News9 Global Summit: ‘పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది’.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్
న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడారు. గ్లోబల్ కంపెనీలకు గుజరాత్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని అన్నారు. ఈ సమ్మిట్ గుజరాత్-జర్మనీల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు..
భారత్, జర్మనీ మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడంలో గుజరాత్ కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. టీవీ9 నెట్‌వర్క్ న్యూస్‌నైన్ జర్మనీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్‌లో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. భవిష్యత్ టెక్నాలజీ కోసం గుజరాత్ సిద్ధమవుతోందని పటేల్ తెలిపారు.
జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరుగుతున్న న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో మాట్లాడిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. గ్లోబల్ కంపెనీలకు గుజరాత్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జర్మన్ కంపెనీలకు ఆయన పిలుపునిచ్చారు. దీనితో పాటు గుజరాత్ ప్రత్యేకత, పెట్టుబడి వాతావరణాన్ని కూడా ప్రస్తావించారు. తన ప్రసంగంలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రస్తావిస్తూ.. పెట్టుబడులు, వాణిజ్య రంగంలో గుజరాత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చడానికి ఇది సహాయపడిందని సీఎం భూపేంద్ర అన్నారు. గ్లోబల్ లీడర్ పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రంతో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతూ ముందుకెళ్తోందని ఆయన అన్నారు.
వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడుల్లో గుజరాత్‌ను అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో 2003లో ప్రధాని నరేంద్ర మోదీ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించారని ముఖ్యమంత్రి భూపేంద్ర చెప్పారు. గ్లోబల్ డెస్టినేషన్, పెట్టుబడి పరంగా అగ్రగామి రాష్ట్రంగా గుజరాత్ మారింది. ఫార్చ్యూన్ 500లో 100 కంపెనీలు గుజరాత్‌లోనే పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు జర్మనీ కూడా గుజరాత్‌తో ముడిపడి ఉందని సీఎం అన్నారు. భారతదేశాన్ని బలోపేతం చేయడంలో గుజరాత్ చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. భవిష్యత్తు కోసం టెక్నాలజీ కోసం గుజరాత్‌లో చాలా కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. భారత్-జర్మనీ సంబంధాలను బలోపేతం చేయడంలో గుజరాత్ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, సెమీ కండక్టర్, గ్రీన్ హైడ్రోజన్ రంగంలో గుజరాత్ పెద్ద వేదికగా ఎదుగుతోందని తెలిపారు. 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించారు. జర్మనీ కూడా మిత్రదేశంగా చేరింది. జర్మనీ – గుజరాత్ మధ్య వంతెనను న్యూస్ 9 మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.