North Korea: ఉత్తర-దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తత.. నువ్వా-నేనా అన్నట్టు ప్రయోగిస్తోన్న క్షిపణులు
ఉత్తరకొరియా-దక్షిణకోరియా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాలు నువ్వా-నేనా అన్నట్టు క్షిపణులు ప్రయోగిస్తున్నాయి.
North Korea tests missile: ఉత్తరకొరియా-దక్షిణకోరియా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాలు నువ్వా-నేనా అన్నట్టు క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఉత్తర కొరియా తాజాగా మరో మిసైల్‌ను పరీక్షించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విమాన నిరోధక క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది కొరియన్ వార్త సంస్థ. శత్రు దేశాల రాడార్లను కచ్చితత్వంతో ఢీకొట్టేలా దీన్ని అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు అక్కడి సైంటిస్టులు.
కొంత కాలంగా క్షిపణి ప్రయోగాలకు దూరంగా ఉన్నారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్. తాజాగా మరోసారి దూకుడు పెంచారు నార్త్‌కొరియా ప్రెసిడెంట్. వరుసగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ చిరకాల ప్రత్యర్థులు దక్షిణ కొరియా, అమెరికాలపై ఒత్తిడి పెంచుతున్నారు కిమ్. క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తున్న ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా గట్టి హెచ్చరికలు పంపింది. సాయుధ దళాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది సౌత్ కొరియా. తమ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పింది. భూమి, నీరు, ఆకాశంలో.. ఆ దేశ బలగాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
తమ ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టే ఎలాంటి ప్రయత్నాలనైనా సమర్థవంతంగా తిప్పికొడతామన్నారు దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్. శాంతి సుస్థిరతకు కావాల్సిన సహకారాన్ని అందిస్తామని పరోక్షంగా ఉత్తరకొరియాకు పిలుపునిచ్చారు ఇన్. ఇటీవల కిమ్ సిస్టర్ కూడా శాంతిమంత్రం జపించింది. కానీ మళ్లీ క్షిపణుల ప్రయోగంతో కథ మొదటికి వచ్చింది. ఈ రెండు దేశాల పంతం అమెరికాకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Read also: Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గల్లంతు విధంబెట్టిదనిన.. కేటుగాళ్ల జాబితా చాంతాడంత.!