AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి, 13 మందికి తీవ్ర గాయాలు!

టర్కీలో ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. ఇజ్మీర్ ప్రావిన్స్‌లోని అలియాగా ప్రాంతంలో ఉన్న హబాస్ (Habaş) ఇనుము, ఉక్కు కర్మాగారంలో సోమవారం భారీ పేలుడు సంభవించి, ఆ తర్వాత మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వెల్లడించారు. బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.

ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి, 13 మందికి తీవ్ర గాయాలు!
Massive Explosion At Turkey
Balaraju Goud
|

Updated on: Nov 10, 2026 | 6:58 AM

Share

టర్కీలో ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. ఇజ్మీర్ ప్రావిన్స్‌లోని అలియాగా ప్రాంతంలో ఉన్న హబాస్ (Habaş) ఇనుము, ఉక్కు కర్మాగారంలో సోమవారం భారీ పేలుడు సంభవించి, ఆ తర్వాత మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వెల్లడించారు. బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.

కేబినెట్ సమావేశం అనంతరం ఈ ఘటనపై స్పందించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు న్యాయ, పరిపాలనా విచారణలు ప్రారంభించినట్లు తెలిపారు. కర్మాగారంలో ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కొలిమిలో పడిన క్రేన్.. భారీ పేలుడు

ప్రాథమిక సమాచారం ప్రకారం, కర్మాగారంలోని బాయిలర్‌ను మార్చే పనులు జరుగుతుండగా క్రేన్ అదుపుతప్పి కొలిమిలో పడిపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ సులేమాన్ ఎల్బాన్ వెల్లడించారు. బాయిలర్ మార్పిడి పనుల కారణంగా కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేశారు. సాధారణంగా సుమారు 300 మంది కార్మికులు విధుల్లో ఉండే ఈ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన సమయంలో 200 మంది పనిచేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగినట్లు గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. పేలుడు అనంతరం కర్మాగారం నుంచి భారీగా మంటలు, దట్టమైన నల్లటి పొగలు వెలువడ్డాయి. ఈ దృశ్యాలను స్థానిక టెలివిజన్ ఛానల్ ఎన్‌టీవీ ప్రసారం చేసింది.

భూకంపం వచ్చినట్లు అనిపించింది.. ప్రత్యక్ష సాక్షులు

పేలుడు తీవ్రతకు సమీప ప్రాంతాలు ఒక్కసారిగా కంపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూమి బలంగా కంపించడంతో తొలుత భూకంపం వచ్చిందని భావించినట్లు నూరి అలీ ఉల్కర్, డెనిజ్ ఉల్కర్ అనే ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు అనడోలు వార్తా సంస్థకు వివరించారు. మరోవైపు, అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్ట్సీ మాట్లాడుతూ, అగ్నిమాపక, అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయని, బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రులకు తరలించి, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

ఐదుగురు అదుపులోకి.. విచారణ ముమ్మరం

ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు నలుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించినట్లు టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రైవేట్ వార్తా సంస్థ డెమిరోరెన్ వెల్లడించింది. ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఏటా 45 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి

1987లో స్థాపించిన హబాస్ కర్మాగారం ఏటా సుమారు 45 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. అలియాగా ప్రాంతం ప్రధాన ఓడరేవుతో పాటు నౌకల విడగొట్టే పరిశ్రమలకు కూడా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని పర్యావరణవేత్తలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, వాతావరణ మార్పుల నియంత్రణపై చర్చించేందుకు ప్రపంచ నాయకులు, పర్యావరణ కార్యకర్తలు అంటాల్యాలో సమావేశమవుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనతో టర్కీలో పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి
ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి
హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారా? క్లారిటీ ఇచ్చేశాడు
హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారా? క్లారిటీ ఇచ్చేశాడు
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అనా విడాకులు
'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అనా విడాకులు
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!