Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. ధృవీకరించిన ఇజ్రాయెల్ ఆర్మీ

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రసంగించిన ఒక గంట తర్వాత, లెబనాన్‌లో భారీ దాడి జరిగింది. ఇందులో హిజ్బుల్లా చీఫ్ చంపబడ్డాడని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం..  ధృవీకరించిన ఇజ్రాయెల్ ఆర్మీ
Hassan Nasrallah
Follow us

|

Updated on: Sep 28, 2024 | 3:59 PM

హిజ్బుల్లా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటోంది ఇజ్రాయెల్‌. వైమానిక దాడులతో వారి స్థావరాలను ధ్వంసం చేస్తోంది. శుక్రవారం(సెప్టెంబర్ 27) భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీరుట్‌లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులతో దాడి చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా అధిపతి హసన్‌ నస్రల్లా హతమైనట్లు తాజాగా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ధ్రువీకరించింది. “నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు” అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. అటు ఇజ్రాయెల్‌ వార్‌ రూమ్‌ దీనిపై స్పందించింది. ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌ మిషన్‌ విజయవంతమైనట్లు ప్రకటించింది. హసన్ నస్రల్లా 32 సంవత్సరాల పాటు ఈ సంస్థకు చీఫ్‌గా ఉన్నారు.

ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషని నస్రల్లా హతమైనట్లు ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. AFP కథనం ప్రకారం, లెబనాన్ రాజధాని బీరూట్‌పై శుక్రవారం (27 సెప్టెంబర్ 2024) జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేవిడ్ అవ్రహం తెలిపారు. హసన్ నస్రల్లాను చంపిన ఆపరేషన్ పేరు న్యూ ఆర్డర్ మిషన్. నస్రల్లా మరణం తర్వాత, ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. “ఇజ్రాయెల్‌ను ఎవరు బెదిరించినా, అతనిని ఎలా చేరుకోవాలో మాకు తెలుసు. ఇది మా సామర్థ్యం.. ఇది అంతం కాదు.” అంటూ పేర్కొంది.

ఇజ్రాయెల్ సైన్యం ఒక రోజు ముందు హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై దాడి చేశామని, అక్కడ హసన్ నస్రల్లా కూడా ఉన్నాడని పేర్కొంది. బీరుట్‌తో సహా పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతరం దాడులు చేస్తోంది. బీరుట్‌లోని దహియా నగరంలో నివసిస్తున్న ప్రజలను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని IDF కోరింది. ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు హిజ్బుల్లా ఈ స్థలాలను ఉపయోగిస్తోందని IDF చెబుతోంది.

ఇజ్రాయెల్ న్యూస్ ఛానెల్ ప్రకారం, నస్రల్లాతో పాటు, అతని కుమార్తె జైనాబ్ కూడా ఈ వైమానిక దాడిలో మరణించారు. మీడియా కథనాల ప్రకారం, ఇజ్రాయెల్ దాడి చేసిన కమాండర్ సెంటర్‌లో నస్రల్లా కుమార్తె మృతదేహం కనుగొనడం జరిగింది. అంతకుముందు శుక్రవారం రాత్రి, ఇజ్రాయెల్ హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై క్షిపణిని ప్రయోగించింది. ఇందులో 6 మంది మరణించారు. 90 మంది గాయపడ్డారు. నివారం ఉదయం కూడా లెబనాన్‌లోని బెకా వ్యాలీలో ఐడీఎఫ్‌ వైమానిక దాడులతో విరుచుపడింది. ఇందులో హెజ్‌బొల్లా క్షిపణి యూనిట్ కమాండర్‌ మహమ్మద్‌ అలీ ఇస్మాయిల్‌ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. మరోవైపు, బీరుట్‌లో దాడుల నేపథ్యంలో హెజ్‌బొల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో విరుచుకుపడింది.

శుక్రవారం, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రసంగించిన ఒక గంట తర్వాత, లెబనాన్‌లో భారీ దాడి జరిగింది. ఇందులో హిజ్బుల్లా చీఫ్ చంపబడ్డాడని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రకారం, నస్రల్లా హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంలో ఉన్నాడు. ఆ సమయంలో అతను దాదాపు 60 క్షిపణులను ప్రయోగించి శత్రువును నాశనం చేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..