AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన షాబాజ్ షరీఫ్.. అసిఫ్ అలీ జర్దారీకి అధ్యక్ష పదవి..

పాకిస్థాన్ ప్రధాని పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. పాక్ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో నిరసనల మధ్య 201 ఓట్ల మద్దతుతో రెండోసారి ప్రధాని పదవిని సొంతం చేసుకున్నారు షరీఫ్..

పాక్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన షాబాజ్ షరీఫ్.. అసిఫ్ అలీ జర్దారీకి అధ్యక్ష పదవి..
Pakistan Pm
Ravi Kiran
|

Updated on: Mar 03, 2024 | 6:38 PM

Share

పాకిస్థాన్ ప్రధాని పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. పాక్ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో నిరసనల మధ్య 201 ఓట్ల మద్దతుతో రెండోసారి ప్రధాని పదవిని సొంతం చేసుకున్నారు షరీఫ్. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్, బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కలయికలో సరికొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సపోర్ట్ ఉన్న ఇండిపెండెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. PML-N, PPP కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయాజ్ సాదిక్‌ పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. షాబాజ్ గత ఆగస్టు 2023 వరకు 16 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. PML-N, PPP కూటమి ఒప్పందంలో భాగంగా నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. PPP నాయకుడు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి అధ్యక్ష పదవి దక్కనుంది.

ఇమ్రాన్ ఖాన్ PTIతో పొత్తుపెట్టుకున్న స్వతంత్ర అభ్యర్థులు 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు గాను 93 స్థానాల్లో విజయం సాధించారు. జాతీయ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ సారథ్యంలోని PML-N 75 స్థానాల్లో విజయం సాధించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జాతీయ అసెంబ్లీలో 54 సీట్లు సాధించింది. దీంతో కొన్ని వారాలుగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. అయితే సుదీర్ఘ చర్చల తరువాత PML-N, PPP పార్టీలు పలువురు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానిగా ఎన్నికైన తరువాత పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు ప్రధాని షరీఫ్. ఆకాశాన్నంటుతున్న కరెంటు, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. పన్నుల ఎగవేత అంశాన్ని సమీక్షిస్తానని.. ఈ సమస్యను పరిష్కరిస్తే పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉంటుందని షరీఫ్ తెలిపారు.