Ashraf Ghani: హెలికాప్టర్‌ నిండా డబ్బుతో అష్రాఫ్‌ ఘనీ పారిపోయాడు.. కీలక వ్యాఖ్యలు చేసిన రష్యన్ రాయబారి

Ashraf Ghani: హెలికాప్టర్‌ నిండా డబ్బుతో అష్రాఫ్‌ ఘనీ పారిపోయాడు.. కీలక వ్యాఖ్యలు చేసిన రష్యన్ రాయబారి
Ashraf Ghani Helicopter

Afghanistan Crisis: నాలుగు కార్లు డబ్బుతో నింపుకున్నారు, తన వెంట తెచ్చుకున్న డబ్బును హెలికాప్టర్‌లో నింపడానికి ప్రయత్నించారు,

Sanjay Kasula

|

Aug 16, 2021 | 7:52 PM

ఇరవైఏళ్ల తర్వాత అమెరికా సేనలు ఇంటి మొహం పట్టడంతో ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు ఘనీ అధికారాన్ని తాలిబన్లకు అప్పగించారు. అష్రాఫ్‌ ఘనీ అఫ్గాన్‌లోనే ఓ గొప్ప విద్యావేత్త, ఆర్థికంగా నష్టపోయిన దేశాలపై అధ్యయనం చేసిన ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇంతటి మేధావి కూడా  చివరికి అధికారాన్ని తాలిబన్లకు కట్టబెట్టిన తర్వాత కాబూల్ వదిలిపెట్టాడు. అయితే  అష్రఫ్ ఘని ఆదివారం రాజధాని కాబూల్ నుంచి వెళ్తూ.. నాలుగు కార్లు.. హెలికాప్టర్‌ నిండా నగదు నింపుకుని ఎగిరిపోయారని రష్యన్ రాయబార కార్యాలయం ప్రతినిధులు అంటున్నారు. అంతర్జాతీయ మీడియాతో రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి నికితా ఇష్చెంకో మాట్లాడుతూ..  “నాలుగు కార్లు డబ్బుతో నింపుకున్నారు, తన వెంట తెచ్చుకున్న డబ్బును హెలికాప్టర్‌లో నింపడానికి ప్రయత్నించారు, కానీ అందులో నింపేందుకు ఇబ్బంది పడ్డారు. కొంత డబ్బు రోడ్డుపై పడిపోయింది.” ఈ సమాచారాన్ని ఆయన రష్యన్ వార్తా సంస్థ RIAతో తెలిపారు. అయితే ఎంత మొత్తం వెంట తీసుకెళ్లిన సంగతిని అధికారికంగా చెప్పలేక పోతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తుపై అస్థిరత మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుత ఘని ఆచూకీ తెలియడం లేదు. ఘనీని తీసుకెళ్తున్న విమానం తజికిస్తాన్‌లో దిగడానికి అనుమతి నిరాకరించడంతో ఒమన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఘనీ యునైటెడ్ స్టేట్స్ వెళ్తున్నట్లు సమాచారం.

ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరే ముందు తన ఫేస్‌బుక్ పోస్ట్‌ను పెట్టారు. రక్తపాతాన్ని నివారించడానికి తాను అలా చేస్తున్నానని ఘనీ చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్లు ఆదివారం ప్రవేశించారు. ‘‘దేశ ప్రజలారా..! ఈరోజు నేను ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గత 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నా దేశాన్ని వీడడం.. లేక అధ్యక్ష భవనంలోకి  ప్రవేశించాలనుకుంటున్న సాయుధ తాలిబన్లను ఎదుర్కోవడం అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే నా ముందున్నాయి. ఇంకా అనేక మంది దేశ ప్రజలు అమరులవ్వడం, కాబుల్‌ నగరం విధ్వంసం కావడం.. ఈ పరిణామాలు అతిపెద్ద మానవ సంక్షోభాన్ని మిగులుస్తాయి. తాలిబన్లు నన్ను దించేయాలని నిర్ణయించుకున్నారు. కాబుల్‌ నగరాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. ఈ ఘోర రక్తపాతాన్ని నివారించడం కోసమే నేను దేశం వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని ఘనీ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

ఆ దేశ పాశ్చాత్య శిక్షణ పొందిన భద్రతా దళాలు దూకుడుగా ఉన్న తాలిబాన్లకు లొంగిపోయాయి. ఈ నెలాఖరులోగా అమెరికా దళాలను పూర్తిగా ఉపసంహరించుకునే ముందు ఈ తాలిబాన్లు మొత్తం దేశంపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో దాక్కున్నారు. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చిపడుతుందో అని వణికిపోతున్నారు. రాజధాని నగరం కాబుల్‌లోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద తాలిబాన్లు కనిపిస్తున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.

శాంతి తిరిగి వచ్చేనా..

తాలిబాన్లు వేలాది మంది ఖైదీలను విడుదల చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన క్రూరమైన పాలన జ్ఞాపకాలు ఇప్పుడు అక్కడవారిని వెంటాడుతున్నాయి. దశాబ్దాల పోరాటంలో తన ఇద్దరు సోదరులు.. మరొక బంధువును కోల్పోయిన తర్వాత ఇప్పుడు శాంతి కోసం ఎదురు చూస్తున్నానని కాబూల్ నివాసి వహీదుల్లా ఖాదిరి మీడియాకు వెల్లడించారు. చాలా మంది దేశం విడిచి వెళ్లడానికి కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వందలాది మంది విమానాశ్రయంలో పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: అయ్యో.. విమానం రెక్కలపై నుంచి జారి పడ్డారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన చివరి ప్రయత్నం విఫలం..

HURL Recruitment: హిందూస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నేడే చివరి తేదీ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu