నది కోతకు ఏర్పడిన లోయలో నిర్మితమైన అద్భుత చర్చి లాస్‌ లజాస్‌, మందిరంలోకి వెళితే అనిర్వచనీయమైన అనుభూతి.

కొండకోనల్లో, పర్వతసానువుల్లో నిర్మించిన ఏ నిర్మాణమైన గొప్పగానే ఉంటుంది. ఆ ప్రకృతి రమణీయత మధ్య నిర్మాణమే గొప్పగా ఉంటే చెప్పడానికి ఏముంటుంది..? లాస్‌లజాస్‌ చర్చి ఇందుకే ప్రసిద్ధిగాంచింది.

నది కోతకు ఏర్పడిన లోయలో నిర్మితమైన అద్భుత చర్చి లాస్‌ లజాస్‌, మందిరంలోకి వెళితే అనిర్వచనీయమైన అనుభూతి.
Follow us
Balu

|

Updated on: Dec 25, 2020 | 1:29 PM

కొండకోనల్లో, పర్వతసానువుల్లో నిర్మించిన ఏ నిర్మాణమైన గొప్పగానే ఉంటుంది. ఆ ప్రకృతి రమణీయత మధ్య నిర్మాణమే గొప్పగా ఉంటే చెప్పడానికి ఏముంటుంది..? లాస్‌లజాస్‌ చర్చి ఇందుకే ప్రసిద్ధిగాంచింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాలలో ఇది కూడా ఒకటి! చారిత్రక నేపథ్యం ఉన్న ఈ మందిరం కొలంబియన్‌ నగరంలో కొలువై ఉంది. ఈక్వడార్‌ సరిహద్దుకు ఎంతో దూరంలో ఉండదీ చర్చి. గిటారా నది కోతకు ఏర్పడిన లోయలో ఈ లాస్‌ లజాస్‌ చర్చిని నిర్మించారు. చుట్టూ పచ్చటి కొండలు. లోతైన లోయ. మధ్య నదీ ప్రవాహం. ఇంత గొప్ప ప్రకృతి రమణీయత మరెక్కడ ఉంటుంది ? అందుకే ఈ చర్చికి అంత విశేష ఆదరణ! కోనలోంచి సుమారు వంద మీటర్ల ఎత్తున నిర్మించిన ఈ చర్చికి వెళ్లాలంటే 50 మీటర్లు ఎత్తున్న వంతెన సాయం తీసుకోవలసిందే! 1916లో మొదలైన ఈ చర్చి నిర్మాణం, పూర్తవ్వడానికి 33 ఏళ్లు పట్టింది. 1949లో లాస్‌ లజాస్‌ చర్చికి ఒక రూపం వచ్చింది. మందిరం ముందు నిలుచుని ఆ కట్టడాన్ని తనివితీరా చూస్తే, నిర్మాణానికి అన్నేళ్లు ఎందుకు పట్టిందో ఇట్టే అర్థమవుతుంది. ఇక మందిరంలో అడుగుపెడితే సరికొత్త ప్రపంచంలోకి వచ్చామన్న అనుభూతి కలుగుతుంది. ఇంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ ప్రార్థనమందిరాన్ని ఎందుకు నిర్మించారన్న సందేహం ఆటోమాటిక్‌గా కలుగుతుంది. దీనికో కథ ఉంది. 1754లో జరిగిన ఓ అద్భుత సంఘటనే ఈ మందిర నిర్మాణానికి పురికొల్పింది. మరియా మ్యూసెస్‌ అనే మహిళకు రోసా అనే అందమైన కూతురు! దురదృష్టమేమిటంటే రోసా పుట్టు మూగ! ఓ రోజున ఇద్దరూ ఓ భయంకరమైన తుపానులో చిక్కుకుంటారు. తలదాచుకునేందుకు చోటు కూడా కనిపించదు. ఆ సమయంలో ఓ బలమైనశక్తి వారిని దగ్గరలోని గుహకు దారి చూపిస్తుంది! ఇద్దరూ గుహలోకి వెళతారు. అక్కడి గోడలపై మేరిమాత చిత్రాన్ని చూసిన రోసా అప్రయత్నంగా కేకలు వేస్తుంది. కూతురుకు మాటలు రావడంతో తల్లి మరియా ఆనందపడుతుంది. రోసా స్వస్థతకు కారణం మేరిమాత కృపేనని మురిసిపోతుంది. ఈ అద్భుతం ఆ నోటా ఈ నోటా నగరమంతా పాకింది! ప్రజలు ఈ అద్భుత సంఘటనను కథలు కథలుగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే, ఓ పుట్టు అంధుడికి మేరిమాత దర్శనమిచ్చిన చోట ఓ చర్చిని నిర్మించాలన్న తలంపు కలిగింది. అంతే ఊరూరు తిరగడం మొదలు పెట్టాడు. డబ్బులు కూడబెట్టాడు. చర్చికి అంకురార్పణ చేశాడు. అప్పుడు మరో అద్భుతం జరిగింది. ఆ అంధుడికి చూపు వచ్చేసింది. ఒక్కసారిగా ఆ ప్రదేశం ప్రాచుర్యంలోకి వచ్చేసింది. అక్కడేదో మహిమ ఉందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. అక్కడో చర్చి వెలిసింది. రెండు శతాబ్దాలలో అనేక మార్లు రూపాంతరం చెందిందీ మందిరం! ప్రస్తుతం ఉన్న కట్టడాన్ని మాత్రం 1916లో మొదలు పెట్టి 1949లో పూర్తి చేశారు.