Imran Khan: రిటైర్ట్‌హర్ట్ అయ్యే ప్రసక్తే లేదు.. లాస్ట్ బాల్ వరకు ఆడతా.. విక్టరీ సాధిస్తా: పాక్ ప్రధాని ఇమ్రాన్
'ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను. చివరి బంతి వరకు ఆడతాను. విపక్షాలు ఆశ్చర్యపోయేలా చేస్తాను' అంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

Pakistan PM Imran Khan: ‘ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను. చివరి బంతి వరకు ఆడతాను. విపక్షాలు ఆశ్చర్యపోయేలా చేస్తాను’ అంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజానికి ఆయన అనుకున్నట్టు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. ఈ విషయం ఇమ్రాన్‌కు కూడా తెలుసు. క్రికెట్‌లో మిరాకిల్స్ జరిగితే జరగవచ్చు కానీ., ఇది ఫక్తు రాజకీయ సమరం. ఇక్కడ గెలవడం అంత సులభం కాదు.. అసలు అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే దానికి ముందే ఆయనకు అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి.
అధికార కూటమి తెహ్రీక్ ఇ ఇన్సాఫ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకాలం ప్రభుత్వానికి బాసటగా నిలిచిన మూడు మిత్రపక్ష పార్టీలు ఇమ్రాన్ జట్టును వీడాయి. నిజానికి ఆ పార్టీలపై ఇమ్రాన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానంలో తనకు మద్దతుగా నిలుస్తాయని భావించారు. కానీ ఎంక్యూఎం-ఊపీ, పీఎంఎల్-క్యూ, బీఏపీలు అధికార కూటమి నుంచి వైదొలగాలని గట్టిగా నిర్ణయించడంతో పీటీఐలో కాసింత గుబులు, వణుకు మొదలయ్యాయి. మద్దతు ఇవ్వకపోతే పోనీ, ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని డిసైడయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి.
నాలుగేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఇమ్రాన్‌కు ఇది ఊహించని శరాఘాతం! ఇదే సమయంలో అవిశ్వాసానికి ముందే సొంత పార్టీ సభ్యులు కూడా ఇమ్రాన్‌కు హ్యాండిస్తున్నారు. ఇప్పటికే పీటీఐకే చెందిన 24 మంది చట్ట సభ్యులు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించారు. ఇమ్రాన్ ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను గమనించి ఇంకొందరు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మిత్రపక్షాలు కూడా అంతే.. నిన్నటి వరకు ఇమ్రాన్‌కు అండగా నిలుస్తామని చెప్పి, సడన్‌గా మాట మార్చేశాయి.
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో విపక్షాలు ఈ నెల 8వ తేదీనే అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఈ నోటీసులను తేలిగ్గా తీసుకున్నారు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు ప్రతికూలంగా మారడం మొదలయ్యాయి. రాజకీయ సమీకరణాలన్నీ ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా మారుతున్నాయి. విపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఇమ్రాన్ అంటున్నారు. తనను అధికారంలోంచి దింపేయాలని విపక్షాలు చూస్తున్నాయి కానీ అది వాటికే ప్రమాదమని ఇమ్రాన్ హెచ్చరిస్తున్నారు. శనివారం రోజున ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు ఇమ్రాన్.. ఈ ర్యాలీతో తన బలాన్ని చాటుకోవాలన్నది ఇమ్రాన్ ఆశయం. మొత్తం 342 సభ్యులు కలిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నుంచి బయటపడటానికి 172 ఓట్లు అవసరమవుతాయి. అంటే అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఇమ్రాన్‌కు 172 మంది సభ్యుల అండదండలు కావాలి. దిగువ సభలో ప్రభుత్వానికి ఉన్నవి కేవలం 155 స్థానాలు మాత్రమే. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలుపుకుని ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చారు. నిన్నటి వరకు మిత్రపక్షాలకు చెందిన 20 మంది సభ్యులు ఇమ్రాన్‌కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వారు హ్యాండివ్వడంతో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పతనం అంచున నిలిచింది.
కళ్ల ముందట గణాంకాలు ఇంత స్పష్టంగా ఉన్నా ఇమ్రాన్‌ఖాన్ మాత్రం అవిశ్వాసంపై కొండంత విశ్వాసంతో ఉన్నారు. విపక్షాలు తమ దగ్గర ఉన్న కార్డులన్నీ వాడేశాయని, తన దగ్గర ఉన్న తురుపుముక్కను ఇంకా బయటకు తీయలేదని ఇమ్రాన్ చెబుతున్నారు. ఆర్మీపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదని విపక్షాలను హెచ్చరించారు. తాను ఇంతకు ముందు తటస్థ వైఖరి గురించి చేసిన వ్యాఖ్యలను విపక్షాలే తప్పుదోవ పట్టించాయని, ఆర్మీ కూడా అపార్థం చేసుకుందని అంటున్న ఇమ్రాన్‌ఖాన్ ఇప్పటికీ ఆర్మీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఆర్మీ లేకపోతే దేశం మూడు ముక్కలయ్యేదన్నారు. జాతీయ అసెంబ్లీలో ఈ నెలాఖరున జరిగే అవిశ్వాస తీర్మానానికి తన బలం క్రమంగా పెరుగుతూ వస్తున్నదని చెబుతున్నారు.
పాకిస్తాన్‌లో ప్రస్తుత ఆర్ధిక సంక్షోభానికి ఇమ్రాన్ ప్రభుత్వమే కారణమని విపక్షాలు అంటున్నాయి. విపక్షాలతో ముత్తహిదా ఖౌమీ మూవ్‌మెంట్-పాకిస్తాన్, ది పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఖాయీద్, బలోచిస్తాన్ అవామీ పార్టీలు స్వరం కలిపాయి. నిన్నటి వరకు ఈ మూడు పార్టీలు ఇమ్రాన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఈ మూడు పార్టీలకు కలిపి 17 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇమ్రాన్ సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కు చెందిన 24 మంది సభ్యులు ఇప్పటికే ప్రతిపక్షాలతో చేరిపోయారు. వీరి వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఒకవేళ న్యాయస్థానం వీరిని అనర్హులుగా ప్రకటిస్తే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇమ్రాన్‌కు కావాల్సింది కూడా ఇదే!
ఆర్ధిక సంక్షోభం అంటూ విమర్శలు చేస్తున్న విపక్షాల నోళ్లకు తాళం వేయడానికి ఇమ్రాన్‌కాను విద్యుత్, పెట్రోల్ ధరలను తగ్గించారు. సాంఘిక సంక్షేమ పథకం ఎహ్‌సాస్ కింద మరిన్ని రాయితీలు ఇస్తామన్నారు. వీటికి ప్రభుత్వాన్ని నిలిపేటంత శక్తి ఉందా అన్నది చూడాలి. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని తొలగించడానికి ఇంతకు ముందు 13 సార్లు విపక్షాలు ప్రయత్నించాయి. అప్పుడు సక్సెస్ కాలేకపోయాయి.. ఈసారి మాత్రం చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నాయి.
Read Also….India-China Border Dispute: జమ్మూకశ్మీర్‌పై ఇతరుల జోక్యం అనవసరం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!
Hijab Row: హిజాబ్ కేసుకు పరీక్షలతో సంబంధం లేదు.. వెంటనే విచారణ చేపట్టలేమన్న సుప్రీంకోర్టు!
