు రాతపూర్వకంగా ఉండరాదని ఆంక్షలు విధించింది. నాటి పరిస్థితులను వ్లాదిమిర్‌ జెల్ఫాండ్‌ రహస్యంగా డైరీలో రాశారు. బెర్లిన్‌లో 1945 ఏప్రిల్‌ 16 నుంచి మే 2 వరకూ ఏం జరిగిందో లెఫ్టినెంట్‌ జెల్ఫాండ్‌ డైరీలో వివరించారు. నాడు బెర్లిన్‌ నగరం దాటి వెళ్లిపోతున్న మహిళలను కలిసి జెల్ఫాండ్ మాట్లాడారు. సోవియట్ సైనికుల పశువాంఛకు తాము ఎలా బలయ్యామో బాధిత మహిళలు వివరించారు. దాదాపు 20 మంది తనపై అత్యాచారానికి ఒడిగట్టారని ఒక యువతి తెలిపింది. తమ కళ్ల ముందే తమ పిల్లలపై ఏ విధంగా అత్యాచారం చేశారో చెప్పి కొందరు మహిళలు విలపించారు.

జెల్ఫాండ్‌ మాత్రమే కాకుండా ఈ దురాగతాలను మరికొందరు సైనికులు తమ డైరీలలో రాశారు. కొన్ని రికార్డుల ప్రకారం ఒక్క బెర్లిన్‌ నగరంలోనే వేలాది మంది మహిళలు సోవియట్‌ సైనికుల అత్యాచారాలకు గురయ్యారు. యుద్దం ముగిసిన తరువాత జరిగిన ఈ మూకుమ్మడి అత్యాచారాలపై బెర్లిన్‌ కోర్టులో దాదాపు 995 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే… జర్మన్‌ మహిళలపై సోవియట్‌ సేనల దురాగతాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. బెర్లిన్‌ లోని ఒక మ్యూజియంలో కొన్ని సాక్ష్యాలు దొరికాయి. ఒక జర్మన్‌ సైనికుడి వ్యక్తిగత ఆల్బమ్‌ నుంచి కొన్ని ఫోటోలు సేకరించి భద్రపరచారు. నేలపై వివస్త్రగా పడి ఉన్న కొంత మంది మహిళల ఫోటోలు ఇందులో ఉన్నాయి.

అత్యాచారాలపై కోర్టులలో కేసులు దాఖలు చేస్తుండటంతో సోవియట్‌ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. తమ సైనికుల అరాచకాలను ప్రపంచం దృష్టికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ రెండో ప్రపంచ యుద్దంలో రష్యా విజయాన్నిగానీ, సోవిటయ్‌ సైనికుల పరాక్రమాలను గానీ కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 5 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో సోవియట్ సైనికుల దురాగతాలు ఎక్కువగా బయటకు రాలేదు. తన తండ్రి రాసిన డైరీలోని విషయాలను ఇటీవల వ్లాదిమిర్‌ జెల్ఫాండ్‌ తనయుడు విటలీ జెల్ఫాండ్‌ వెల్లడించారు.

Also Read..అనుమానాస్పద స్థితిలో ప్రముఖ చైనీస్ అణు శాస్త్రజ్ఞుని మృతి……పోలీసుల దర్యాప్తు ప్రారంభం