దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి.. ‘నా రోజును నాశనం చేసినందుకు థ్యాంక్స్’!
దీపావళి వస్తోందంటే ఉద్యోగులు కంపెనీల నుంచి వచ్చే బోనస్‌లు, గిఫ్ట్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. కొత్త బట్టలు, స్వీట్లు, కుటుంబంతో సరదాగా గడిపే సమయం. కానీ ఓ ఉద్యోగికి మాత్రం ఈసారి దీపావళి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. పండుగకు ముందు కంపెనీ అతడికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామంటూ లేఆఫ్ నోటీసు! దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆ ఉద్యోగి.. 'దీపావళి గిఫ్ట్‌గా లేఆఫ్ అందుకున్నాను.. నా రోజును నాశనం చేసినందుకు థ్యాంక్స్' అంటూ సోషల్ మీడియాలో ఆవేదనను వెళ్లగక్కాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

వర్క్‌ప్లేస్‌కు సంబంధించిన రెడ్డిట్ గ్రూప్‌లో ఓ ఉద్యోగి తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసాడు. కంపెనీ హెచ్‌ఆర్ నుంచి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందగానే తనకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని చెప్పాడు. ఒక్కసారిగా షాకైనట్లు, మనసంతా భారంగా మారిందని వివరించాడు.
తన కెరీర్ ఇప్పుడిప్పుడే ఒక స్థాయికి చేరుకుంటోందని, అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో ఈ పరిణామం ఎదురైందని వాపోయాడు. పండుగకు కొద్ది రోజుల ముందు కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేదని అన్నాడు. కనీసం పండుగ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతైనా ఆలోచిస్తారని ఆశించానని తెలిపాడు.
కుటుంబంతో డిసెంబర్‌లో టూర్.. ఆ ఆశలన్నీ ఆవిరేనా?
ఉద్యోగం కోల్పోవడం అతడి వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపింది. డిసెంబర్‌లో కుటుంబ సభ్యులను టూర్‌కు తీసుకెళ్లాలని ఎంతోకాలంగా ప్లాన్ చేసుకున్నారట. అందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కానీ ఉన్నట్టుండి ఉద్యోగం పోవడంతో ఆదాయం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని, దీంతో కుటుంబంతో టూర్ వెళ్లాలన్న తన కల నెరవేరుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఉద్యోగం పోయిన బాధ భవిష్యత్తుపై బెంగ తనను వెంటాడుతున్నాయని చెప్పాడు. చివరకు ఉద్యోగం లేని వ్యక్తిగా మిగిలిపోతానేమోనని భయపడుతున్నట్లు పోస్టులో తెలిపాడు. పరిస్థితులకు కుంగిపోకుండా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మార్కెటింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటే తనను సంప్రదించాలని నెటిజన్లను కోరాడు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, పెర్ఫార్మెన్స్ మార్కెటర్, యాడ్స్ మేనేజర్ వంటి పోస్టులు ఈ రంగానికి సంబంధించిన ఇతర ఉద్యోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.
‘నాకు కూడా పండుగకు ముందే లేఆఫ్ ఇచ్చారు’.. నెటిజన్ల స్పందన!
ఈ పోస్టు చూసిన పలువురు తమకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్స్ చేశారు. ఓ యూజర్ స్పందిస్తూ.. ‘నాకు కూడా ఇదే గిఫ్ట్ వచ్చింది. పండుగ సీజన్‌కు ముందే ఉద్యోగం కోల్పోయాను. వెంటనే కొత్త ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టు. నీకు ఊహించిన దానికంటే త్వరగానే మంచి అవకాశం దొరకవచ్చు’ అంటూ ధైర్యం చెప్పాడు.
మరో నెటిజన్.. ‘బ్రో.. ఉద్యోగం కోసం ప్రయత్నించు. ఇక్కడితో నీ ప్రయాణం ముగిసిపోదు. ఇంతకంటే మంచి స్థాయికి చేరుకుంటావు. ఈ పరిణామం నిన్ను ఎక్కువగా బాధించనివ్వకు’ అంటూ ప్రోత్సహించాడు.
మార్కెటింగ్ రంగంలో ప్రస్తుతం పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. ‘నేను కూడా మార్కెటింగ్ రంగంలోనే పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ విభాగంలో ఉద్యోగ మార్కెట్ చాలా దారుణంగా ఉంది. సరైన అవకాశం దొరక్క నేను కూడా ఇబ్బంది పడుతున్నాను’ అని ఓ యూజర్ అన్నాడు.
మరో రెడ్డిట్ యూజర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నా పుట్టినరోజు రోజే ఉద్యోగం కోల్పోయాను. నా పనితీరుకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చినప్పటికీ కంపెనీ నన్ను తొలగించింది. ఉద్యోగం పోయి చాలా కాలమే అవుతోంది. ఇప్పటికీ నిరుద్యోగిగానే ఉన్నాను. నువ్వు పడుతున్న బాధ, భవిష్యత్తుపై ఉన్న ఆందోళన నాకు పూర్తిగా అర్థమవుతున్నాయి. మనిద్దరి పరిస్థితులు త్వరలోనే మెరుగుపడాలని కోరుకుంటున్నాను’ అంటూ స్పందించాడు.
ఇక మరో యూజర్ మాత్రం కాస్త సరదాగా, అదే సమయంలో ధైర్యం చెబుతూ.. ‘ప్రపంచం ఇక్కడితో ముగిసిపోలేదు. పరిస్థితులన్నీ కచ్చితంగా మెరుగుపడతాయి. కూల్‌గా ఉండండి.. హ్యాపీ దీపావళి!’ అంటూ కామెంట్ చేశాడు.
పండుగ వచ్చిందంటే బహుమతులు అందుకోవాల్సిన సమయంలో ఉద్యోగం కోల్పోవడం.. అందులోనూ కుటుంబంతో పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా దూరమవుతాయనే ఆందోళన ఉద్యోగిని కలచివేసింది. అయితే అతడి పోస్టుపై స్పందించిన నెటిజన్లు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు ధైర్యం చెప్పారు. మొత్తానికి దీపావళి గిఫ్ట్‌గా లేఆఫ్ అందుకున్నానంటూ అతడు చేసిన పోస్టు ఇప్పుడు ఉద్యోగ భద్రతపై చర్చకు తెరలేపింది.