గవర్నర్ షాకింగ్ నిర్ణయం.. ఉదయం 5:30 గంటలకే స్కూళ్లు ప్రారంభం..
స్కూల్ విద్యార్ధులకు క్రమశిక్షణ అలవాటు చేయడానికి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ ఉదయం 5:30 గంటలకే విద్యార్ధులను పాఠశాలలకు రావాల్సిందిగా..
స్కూల్ విద్యార్ధులకు క్రమశిక్షణ అలవాటు చేయడానికి ఇండోనేషియా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ ఉదయం 5:30 గంటలకే విద్యార్ధులను పాఠశాలలకు రావాల్సిందిగా హుకూం జారీ చేసింది. ఐతే దేశంలోని అన్ని పాఠశాలల్లో ఈ విధానం ప్రవేశపెట్టకుండా.. తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్షియల్ రాజధాని కుపాంగ్‌లోని 10 హై స్కూళ్లలో మాత్రమే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధిస్తే మిగతా స్కూళ్లలో కూడా అమలు చేస్తామని చెబుతోంది ఇండోనేషియా ప్రభుత్వం. ఈ మేరకు ఇండోనేషియాలో గత నెల నుంచి ఎంపిక చేసిన 10 హై స్కూళ్లలో ఉదయం 5:30 గంటలకే బడి గంట మోగుతోంది. విద్యార్ధులు నోరుమెదపకుండా చెప్పిన సమయానికి ఠంఛన్‌గా స్కూల్‌కు వస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత తెల్పుతున్నారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ బాగా అలసిపోతున్నారని.. విద్యార్ధులను క్రమశిక్షణలో పెట్టడానికి ఇంతకంటే మెరుగైన పద్ధతి కనిపించలేదా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇండోనేషియాలో సాధారణంగా స్కూళ్లు ఉదయం 7:00 నుంచి 8:00 గంటల మధ్య ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు పాఠశాలల పనివేళలు ముగుస్తాయి. ఐతే గత నెలలో గవర్నర్ విక్టర్ లైస్కోడాట్ ఉదయం 5:30 గంటలకు స్కూళ్ల ప్రారంభం విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం చీకట్లో పిల్లలను స్కూల్‌కి పంపాలంటే వారి భద్రతకు భరోసా ఉండదు. పైగా ఆ సమయానికి పాఠశాలకు వెళ్లాలంటే తమ పిల్లలు ఉదయం 4 గంటలకే లేవాల్సి ఉంటుంది. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల స్కూల్ నుంచి రాగానే అలసిపోయి నిద్రపోతున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. నిద్ర లేమి వల్ల పిల్లల ఆరోగ్యం, ప్రవర్తన కాలక్రమేణా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇండోనేషియా చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ విధానాన్ని ఈ విధానాన్ని మరోమారు పునఃపరిశీలించవలసిందిగా ఆ దేశ ప్రభుత్వానికి సూచించారు.
ఈ విధానంపై విమర్శలొస్తున్నప్పటికీ ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయంపై వెనకడుగువేయడం లేదు. దీంతో విద్యార్ధులతోపాటు టీచర్లు, ఇతర సిబ్బంది ఉదయం 5:30 గంటలకే పాఠశాలలకు వస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.