Twitter Ban: ఆ దేశంలో ట్విట్టర్ బ్యాన్… దేశాధ్యక్షుడి ట్వీట్‌ను డెలీట్ చేసిన రెండ్రోజుల్లోనే..
Twitter Ban: ట్విట్టర్‌ను బ్యాన్ చేసిన దేశాల జాబితాలో మరో దేశం చేరిపోయింది. దేశాధ్యక్షుడు పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆ ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేయడంతో ట్విట్టర్ బ్యాన్‌కు గురైయ్యింది.
ట్విట్టర్‌ను బ్యాన్ చేసిన దేశాల జాబితాలో మరో దేశం చేరిపోయింది. దేశాధ్యక్షుడు పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆ ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేయడంతో ట్విట్టర్ బ్యాన్‌కు గురైయ్యింది. దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ ఆఫ్రికా దేశమైన నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు నైజీరియా సమాచార, సాంస్కృతిక మంత్రి అల్‌హాజి లాయ్ మొహ్మద్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. దేశంలో కార్పొరేట్ ఉనికిని అణచివేసే కార్యకలాపాల కోసం ట్విట్టర్‌ను వినియోగిస్తున్నందున ఫెడరల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తూ నైజీరియా ప్రభుత్వం వెనుక ఇతర కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారి రెండ్రోజుల క్రితం చేసిన ఓ పోస్ట్‌ను అభ్యంతరకరమైన పోస్ట్‌గా పరిగణిస్తూ దాన్ని ట్విట్టర్ డెలీట్ చేసింది. దీంతో పాటు ఆయన ట్విట్టర్ ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేసింది. దీనికి ప్రతీకారంగానే దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిలుపుదల చేస్తూ నైజీరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ వేదికను అధ్యక్షుడు దుర్వినియోగం చేస్తున్నందున ఆయన ఖాతాను సస్పెండ్ చేయాలంటూ పలువురు నెటిజన్స్ ట్విట్టర్‌కు రిపోర్ట్ చేశారు. అధ్యక్షుడిది అభ్యంతరకరమైన పోస్ట్‌గా నిర్థారించుకున్న తర్వాతే దాన్ని తొలగించడంతో పాటు ఆయన ఖాతాను 12 గం.ల పాటు సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. ట్విట్టర్ ఖాతాదారులకు సంబంధించిన మార్గదర్శకాలను అధ్యక్షుడు ఉల్లంఘించినందున… తాము తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సమర్థించుకుంది. అయితే దేశానికి మంచిది కాదని తాను భావించే అంశాలపై అభిప్రాయాన్ని వ్యక్తంచేసే హక్కు అధ్యక్షుడికి ఉంటుందని…దీన్ని అభ్యంతరకర పోస్ట్‌గా ట్విట్టర్ ఎలా తొలగిస్తుందని ఆయన మద్ధతుదారులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలను పెద్ద ఎత్తున వాడుకోవడంపై నైజీరియా ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ను బ్యాన్ చేయడంతో పాటు దేశంలో సోషల్ మీడియా వేదికలకు లైసెన్స్ జారీ కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. నైజీరియా బ్రాడ్‌కాస్ట్ కమిషన్ ద్వారా ఈ లైసెన్స్ జారీని అమలు చేయనున్నారు. సోషల్ మీడియాను నియంత్రించేందుకే ఈ లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని నైజీరియా ప్రభుత్వ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య గొంతుకలను అణచివేయడమేనని ఆరోపిస్తున్నారు.
విధ్వేషాలను రెచ్చగొట్టేందుకు ట్విట్టర్ వేదికను దుర్వినియోగం చేసినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ శాశ్వితంగా తొలగించడం తెలిసిందే.
నైజీరియా కంటే ముందు దాదాపు 8 దేశాలు తమ దేశాల్లో ట్విట్టర్ కార్యాకలాపాలను బ్యాన్ చేశాయి. ట్విట్టర్‌ను బ్యాన్ చేసిన దేశాల జాబితాలో చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, తుర్క్‌మెనిస్థాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ తదితర దేశాలు శాశ్వితంగా లేదా తాత్కాలికంగా ట్విట్టర్‌ను బ్యాన్ చేశాయి.పలు దేశాలు తాత్కాలికంగా ట్విట్టర్‌పై నిషేధాన్ని విధించి…ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశాయి.
ఇవి కూడా చదవండి..
12వ తరగతి విద్యార్థుల కోసం కీలక అప్‌డేట్… పూర్తి వివరాలు తెలుసుకోండి