AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌ – పాక్‌ ఉద్రిక్తతలు.. రంగంలోకి దిగిన G7 దేశాలు!

భారత్‌-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలని G7 దేశాలు డిమాండ్ చేశాయి. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించిన G7, రెండు దేశాల మధ్య సైనిక సంఘర్షణను తక్షణమే ఆపాలని కోరింది. ప్రాంతీయ స్థిరత్వం కోసం శాంతియుత సంభాషణ అవసరమని G7 నొక్కి చెప్పింది.

భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతలు.. రంగంలోకి దిగిన G7 దేశాలు!
Pakistan And India
SN Pasha
|

Updated on: May 10, 2025 | 9:30 AM

Share

భారత్‌, పాకిస్థాన్‌ అనధికారికంగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు కావడంతో ప్రపంచం మొత్తం భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలకు భయపడుతోంది. తాజాగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సంఘర్షణను తక్షణమే తగ్గించుకోవాలని గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాలు శనివారం పిలుపునిచ్చాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సంక్షోభానికి వేగవంతమైన, శాశ్వత దౌత్య పరిష్కారానికి మద్దతు ఇస్తున్నామని G7 దేశాలు ప్రకటించాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిని కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ మంత్రులు, యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఉద్రిక్తతలను నివారించాలని వారు రెండు దేశాలను కోరారు. “మరిన్ని సైనిక ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి” అని ప్రకటనలో పేర్కొన్నారు. “సరిహద్దుకు ఇరువైపులా పౌరుల భద్రత, శ్రేయస్సు గురించి మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం.” అని అన్నారు. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని పిలుపు ఇస్తున్నట్లు వెల్లడించాయి. శాంతియుత, స్థిరమైన పరిష్కారాన్ని సాధించే లక్ష్యంతో భారత్‌, పాకిస్తాన్‌లు ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనాలని ప్రోత్సహించింది.

G7 అనేది ప్రపంచంలోని ఏడు అత్యంత అభివృద్ధి చెందిన, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థల అనధికారిక కూటమి. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా G7 సమావేశాలలో పాల్గొంటుంది. కానీ ఏడుగురు సభ్యులలో ఒకటిగా దాన్ని లెక్కలోకి తీసుకోరు. ప్రధాన పారిశ్రామిక శక్తుల మధ్య ఆర్థిక విధానాన్ని చర్చించడానికి, సమన్వయం చేయడానికి G7 మొదట 1970లలో ఏర్పడింది. భద్రత, వాతావరణ మార్పు, అభివృద్ధి, ఆరోగ్య సంక్షోభాలు, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ సమస్యలను ఈ కూటమి పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీనికి శాశ్వత కార్యాలయం, చట్టపరమైన అధికారం లేనప్పటికీ G7 దాని సభ్యుల రాజకీయ, ఆర్థిక శక్తి కారణంగా ప్రభావవంతమైనది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి