జోర్డాన్‌ రాజ కుటుంబంలో ముసలం.. దేశద్రోహం కేసులో గృహ నిర్బంధంలో మాజీ యువరాజు..!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Apr 05, 2021 | 12:12 PM

జోర్డాన్‌లో తిరుగుబాటుకు కుట్ర పన్నారనే అభియోగంపై ప్రిన్స్‌ హంజా బిన్‌తో పాటూ రాజకుటుంబానికి చెందిన 20 మందిని అమ్మాన్‌లో నిర్బంధంలోకి తీసుకున్నారు.

జోర్డాన్‌ రాజ కుటుంబంలో ముసలం.. దేశద్రోహం కేసులో గృహ నిర్బంధంలో మాజీ యువరాజు..!
'malicious Plot' Uncovered To Destabilise Kingdom

Jordanian royal family Crisis: జోర్డాన్‌ రాజ కుటుంబంలో ముసలం పుట్టింది. దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని, వాక్‌ స్వాతంత్య్రం కొరవడిందని, పాలన అస్తవ్యస్తంగా సాగుతోందంటూ రాజు అబ్దుల్లా 2 సవతి సోదరుడు ప్రిన్స్‌ హంజా బిన్‌ హుస్సేన్‌ బహిరంగా విమర్శించారు. రాజును ప్రశ్నించినందుకు తనను గృహ నిర్బంధంలో ఉంచినట్లు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలను జోర్డాన్ అధికారులు ఖండించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు హంజా ప్రయత్నించారని ఆరోపించారు. తిరుగుబాటుకు కుట్ర పన్నారనే అభియోగంపై ప్రిన్స్‌ హంజా బిన్‌తో పాటూ రాజకుటుంబానికి చెందిన 20 మందిని అమ్మాన్‌లో నిర్బంధంలోకి తీసుకున్నారు. రాజు తీరుపై విమర్శలు చేస్తూ హంజా విడుదల చేసిసన ఓ వీడియో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

శనివారం ఉదయం జోర్డాన్‌ సైన్యాధిపతి తన వద్దకు వచ్చారని, తనను తన కుటుంబసభ్యులను నిర్భంధించారని, ఇక నుంచి తాను ఇల్లు దాటడానికి వీల్లేదని, ప్రజలను కలవడానికి, వారితో మాట్లాడటానికి అనుమతించబోమని స్పష్టంచేసినట్లు ఆరోపించారు. అంతేకాకుండా తనకు ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తాజా సందేశాన్ని రికార్డు చేయడానికి శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను ఉపయోగించానని, దాన్ని కూడా కట్‌ చేయబోతున్నారని తెలిపారు. రాజు అబ్దుల్లా 2 పేరు ప్రస్తావించకుండానే పాలనా వ్యవస్థపై హంజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి వ్యతిరేకంగా తాను కుట్రలు పన్నానన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అక్రమాలను ప్రశ్నించేవారిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇక్కడ ఆనవాయితీయేనని చెప్పారు.

ఇదిలావుంటే, హంజాను గృహ నిర్బంధంలో ఉంచినట్లు వచ్చిన ఆరోపణలను సైన్యాధిపతి జనరల్‌ యూసఫ్‌ హునైటీ ఖండించారు. దేశ భద్రత, సుస్థిరతకు హాని కలిగించే చర్యలకు స్వస్తి పలకాలని మాత్రమే ఆయనకు సూచించినట్లు తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు సాగుతోందని, త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతామన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన నాయకులను హంజా రెచ్చగొడుతున్నారని ఉప ప్రధాన మంత్రి అయమన్‌ సఫాది ఆరోపించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ సంస్థలతో కలిసి కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. జోర్డాన్‌లో తిరుగుబాటు కుట్రను భగ్నం చేశామని, ఆ వ్యవహారంలో ప్రమేయమున్న 14 16 మందిని అరెస్టు చేసినట్లు మరో సీనియర్‌ అధికారి తెలిపారు.

నిజానికి హంజాకు జోర్డాన్‌లో మంచి ప్రజాదరణ ఉంది. తన తండ్రి, దివంగత రాజు హుస్సేన్‌కు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉండేవారు. 1999లో ఆయనకు యువరాజు హోదా క్రౌన్‌ ప్రిన్స్‌ను కూడా కట్టబెట్టారు. వయసు తక్కువగా ఉండటం, అనుభవరాహిత్యం కారణంగా ఆయనకు సింహాసనం మాత్రం దక్కలేదు. దీంతో హంజా సవతి సోదరుడు అబ్దుల్లాకు పట్టాభిషేకం జరిగింది. రాజుగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్లా.. 2004లో హంజాకు యువరాజు హోదాను తొలగించారు.

అయితే అబ్దుల్లా తమకు కీలక మిత్రుడని, ఆయనకు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, యూఏఈ, ఇజ్రాయెల్‌ తదితర మిత్ర దేశాలు కూడా రాజుకే మద్దతు పలికాయి. తాజా పరిణామాలతో రాజ ప్రాసాదం చుట్టూ భారీగా భద్రతా బలగాలను మోహరించారు. జోర్డాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం, దీనికి తోడు కరోనా మహమ్మారి విజృంభించడంతో ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలే స్థితికి చేరుకుంది. దీంతో రాజు అబ్దుల్లాపై ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు.

Read Also…..దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి కలవరం.. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌‌తో దేశీయ మార్కెట్ల భారీ పతనం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu