Imran Khan China Trip: పాపం ఇమ్రాన్.. బీజింగ్‌లో బకరా అయిన పాక్ ప్రధాని.. ఆ ఫోటో ఒక్కటే మహాభాగ్యం అంటూ సెటైర్లు..
Imran Khan China Trip: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇంటా, బయటా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. స్వదేశంలోనే ఆయనకు పెద్దగా ప్రాధాన్యత..
Imran Khan China Trip: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇంటా, బయటా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. స్వదేశంలోనే ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేని సమయంలో.. తమ మిత్ర దేశమైన చైనాకు వెళ్లి పెద్ద బకరా అయ్యారు. ఆఖరికి చైనా అధ్యక్షుడితో కలిసి దిగిన ఫోటో మాత్రమే ఆయనకు దిక్కైందంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చైనా వేదికగా వింటర్ ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెర్బియా, మంగోలియా దేశాధినేతలకు ఆహ్వానం పంపింది చైనా. వీరితోపాటు.. పాకిస్తాన్ దేశానికి కూడా ఆహ్వానం పంపారు. ఇంకేముందు.. జీ జిన్‌పింగ్ సహా ముఖ్య దేశాల అధినేతలతో సమావేశం అవ్వొచ్చనే సంతోషంతో బీజింగ్‌కు వెళ్లారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన వెంట మరో ఐదుగురు మంత్రులను కూడా తీసుకెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనవచ్చునని, దేశానికి ఏదైనా ప్రయోజనం చేకూరుతుందని దాదాపు నాలుగు రోజులపాటు ఆశగా ఎదురు చూశారు ఇమ్రాన్. కానీ, ఆయన ఆశలు అడియాసలే అయ్యాయి.
అందరి కంటే ముందే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్.. తన సహచర మంత్రులతో కలిసి బీజింగ్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు ప్రత్యేక బస ఏర్పాటు చేసిన చైనా అధికారులు.. పటిష్టమైన కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు అమలు చేశారు. ఆ మరుసటి రోజున చైనా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేశారు. వారి వెనుకే.. ముఖ్య అతిథులు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఖతార్ నుంచి ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్, మంగోలియన్ ప్రధాన మంత్రి ఎల్ ఓయున్-ఎర్డెన్ హాజరయ్యారు.
అయితే, ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో కలిసి కూర్చోగా.. ఇమ్రాన్, అతని పరివారం బర్డ్స్ నెస్ట్ స్టేడియంలోని ఒక మూలలో నిస్సత్తువగా కూర్చున్నారు. ప్రారంభ వేడుక ముగిసిన ఒక రోజు తర్వాత.. జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర సమావేశానికి పిలుపు వస్తుందని ఆశగా ఎదురు చూశారు ఇమ్రాన్. కానీ, అలాంటి సూచనలేమీ కనిపించలేదు. చివరికి ఇక ప్రయోజనం లేదని భావించిన ఇమ్రాన్, మంత్రులు.. పాకిస్తాన్ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఇంతలో జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర సమావేశానికి పిలుపు వచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న ఇమ్రాన్.. సంబరపడిపోతూ చైనా అధినేతను కలుసుకున్నాడు. ఆ సమావేశం సందర్భంగా ఇమ్రాన్ పాత పల్లవినే అందుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వీరుడు, శూరుడు అంటూ తనదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపించారు. పాక్, చైనా దోస్తీ హిమాలయాల కంటే గొప్పదని, చైనాకు శాశ్వత మద్ధతు ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు.. తైవాన్, హాంకాంగ్, దక్షిణ చైనా సముద్రంపై బీజింగ్ వైఖరికి బేషరతుగా మద్దతు తెలిపారు. చివరికి తన ఆఫీసులో గోడకు వేలాడదీసేందుకు జీ జిన్‌పింగ్‌తో ఒక ఫోటోకు ఫోజు ఇచ్చి వెనుదిరిగారు.
ఇదిలాఉంటే.. దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో ఇమ్రాన్‌కు చోటు దక్కక పోవడంతో ఆయన్ను శాంతపరిచేందుకు చైనా కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. చైనాకు చెందిన పలు పారిశ్రామిక సంస్థల అధినేతలతో వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు అంశంపై వర్చువల్ మీటింగ్‌లో చర్చించారు. ఈ పర్యటనపై పాకిస్తాన్‌లో తీవ్రమైన అసహనం వ్యక్తమవుతోంది. వర్చువల్ సమావేశం కోసం బీజింగ్‌కు వెళ్లాలా? అంటూ సెటైర్లు వేస్తున్నారు పలువురు. ఇమ్రాన్ ఖాన్ నిస్సాహయత ఈ పర్యటనలో ప్రస్పుటిస్తుందని ఎద్దేవా చేస్తున్నారు పాకిస్తానీలు.
కాగా, వాస్తవానికి ఇమ్రాన్ బీజింగ్ పర్యటన వెనుక వేరే పరమార్థం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. చైనా అధినేతకు విధేయత చూపుతూ.. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ 2వ దశలో పరిశ్రమల స్థాపనకు కనీసం 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి, 3 బిలియన్ డాలర్ల రుణం కోరాలని భావించారు ఇమ్రాన్ ఖాన్. అలాగే.. తన విధేయతో చైనా నాయకత్వాన్ని ఆకట్టుకుని.. దౌత్యపరమైన సంబంధాలను మరింత బలపరచలాని భావించారు. కానీ, అనుకున్నది ఒక్కటి అయితే.. జరిగింది మరోటిలా.. నిరాశ నిస్పృహలతో బీజింగ్‌ను నుంచి వెనుదిరిగారు పాక్ ప్రధాని ఇమ్రాన్.
ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణ స్థితికి చేరింది. పన్నుల రాబడి దారుణంగా పడిపోయింది. ఎగుమతులు పడిపోయాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇమ్రాన్ ప్రభుత్వం.. ప్రపంచ బ్యాంకు నుంచి 1 బిలియన్ డాలర్ల రుణం పొందింది. మరో 5 బిలియన్ డాలర్ల రుణం కోసం ఎదరు చూస్తోంది. మరోవైపు సీపీఈసీ(చైనా – పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు) ప్రాజెక్టు నిర్మాణంలో పని చేస్తున్న కార్మికుల రక్షణలో పాకిస్తాన్ పూర్తి విఫలమైందనే కోపంతో చైనా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు 13 మంది చైనా కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. వారికి 38 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని చైనా డిమాండ్ చేస్తోంది. అసలే ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంటే.. ఈ డిమాండ్ చూసి బెదిరిపోయింది పాకిస్తాన్ ప్రభుత్వం. మరోవైపు బెలూచిస్తాన్‌లో జరుగుతున్న దాడులపైనా చైనా గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీఈసీ 2వ దశ పెట్టుబడులు దేవుడెరుగు కానీ.. ఈ ప్రాజెక్టు విషయంలో పాకిస్తాన్ పట్ల చైనా మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని దౌత్యవేత్తలు చెబుతున్నారు. మొత్తంగా పాకిస్తాన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉందంటున్నారు విశ్లేషకులు.
Also read:
Karate Kalyani : ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్నా.. కరాటే కళ్యాణి ఆసక్తికర కామెంట్స్
Viral News: అప్పుల్లో అగ్ర దేశాలు.. లిస్టు బారెడు.. భారత్ ఏ ప్లేస్‌లో ఉందంటే.?