Russia – Ukraine War: ఉక్రెయిన్‌లోని రెస్టారెంట్‌పై రష్యా క్షిపణి దాడులు.. చిన్నారి సహా నలుగురు మృతి..
Russia - Ukraine War: రష్యా.. ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయి ఏడాదికి పైగా అవుతోంది. అయినప్పటికీ.. హింసాకాండ మాత్రం ఆగడం లేదు.. తాజాగా.. రష్యా దాడుల్లో చిన్నారి సహా నలుగురు మరణించారు.

Russia – Ukraine War: రష్యా.. ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయి ఏడాదికి పైగా అవుతోంది. అయినప్పటికీ.. హింసాకాండ మాత్రం ఆగడం లేదు.. తాజాగా.. రష్యా దాడుల్లో చిన్నారి సహా నలుగురు మరణించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్స్క్ లో మంగళవారం సాయంత్రం రష్యా దాడులు నిర్వహించింది. రష్యా క్షిపణి దాడిలో ఒక చిన్నారితో సహా నలుగురు మరణించారు. ఇంకా పలువురు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించారు. డోనెట్స్క్ ప్రాంతానికి చెందిన సైనిక అధికారి పావ్లో కైరిలెంకో ప్రకారం.. మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం సుమారు 7:30 గంటలకు క్షిపణి దాడులు జరిగాయి.
సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పావ్లో తెలిపారు. ఉక్రెయిన్‌లోని క్రామాటోర్స్క్ ప్రాంతంలోని సిటీ సెంటర్ లో దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుందని.. ఇక్కడ అనేక రెస్టారెంట్లు, షాపులు ఉన్నాయని తెలిపారు. మొదటి క్షిపణి దాడి నగరంలో జరగగా.. రెండవ క్షిపణి దాడి నగర శివార్లలోని ఒక గ్రామాన్ని తాకినట్లు పేర్కొన్నారు.
రష్యా ఉద్దేశపూర్వకంగానే రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుందని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇహోర్ క్లైమెన్కో టెలిగ్రామ్ లో పేర్కొన్నారు. దాడులు జరిగిన వెంటనే అత్యవసర సేనలు క్షతగాత్రులను ఆదుకున్నాయని తెలిపారు.




కాగా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫిబ్రవరి 24, 2022న ప్రారంభమైంది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఏడాది పైగా యుద్ధం జరుగుతూనే ఉండటం.. స్థానికుల్లో కలకలం రేపుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..