ఫ్రాన్స్‌లో మోదీతో ట్రంప్ భేటీ..! G7 సదస్సు వేదికగా ట్రేడ్ డీల్‌పై కీలక చర్చలు..
ఫ్రాన్స్ వేదికగా G7 జరగనుంది. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సులో అందరి కళ్లూ ఇప్పుడు ఇద్దరు అగ్రనేతలపైనే ఉన్నాయి. వారే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య స్తబ్దతకు ఈ భేటీతో బ్రేక్ పడబోతుందా..? అనే విషయాలు తెలుసుకుందాం..

ఈ నెలలో ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక G7 సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరవుతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించి డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. జూన్ 14న వైట్ హౌస్ సౌత్ లాన్‌లో జరిగే యూఎఫ్‌సీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైట్స్ ముగిసిన వెంటనే తాను ఫ్రాన్స్ బయలుదేరుతానని ప్రకటించారు. ‘‘అమెరికా చరిత్రలోనే అత్యంత వినోదాత్మకమైన రాత్రి కాబోతున్న UFC ఫైట్స్ ముగిసిన వెంటనే నేను G7 సదస్సు కోసం ఫ్రాన్స్ వెళ్తున్నాను. వైట్ హౌస్ చరిత్రలో గతంలో చిన్న స్థాయి ఫైట్స్ జరిగాయి కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఛాంపియన్లు తలపడే ఇలాంటి భారీ ఈవెంట్‌ను పీపుల్స్ హౌస్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
భారత సహకారం కీలకం
ఫ్రాన్స్‌లోని ఎవియాన్ లే బైన్స్ నగరంలో జూన్ 15 నుండి 17 వరకు G7 సదస్సు జరగనుంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ప్రపంచ దేశాల అధినేతలతో ట్రంప్ ముఖాముఖి చర్చలు జరపడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఈ సదస్సుకు భారత్‌ను భాగస్వామ్య దేశంగా ఫ్రాన్స్ ఆహ్వానించింది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్‌ల మధ్య జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ భాగస్వామ్యాన్ని ఫ్రాన్స్ ధృవీకరించింది. అయితే ఈ పర్యటనపై భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘‘ఎవియాన్ సదస్సులో ప్రధాని మోదీ భాగస్వామ్యాన్ని ధృవీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. స్థూల ఆర్థిక అసమతుల్యతలు, అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారత్ అందించే సహకారం కీలకమైనది’’ అని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరు దేశాల సంబంధాలు బలోపేతం..!
గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వీరిద్దరూ చివరిసారిగా కలుసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ విధించిన టారిఫ్‌లు, ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ పెండింగ్‌లో పడటం, రష్యా నుండి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడంపై వాషింగ్టన్ విమర్శలు గుప్పించడంతో భారత్-అమెరికా సంబంధాల్లో కొంత స్తబ్దత నెలకొంది. మోదీ, ట్రంప్ ఫోన్ ద్వారా టచ్‌లో ఉన్నప్పటికీ, ముఖాముఖి భేటీ మాత్రం జరగలేదు. ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్న వాణిజ్య ఒప్పందాలపై ఈ భేటీ ద్వారా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. “ట్రంప్ విధించిన టారిఫ్‌లను కోర్టులు కొట్టివేయడంతో ఆయన ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు. ఈ తరుణంలో మోదీ ట్రంప్ మధ్య జరిగే సమావేశం ఇరు దేశాల పరస్పర అవగాహనను పెంచడానికి, సంబంధాలను మళ్లీ బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది” అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు రాబిందర్ సచ్‌దేవ్ విశ్లేషించారు.
