Sunita Williams: బక్కచిక్కిపోయిన సునీత.. వైరల్‌గా ఫోటో.. ఆమె ఆరోగ్యంపై స్పందించిన నాసా
అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్‌కి ఏమైంది...? ఇలా అయిపోయారేంటి...? నిజంగానే అరోగ్యం క్షీణించిందా...? ఆమె సేఫ్‌గా భూమ్మీద ల్యాండ్ అవుతారా...? అసలు నాసా ఏమంటోంది...? ఇప్పుడివే ప్రశ్నలు హాట్‌టాపిక్‌గా మారాయి. సునీత విలియమ్స్ లేటెస్ట్ ఫోటోలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాగా బక్కచిక్కి, జీవం లేకుండా కనిపిస్తుండటం టెన్షన్ పెడుతోంది...!
సునీత విలియమ్స్.. స్పేస్‌లోకి వెళ్లకముందు ఫోటో.. తాజాగా స్పేస్‌లో ఉన్న ఫోటో చూస్తే ఎంతో తేడా కనిపిస్తోంది. సునీత విలియమ్స్ బరువు తగ్గి… బాగా బక్కిచిక్కిపోయారు. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ముఖంలోనూ కళ తప్పింది. జీవంలేనట్లు అనారోగ్యంగా కనిపిస్తున్నారు. బయటకొచ్చిన ఈ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. గత ఫొటోలకు ప్రస్తుత ఫోటోను కంపేర్ చేస్తూ విలియమ్స్ ఆరోగ్యంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దాదాపు 6నెలలు పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీతకు స్పేస్ ఎనీమియా వచ్చే ముప్పు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో డిబేట్లు జరుగుతున్నాయి.
2024 జూన్5న ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్‌ఎస్ వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్… బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల వల్ల అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. పలుసార్లు భూమిమీదకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. అప్పడప్పుడు స్పేస్ నుంచే ఇద్దరు మాట్లాడారు. అమెరికా ఎన్నికలు సహా చాలా అంశాలపై స్పందించారు. ఇప్పుడు సడెన్‌గా ఈ ఫోటో చూసి సునీత హెల్త్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది.
సునీత ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో నాసా స్పందించింది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్ సహా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది. సునీత ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్లు కూడా సునీతా ఆరోగ్యంపై స్పందించారు. ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, అందువల్లే బలహీనంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
మొత్తంగా… సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమి మీదకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే వీరిద్దరు 2025 ఫిబ్రవరికి భూమి మీదకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..