UK PM Rishi: బ్రిటన్‌లో వలసల నియంత్రణ.. ! విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించే యోచనలో రిషి సునాక్‌

దేశంలో  విద్యార్థుల వలసలు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు కొత్త విధానం తీసుకురావాలని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భావిస్తున్నారు. అయితే, ఇదంత సులభం కాదని నిపుణులంటున్నారు.

UK PM Rishi: బ్రిటన్‌లో వలసల నియంత్రణ.. ! విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించే యోచనలో రిషి సునాక్‌
Rishi Sunak
Follow us

|

Updated on: Nov 27, 2022 | 6:39 AM

బ్రిటన్ ప్రధానిగా  బాధ్యతలను చేపట్టిన రిషి సునాక్ పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టారు. దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి నానాటికీ పెరుగుతున్న వలసలపై బ్రిటన్‌ ప్రభుత్వం కలవరం చెందుతోంది. దేశంలో  విద్యార్థుల వలసలు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు కొత్త విధానం తీసుకురావాలని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భావిస్తున్నారు.

బ్రిటన్‌లో భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువు కోసం లండన్‌కు క్యూ కడుతున్నారు. బ్రిటన్‌లో విదేశీ విద్యార్థుల పరంగా భారతదేశం మొదటి స్థానంలో ఉంది. గత 3 సంవత్సరాలలో భారతీయ విద్యార్థులకు యునైటెడ్ కింగ్‌డమ్ మంజూరు చేసిన UK వీసాల సంఖ్య 273 శాతం పెరిగింది. ఈ గణాంకాలను UK హోమ్ ఆఫీస్ విడుదల చేసింది. యూకే వీసాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడంతో.. భారత్‌, చైనాను కూడా అధిగమించింది. ఈ నేపథ్యంలో విద్యార్థి వీసాలను తగ్గించడంతోపాటు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులపై కొన్ని ఆంక్షలు విధించబోతున్నారని, పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీలకోసం వచ్చే విద్యార్థులు, డిపెండెంట్‌ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఈ ఆంక్షలు ఉంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఒకవేళ సునాక్‌ ప్రభుత్వం వలసల నియంత్రణకు ఏవైనా చర్యలు తీసుకుంటే, అది కచ్చితంగా భారతీయులపైనే అధికంగా ఉంటుంది.

అయితే, ఇదంత సులభం కాదని నిపుణులంటున్నారు. విద్యార్థులను నియంత్రించాలనే ఆలోచన ఇటు బ్రిటన్‌ విద్యావ్యవస్థను దెబ్బతీస్తుందంటున్నారు. బ్రిటన్‌లో కొన్ని విశ్వవిద్యాలయాలు పూర్తిగా విదేశీ విద్యార్థులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఆంక్షలు గనుక విధిస్తే ఇలాంటి యూనివర్సిటీలు దాదాపు మూతబడే పరిస్థితి తలెత్తు తుందని హెచ్చరిస్తున్నారు. వలసల విషయంలో వివాదాలు, విమర్శలను ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రభుత్వానికి ఇదొక పెద్ద సవాల్‌గా మారింది. సున్నితమైన, ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని సునాక్‌ ఎలా డీల్‌ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, యూకేలోని వలసదారుల గణాంకాల నుంచి అంతర్జాతీయ విద్యార్ధుల జాబితాను తొలగించాలని యూకే ప్రభుత్వానికి భారత వలస విద్యార్ధుల నేతృత్వంలోని విద్యార్ధి సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..