AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Qatar: విద్యార్థి మృతితో ఖతర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. శాశ్వతంగా పాఠశాల అనుమతులు..

పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఏదైనా జరగరాని ఘటన జరిగితే.. ప్రారంభంలో హడావుడి చేసి.. ఆతర్వాత.. ఆసంస్థపై ఎటువంటి చర్యలు ఉండవు.. అది మన దేశంలో లేదా రాష్ట్రంలో పరిస్థితి.. కేవలం ఘటనకు..

Qatar: విద్యార్థి మృతితో ఖతర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. శాశ్వతంగా పాఠశాల అనుమతులు..
Minsa
Amarnadh Daneti
|

Updated on: Sep 14, 2022 | 1:39 PM

Share

Qatar: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఏదైనా జరగరాని ఘటన జరిగితే.. ప్రారంభంలో హడావుడి చేసి.. ఆతర్వాత.. ఆసంస్థపై ఎటువంటి చర్యలు ఉండవు.. అది మన దేశంలో లేదా రాష్ట్రంలో పరిస్థితి.. కేవలం ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటారు. కాని ఖతార్ లో మాత్రం అలాకాదు. ఏదైనా పొరపాటు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవనే విషయం మనందరికి తెలుసు. తాజాగా ఓ విద్యార్థి మరణానికి పాఠశాల నిర్లక్ష్యం కారణమని గుర్తించిన ఖతార్ ప్రభుత్వం.. పాఠశాలను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించింది. కేరళకు చెందిన అభిలాష్, సౌమ్య దంపతుల రెండో కుమార్తె మిన్షా మరియం జాకోబ్ తల్లిదండ్రులతో కలిసి ఖతర్ లో ఉంటోంది. ఈపాప ఖతార్ లోని అల్ వక్రాహ్ నగరంలోని కిండర్‌గార్డెన్‌ పాఠశాలలో చదువుతోంది. సెప్టెంబర్ 11వ తేదీ ఆదివారం తన పుట్టిన రోజు అయినప్పటికీ మిన్షా ఎప్పటిలాగే మారాం చేయకుండా పాఠశాలకు బయల్దేరింది. ఉదయాన్నే నిద్ర లేచి.. స్కూల్ బస్సేక్కేసింది. సీట్లో కూర్చొని.. తల్లిదండ్రులకు టాటా చెప్పి వెళ్లింది. అనంతరం గాఢ నిద్రలోకి జారుకుంది. బస్సు స్కూల్ వద్దకు చేరుకున్నా.. మిన్షాకు మెలకువ రాలేదు. తోటి విద్యార్థులు పాఠశాల లోపలకి వెళ్లిపోగా.. చిన్నారి మాత్రం బస్సులోనే పడుకుండిపోయింది.

పాప నిద్రలో ఉన్న విషయాన్ని బస్సు డ్రైవర్, అటెండర్ కూడా గమనించలేదు. ఈ క్రమంలోనే బస్సును లాక్ చేసి.. వెళ్లిపోయారు. దీంతో బస్సులో వేడి వాతావరణం ఏర్పడి.. ఊపిరాడకపోవడం మిన్షా తుదిశ్వాస విడిచింది. సుమారు నాలుగు గంటల తర్వాత బస్సు వద్దకు వచ్చిన.. బస్సు డ్రైవర్, స్కూల్ సిబ్బంది.. స్పృహ లేకుండా పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. మిన్షా మరణించినట్టు ధ్రువీకరించారు. కాగా.. విషయం తెలిసి, చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనపై ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ స్పందించింది.

విద్యార్థిని మరణానికి కారణమైన అల్ వక్రాలోని స్ప్రింగ్ ఫీల్డ్ కిండర్ గార్టెన్ పాఠశాలను మూసివేయాలని ఆదేశించింది. నాలుగేళ్ల మిన్సా మరియం జాకబ్ మృతికి పాఠశాల నిర్లక్ష్యమే కారణమని దృవీకరించింది. దీంతో పాఠశాలను శాశ్వతంగా మూసివేయాలని పేర్కొంది. అలాగే ముగ్గరు పాఠశాల బస్సు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. కాగా.. రెండు రోజుల పాటు సమగ్ర పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఖతార్‌లోని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఖతార్ విద్యా మంత్రి బుతైనా అల్-నుయిమి మిన్సా తల్లిదండ్రులను కలుసుకుని మృతురాలి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మిన్షా భౌతికకాయం కొచ్చిన్‌లోని నెడుంబస్సేరి విమానాశ్రయానికి చేరుకుంది. పాప అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..