AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: శాంతియుత నిరసనపై హింసాత్మక దాడి.. మహిళలపై తాలిబన్ల దౌర్జన్యం.. వెంబడించి మరీ..

అఫ్గానిస్థాన్ (Afghanistan) లో తాలిబన్ (Talibans) ప్రభుత్వ నిర్ణయాలు మరోసారి వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కాగా.. దేశంలో అధికారం...

Afghanistan: శాంతియుత నిరసనపై హింసాత్మక దాడి.. మహిళలపై తాలిబన్ల దౌర్జన్యం.. వెంబడించి మరీ..
Taliban
Ganesh Mudavath
|

Updated on: Aug 13, 2022 | 6:22 PM

Share

అఫ్గానిస్థాన్ (Afghanistan) లో తాలిబన్ (Talibans) ప్రభుత్వ నిర్ణయాలు మరోసారి వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కాగా.. దేశంలో అధికారం చేజిక్కించుకుని ఏడాది సమీపిస్తున్న సమయంలో మరోసారి తాలిబన్లు తమ ఉనికిని చాటుకున్నారు. మరోసారి మహిళలపై విరుచుకుపడ్డారు. తమ హక్కుల కోసం కాబూల్ (Kabul) లో నిరసన చేపట్టిన మహిళలను హింసాత్మకంగా అణచివేశారు. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వెంబడించి మరీ వారిపై దాడులకూ పాల్పడినట్లు కథనాలు వస్తున్నాయి. గతేడాది ఆగస్టు 15న అధికారం చేపట్టిన తాలిబన్లు అప్పటినుంచి మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 40 మంది మహిళలు ఉద్యోగం, రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కాబుల్‌లోని ఆందోళన చేశారు. ఆహారం, స్వేచ్ఛ, పని కావాలంటూ నినాదాలు చేశారు. ఆగస్టు 15-బ్లాక్ డే అని రాసున్న ప్లకార్డును ప్రదర్శించారు. ఈ నిరసనతో తాలిబన్ ప్రభుత్వానికి కోపం కట్టలు తెంచుకుంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు తుపాకులతో గాల్లో కాల్పులు జరిపారు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి మహిళలు చెల్లాచెదురయ్యారు. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. సమీపంలోని దుకాణాల్లో తలదాచుకున్నారు. వారిని గమనించిన తాలిబన్లు మహిళా నిరసనకారులను వెంబడించి మరీ దాడులు చేశారు.

కాగా.. గతంలోనూ మహిళల పట్ల తాలిబన్లు పరిపాలన చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. దేశంలోని మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని నిలిపివేసింది. డ్రైవింగ్ టీచర్లకు కూడా ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలను జారీ చేసినట్లు ప్రకటించింది. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకోవడానికి ముందు ప్రధాన నగరాల్లో మహిళలు డ్రైవింగ్ చేసేవారు. కాగా.. ఈ నిర్ణయంతో వారు డ్రైవింగ్ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అఫ్గానిస్థాన్ లో మానవ హక్కుల పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పోరాటాలు ముగిసినప్పటికీ, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఇటీవలి బాలికల విద్యపై నిషేధం విధించింది. వారు ఆరో తరగతి కంటే ఎక్కువ చదవకూడదని ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. ఉపాధ్యాయుల కొరత కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి తాలిబన్ ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..