AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Froze to Death: కెనడా-అమెరికా సరిహద్దులో చలికి గడ్డకట్టి నలుగురి దుర్మరణం.. గుజరాత్‌కు చెందిన పటేల్ ఫ్యామిలీగా గుర్తింపు!

కెనడా, అమెరికా సరిహద్దుల్లో మైనస్ 35 డిగ్రీల చలిని తట్టుకోలేక చనిపోయిన నలుగురు భారతీయుల కుటుంబాలను గుర్తించారు.

US Froze to Death: కెనడా-అమెరికా సరిహద్దులో చలికి గడ్డకట్టి నలుగురి దుర్మరణం.. గుజరాత్‌కు చెందిన పటేల్ ఫ్యామిలీగా గుర్తింపు!
Gujat Family
Balaraju Goud
|

Updated on: Jan 29, 2022 | 9:06 AM

Share

Gujarat family that froze to death: కెనడా, అమెరికా సరిహద్దుల్లో(US-Canada Border) మైనస్ 35 డిగ్రీల చలిని తట్టుకోలేక చనిపోయిన నలుగురు భారతీయుల కుటుంబాన్ని(Indian Famly) గుర్తించారు. గుజరాత్‌(Gujarat)కు చెందిన ఈ కుటుంబం అగ్రరాజ్యం అమెరికా(America)లోకి అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం విషాదాంతమైంది. కెనడా – అమెరికా సరిహద్దుల్లో కారులో దింపారు. కెనడా(Canada) అధికారులు దీనిని మానవ అక్రమ రవాణా కేసుగా పేర్కొన్నారు. అమెరికా – కెనడా సరిహద్దుల్లో తీవ్రమైన మంచు తుపాను కారణంగా చలికి గడ్డకట్టుకుని ఆ కుటుంబమంతా దుర్మరణం చెందింది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విచారకరం. జనవరి 19న ఈ ఘటన చోటుచేసుకోగా.. మృతులను తాజాగా గుర్తించారు. వీరు గుజరాత్‌కు చెందిన జగదీశ్‌ బల్‌దేవ్‌భాయ్‌ పటేల్‌ (39), ఆయన భార్య వైశాలిబెన్‌ (37), కుమార్తె విహంగి జగదీశ్‌ కుమార్‌ పటేల్‌ (11), కుమారుడు ధార్మిక్‌ జగదీశ్‌ కుమార్‌ పటేల్‌ (3) అని కెనడియన్‌ అధికారులు వెల్లడించారు.

కెనడా-అమెరికా సరిహద్దుకు 12 మీటర్ల దూరంలోని మానిటోబాలోని ఎమర్సన్ సమీపంలో జనవరి 19న నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. కుటుంబంలో పురుషులు, మహిళలు, యువకులు, శిశువులు ఉన్నారని అధికారులు ఇంతకుముందు చెప్పారు, అయితే ఇప్పుడు చనిపోయిన వారిలో ఒక యువకుడు, ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. జనవరి 26న మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. చలి కారణంగా కుటుంబం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పటేల్ కుటుంబం జనవరి 12న టొరంటోకు వచ్చి అక్కడి నుంచి జనవరి 18న ఎమర్సన్‌కు చేరుకుందని పోలీసులు ధృవీకరించారు. సరిహద్దుకు ఎలా చేరుకున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కెనడా నుంచి అమెరికాకు నిత్యం పెద్ద ఎత్తున అక్రమ వలసలు జరుగుతుంటాయి. వీటిని అరికట్టేందుకు అమెరికా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల అగ్రరాజ్యానికి ఇద్దరు భారత వ్యక్తులను అక్రమంగా తీసుకొచ్చిన కేసులో స్టీవ్‌ శాండ్‌ అనే పౌరుడిని అమెరికన్‌ అధికారులు అరెస్టు చేశారు. జనవరి 19న ఇరు దేశాల సరిహద్దుకు సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజున సరిహద్దుకు కొంత దూరంలో కెనడా వైపు నాలుగు మృతదేహాలను కనుగొన్నట్లు రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు.. యూఎస్‌ బోర్డర్‌ పెట్రోల్‌ అధికారులకు సమాచారమిచ్చారు.

అయితే, కెనడాలోని ఒట్టావాలోని భారత హైకమిషన్ మృతుల గుర్తింపును ధృవీకరించింది. మృతుల ఫొటోను కూడా ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ సంఘటన గురించి వారి కుటుంబాలకు సమాచారం అందించామని చెప్పారు. టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ మృతుని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబం గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కలోల్ తాలూకాలోని దింగుచా గ్రామంలో నివాసం ఉంటోంది. మృతుడు జగదీష్ బంధువు జస్వంత్ పటేల్ మాట్లాడుతూ.. ‘నలుగురి మృతదేహాలను భారత్‌కు తీసుకురావడం లేదు. కెనడాలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డింగుచా గ్రామంలో 2500 నుంచి 3000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఇంటి నుంచి ఒకరు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Read Also… KIM JONG UN: మరో ప్రమాదకర ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా.. కిమ్ క్షిపణి ప్రయోగాలు ఎందుకు?