Bank Robbery: బ్యాంకు లూటీకి సొరంగం తవ్విన దొంగల ముఠా.. అంతలోనే అనుకోని ట్విస్ట్..
బ్యాంకుకు కన్నం వేయడానికి ఓ దొంగల ముఠా ఏకంగా సొరంగం తవ్వేశారు. అంతా అనుకున్నట్లే జరుగుతుందని అనుకుంటున్న సమయంలో..
Man digs tunnel to rob bank in Italy: బ్యాంకుకు కన్నం వేయడానికి ఓ దొంగల ముఠా ఏకంగా సొరంగం తవ్వేశారు. అంతా అనుకున్నట్లే జరుగుతుందని అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి హఠాత్తుగా సొరంగం కూలిపోయింది. దీంతో సొరంగంలోపల చిక్కుకున్న ముఠా సభ్యుల్లో నలుగురు క్షేమంగా బయటపడిన.. స్కెచ్ వేసిన ముఠా నాయకుడు మాత్రం అందులో చిక్కుకుపోయాడు. చేసేదిలేక అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు మిగతావారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 8 గంటల నిర్విరామ శ్రమ అనంతరం దొంగల ముఠా నాయకుడిని క్షేమంగా బయటకు తీశారు. ఆనక ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మీడియా కథనాల ప్రకారం..
రోమ్‌లోని వాటికన్ సిటీలో బ్యాంకును దోచుకునేందుకు దొంగల ముఠా ప్లాన్ వేసింది. బ్యాంక్ షటర్ తాళాలు పగల కొట్టి చొరబడితే దొరికిపోతామని భావించిన ఐదుగురు సభ్యులు సొరంగం ద్వారా లోపలికి ప్రవేశించి దొచుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 6 మీటర్ల మేర సొరంగం తవ్వారు కూడా. మూసిఉన్న దుకాణంలో నుంచి సొరంగాన్ని తవ్వడం మొదలుపెట్టింది. ఇంకొన్న మీటర్ల మేర తవ్వితే బ్యాంకులోపలికి వెళ్లొచ్చు. ఐతే అంతలోనే అనుకోనిరీతిలో గురువారం (ఆగస్టు 11) ఉదయం సొరంగం కూలిపోయింది. మొత్తం ఐదుగురిలో నలుగురు బయటపడగా, ఒక వ్యక్తి మాత్రం లోపల చిక్కుకుపోయాడు.
దీంతో పోలీసులకు ఫోన్ చేసి అసలువిషయం చెప్పి, రక్షించమని ప్రాధేయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆరు మీటర్ల లోతులో ఉన్న వ్యక్తిని కాపాడేందకు సమాంతరంగా మరో గోతిని తవ్వి 8గంటల నిర్విరామ ప్రయత్నం అనంతరం అతడిని బయటకు తీశారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న దొంగను పోలీసులు ఆసుపత్రికి తరలించి, మిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సదరు దొంగలపై పలు నేరాల కింద అప్పటికే కేసులు నమోదైనట్లు తేలింది.