ఆ దేశ ప్రజలకు ఉచితంగా సన్‌స్క్రీన్ లోషన్ పంపిణీ.. ప్రభుత్వ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉంది..!
తమ దేశ ప్రజలకు నెదర్లాండ్స్ ప్రభుత్వం ఉచితంగా సన్‌స్క్రీన్ లోషన్ పంపిణీ చేయనుంది. తీవ్ర ఎండల కారణంగా నెదర్లాండ్స్‌లో గత రెండు దశాబ్ధాల కాలంలో చర్మ క్యాన్సర్ కేసులు రికార్డు స్థాయికి చేరాయి. దీన్ని అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు ఉచితంగా..
తమ దేశ ప్రజలకు నెదర్లాండ్స్ ప్రభుత్వం ఉచితంగా సన్‌స్క్రీన్ లోషన్ పంపిణీ చేయనుంది. నెదర్లాండ్స్‌లో గత రెండు దశాబ్ధాల కాలంలో చర్మ క్యాన్సర్ కేసులు రికార్డు స్థాయికి చేరాయి. ఎండల తీవ్రత కారణంగా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండడం ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. చర్మ క్యాన్సర్ల సమస్యను అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు ఉచితంగా సన్‌స్క్రీన్ అందించాలని నెదర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సన్ క్రీమ్ డిస్పెన్సర్‌లను పాఠశాలలు, కాలేజీలు, పార్కులు, క్రీడా మైదానాలు సహా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బ్రెడా నగరంలో జరిగిన ఉత్సవంలో ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
దేశ ప్రజలు సన్‌స్క్రీన్ లోషన్లను విరివిగా వాడితే చర్మ క్యాన్సర్ అదుపులోకి వస్తుందన్న వైద్య నిపుణుల సలహా మేరకు ప్రభుత్వం దీన్ని ఉచితంగానే అందజేస్తోంది. అన్ని వయస్కులు సమ్మర్‌లో సన్‌స్క్రీన్ వాడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్నతనం నుంచే పిల్లలకు సన్‌స్క్రీన్ వాడటాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి.. తద్వారా పెద్దయ్యాక ఇది వారికి అలవాటుగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సన్ క్రీమ్స్ వాడకుండా పిల్లలు, పెద్దలు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
గతంలో కోవిడ్-19 కేసుల కట్టడి దిశగా నెదర్లాండ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని ప్రపంచ దేశాల మెప్పుపొందింది. అప్పట్లో శానిటైజర్లు ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచేలా బహిరంగ ప్రదేశాల్లో డిస్పెన్సర్లు ఏర్పాటు చేశారు. అదే తరహాలో ఇప్పుడు చర్మ క్యాన్సర్‌ను అరికట్టేందుకు సన్‌స్క్రీన్ లోషన్లను ప్రజలకు ఉచితంగానే అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..