AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Mask Countries: కొన్ని దేశాల్లో మాస్కులకు గుడ్ బై.. ‘ఆ’ అయిదు దేశాలేవంటే?

కరోనా వైరస్ తాకిడి వల్ల ప్రపంచ మానవాళి జీవితాలు అతలాకుతలమయ్యాయి. కోవిడ్‌ నిబంధనలు, ఆంక్షల మధ్య రోజువారీ వ్యవహారాలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

No Mask Countries: కొన్ని దేశాల్లో మాస్కులకు గుడ్ బై.. ‘ఆ’ అయిదు దేశాలేవంటే?
No Mask
Rajesh Sharma
|

Updated on: Jun 19, 2021 | 5:48 PM

Share

No Mask Countries Five countries No Mask: కరోనా వైరస్ తాకిడి వల్ల ప్రపంచ మానవాళి జీవితాలు అతలాకుతలమయ్యాయి. కోవిడ్‌ నిబంధనలు, ఆంక్షల మధ్య రోజువారీ వ్యవహారాలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇల్లు దాటి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్క్‌ ధరించాలన్న నిబంధనను అన్ని దేశాలు కంపల్సరీ చేశాయి. దుకాణానికో.. ఆస్పత్రికో వెళ్లాలన్నా మాస్క్‌ ధరిస్తే తప్ప ఎంట్రీ దొరకని పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. అయితే, కొన్ని దేశాలు మాస్కు నిబంధనను ఎత్తి వేసే దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకున్నాయి. మాస్క్‌ ధరించకుండా సాధారణ జీవితాన్ని గడిపే వెసులుబాటున తమ తమ దేశాల పౌరులకు కల్పిస్తున్నాయి. ఇటీవల అమెరికాలో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికానే కాదు.. మరికొన్ని దేశాలు కూడా మాస్క్‌ తప్పనిసరి అనే నిబంధనను తొలగించాయి. ఒకట్రెండు నిబంధనలు, షరతులతో మాస్క్‌ లేకుండా ఆరుబయట తిరిగేందుకు అనుమతిస్తున్నాయి.

అమెరికా కంటే ముందే పలు దేశాలు మాస్క్‌ తప్పనిసరి నిబంధనను ఉపసంహరించాయి. అందులో మధ్యప్రాచ్యంలోని ఇజ్రాయెల్‌ ఒకటి. 92 లక్షలకుపైగా జనాభా ఉన్న ఇజ్రాయెల్ దేశంలో 70 శాతానికిపైగా ప్రజలకు వ్యాక్సిన్‌ వేశారు. అందరికీ రెండు డోసులు పూర్తి అయ్యాయి. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, వేగవంతమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో మహమ్మారిపై ఇజ్రాయెల్‌ దేశం విజయం సాధించింది. అందుకే గత ఏప్రిల్‌ నెలలోనే మాస్క్‌ తప్పనిసరి నిబంధనను ఇజ్రెయెల్ ప్రభుత్వం తొలగించింది. ప్రజలంతా మాస్క్‌ లేకుండానే స్వేచ్ఛగా తిరగొచ్చని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తంగా 8.4 లక్షల కోవిడ్‌ కేసులు నమోదు కాగా.. 6,427 మరణాలు చోటుచేసుకున్నాయి.

మన దేశానికి పొరుగునే వున్న భూటాన్‌ కూడా నో మాస్కు ఆదేశాలు జారీ చేసింది. భూటాన్ చాలా చిన్న దేశం. కరోనా పుట్టిన చోటైన చైనా.. కరోనా రెండో దశ ప్రభావానికి తల్లడిల్లుతున్న భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న భూటాన్.. కరోనా వ్యాప్తిని ముందుగానే గ్రహించి పూర్తి లాక్‌డౌన్‌ పెట్టక పోయినా కఠినమైన ఆంక్షలు, నిబంధనలు, వ్యాక్సినేషన్‌తో ప్రజలను కాపాడుకుంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడి ప్రభుత్వం రెండు వారాల్లోనే దేశంలోని 90 శాతం ప్రజలకు వ్యాక్సిన్‌ ఇచ్చింది. ఆ ధైర్యంతోనే భూటాన్‌ను మాస్క్‌ ఫ్రీ దేశంగా ప్రకటించుకుంది. దాదాపు 7.79 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటి వరకు 1,882 కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరు మాత్రమే కరోనా కారణంగా మృతి చెందారు.

ఇక కరోనా పుట్టినిల్లు చైనా కూడా మాస్కు తప్పనిసరి అన్న నిబంధనను ఉపసంహరించుకుంది. కరోనా వ్యాప్తి ఎక్కడైతే మొదలైందో.. ఆ దేశంలో ప్రజలు ఇప్పుడు మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. మొదట్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగి ఆందోళనకు గురైన చైనా.. ఆ తర్వాత కఠినమైన లాక్‌డౌన్‌ విధించి వైరస్ వ్యాప్తిని నియంత్రించింది. ఎక్కడికక్కడ తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించి.. సరైన సమయంలో చికిత్స అందించి ప్రజలను రక్షించింది. సొంతగా వ్యాక్సిన్‌ కనిపెట్టి వ్యాక్సినేషన్‌ను వేగంగా చేపట్టింది. దాదాపు ప్రజలంతా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అందుకే చైనాలో సాధారణ పరిస్థితులు తొందరగా వచ్చేశాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఇప్పటివరకు 91.5వేల కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు, 4,636 మరణాలు మాత్రమే నమోదయ్యాయి.

ఎలాంటి పరిస్థితులనైనా మహిళలు సమర్థంగా ఎదుర్కొంటారని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ ప్రూవ్ చేశారు. తమ దేశంలోకి కరోనా వ్యాపించిదని తెలియగానే వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టారు. కరోనా కట్టడికి ఆమె అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో న్యూజిలాండ్‌ తొందరగానే కరోనా రహిత, మాస్క్‌ ఫ్రీ దేశంగా మారింది. జెసిండా కృషిని ప్రపంచం ప్రశంసించింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్‌లో 2,714మంది కరోనా బారిన పడగా.. 26 మంది మరణించారు.

జులై నుంచి దక్షిణ కొరియా కూడా మాస్క్‌ ఫ్రీ దేశంగా మారనుంది. కరోనా వ్యాక్సిన్‌ ఒక్క డోసు వేసుకున్నా మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చని ఆ దేశ ప్రధాని కిమ్‌ బూ-క్యుమ్‌ ఇటీవల ప్రకటించారు. ఇప్పటి వరకు కేవలం 7.7 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సెప్టెంబరు నాటికి కనీసం 70 శాతం మందికి టీకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ద.కొరియాలో మొత్తం లక్షన్నర కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,996 మంది కరోనా వల్ల చనిపోయారు.