Video: కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లిన ఏలియన్స్.. పైలట్లు చెప్పింది విని ట్రంప్ షాక్!
ఆకాశంలో కనిపించే వింత కాంతులు.. గుర్తుపట్టలేని ఆకారాల్లో ఎగిరే వస్తువులు.. భూమిపైకి గ్రహాంతరవాసులు (ఏలియన్స్) వస్తున్నారా? దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్న ఈ ప్రశ్నలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. UFOలపై తనకు పెద్దగా నమ్మకం లేదని చెబుతూనే.. అమెరికా వైమానిక దళానికి చెందిన పైలట్లు చెప్పిన కొన్ని విషయాలు తనను ఆశ్చర్యపరిచాయని తెలిపారు. ముఖ్యంగా F-22 యుద్ధ విమానం కంటే మూడు రెట్లు వేగంగా దూసుకెళ్లిన ఓ గుండ్రని వస్తువు గురించి పైలట్లు చెప్పిన విషయాలను ప్రస్తావించారు.

అమెరికా ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం ’60 మినిట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు. కార్యక్రమ కరస్పాండెంట్ రాస్ డౌతాట్‌తో మాట్లాడిన ట్రంప్ పైలట్ల అనుభవాలను ప్రస్తావించారు.
F-22ను మించిన వేగం.. గుండ్రంగా కనిపించిన వస్తువు!
UFOలు ఉన్నాయనే విషయాన్ని తాను పూర్తిగా నమ్మడం లేదని ట్రంప్ చెప్పారు. కానీ తన మొదటి పదవీకాలంలోనే కాకుండా, రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఓవల్ ఆఫీస్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన కొందరు పైలట్లతో మాట్లాడినట్లు తెలిపారు. వారంతా ఎంతో అనుభవం ఉన్నవారని, బాధ్యతాయుతంగా వ్యవహరించే వ్యక్తులని అన్నారు. వారిని కుట్ర సిద్ధాంతాలను నమ్మే వ్యక్తులుగా చూడలేమని చెప్పారు.
అలాంటి పైలట్లు తనకు చెప్పిన కొన్ని విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ముఖ్యంగా F-22 యుద్ధ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తమ విమానం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఓ వస్తువు దూసుకెళ్లినట్లు పైలట్లు చెప్పారని, ఆ వస్తువు గుండ్రని ఆకారంలో కనిపించిందని వారు తెలిపినట్లు ట్రంప్ అన్నారు.
అత్యాధునిక యుద్ధ విమానం F-22 కంటే మూడు రెట్లు వేగంగా ఓ వస్తువు ప్రయాణించిందన్న విషయం ఆసక్తిని రేపుతోంది. అయితే ఆ వస్తువు ఏంటనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అది నిజంగానే గుర్తించలేని వైమానిక వస్తువా, మరేదైనా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వాహనమా అన్నది ప్రశ్నగా మిగిలింది.
ఏలియన్స్ గురించి అమెరికా ప్రభుత్వం దగ్గర రహస్య సమాచారం ఉందా?
ఇంటర్వ్యూలో UFOలపై ట్రంప్ మాట్లాడారు. గుర్తించలేని ఎగిరే వస్తువులపై అమెరికా ప్రభుత్వం రహస్యంగా పరిశోధనలు చేస్తోందని, ఏలియన్స్‌కు సంబంధించిన సమాచారం, సాంకేతికతను దాచిపెడుతోందని కొందరు విజిల్‌బ్లోయర్లు ఆరోపిస్తున్నారు. ఈ రహస్య కార్యక్రమాల గురించి అమెరికా అధ్యక్షుడికి సైతం తెలియదనే వాదనలు ఉన్నాయి. వీటిపై ట్రంప్‌ను ప్రశ్నించగా అలాంటి రహస్య కార్యక్రమం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ట్రంప్ చెప్పారు.
.@POTUS on UFOs: “I’m not too much of a believer, but I sat in the Oval Office, first term and a little bit the second term, meeting with Air Force pilots that are really good, solid people. These are not people that you would say are conspiracy theorists… They’ve told me things that are very strange in certain cases. They said, ‘Yes, there’s something going on out there…’ because they’re flying an F-22… and something goes by them at three times their speed, and it’s round…”
— Rapid Response 47 (@RapidResponse47) November 9, 2026
UFOల రహస్యాలను బయటపెట్టిన ట్రంప్
UFOలపై చర్చ జరుగుతున్న సమయంలో గుర్తించలేని వైమానిక వస్తువులకు సంబంధించిన రహస్య పత్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఫొటోలు, వీడియోలు, విచారణ నివేదికలను విడుదల చేసింది. UFO వెబ్‌సైట్‌లో ఎఫ్‌బీఐ, రక్షణ శాఖ, నాసా, విదేశాంగ శాఖలకు సంబంధించిన 162 ఫైళ్లను పెంటగాన్ విడుదల చేసింది. వీటిలో ఆకాశంలో వింత వస్తువులు కనిపించాయని ప్రత్యక్షంగా చూసినవారు ఇచ్చిన వాంగ్మూలాలు, ఫొటోలు, ఘటనలకు సంబంధించిన నివేదికలు ఉన్నాయి.
ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన పత్రాలను ప్రజల ముందుకు తీసుకువచ్చామని ట్రంప్ అన్నారు. ఈ పత్రాల విడుదల ద్వారా పూర్తి పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని ట్రంప్ తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదని, ఇప్పుడు విడుదల చేసిన పత్రాలు, వీడియోలను చూసి అసలు ఏం జరుగుతోందో ప్రజలే నిర్ణయించుకోవచ్చని ట్రూత్ సోషల్‌లో తెలిపారు.
ఏలియన్స్ ఉన్నాయా? వీడని UFO మిస్టరీ!
F-22 యుద్ధ విమానం కంటే మూడు రెట్లు వేగంగా వెళ్లిన వస్తువు గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. ఆ వస్తువు ఎక్కడ కనిపించింది? ఎప్పుడు కనిపించింది? దాని వేగాన్ని ఎలా గుర్తించారు? రాడార్‌లో నమోదైందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. దీంతో UFOల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటన్న ఆసక్తి మరోసారి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది.