Couple Death: నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి.. ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం
మరణం మనల్ని వేరు చేసేవరకు నీ చేయి వదిలిపెట్టను.. ఇది సినిమా డైలాగ్. కానీ మరణంలోనూ తన భర్త చేయి వదల్లేదు. ఇది రియల్ లైఫ్. ఏంటా కథా.. తెలసుకుందాం పదండి.
ఆయన వయస్సు 59.. ఆమె వయస్సు 66. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. వారిని చూసి కన్ను కుట్టిందేమో విధికి.. అనుకోని విధంగా కొవిడ్ వీరి జీవితాల్ని బలి తీసుకుంది. ఇద్దరూ ఒకేసారి ఆసుపత్రిలో చేరారు. చేతిలో చెయ్యి వేసుకుని ఒక్క నిమిషం వ్యవధిలో దంపతులు తుదిశ్వాస విడిచారు. అమెరికా మిషిగన్‌లో జరిగింది ఈ విషాద ఘటన. కాల్డన్హమ్, లిండా ఇద్దరు దంపతులు. ఈనెల మొదట్లో అనారోగ్యం బారిన పడ్డారు ఈ కపుల్. అయినా కుటుంబంతో కలిసి హాలిడేకు వెళ్లారు. అక్కడ వారికి జ్వరం, జలుబు తీవ్రమైంది. మూడు రోజులకే ట్రిప్‌ను వదిలి ఇంటికి వెళ్లారు డన్హమ్, లిండా. దంపతులిద్దరూ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో కొవిడ్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.
కొన్ని రోజుల పాటు వారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మరణించారు కాల్. అది జరిగిన ఒక్క నిమిషానికే తుదిశ్వాస విడిచారు అతని భార్య లిండా. ఇంకో విషయం ఏంటంటే, మృతిచెందే సమయంలో వారిద్దరు చేతిలో చెయ్యి వేసుకునే ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఉద్వేగానికి గురయ్యారు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది. కొవిడ్‌పై పోరాటం కోసం ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని ప్రోత్సహించేవారు ఈ దంపతులు. ఈ ఏడాది మేలోనే వీరూ టీకా తీసుకున్నారు. కానీ కరోనాతో వీరు మరణించడం బాధాకరమని అంటున్నారు వీరి బంధువులు. ఈ దంపతులలో పరిచయం ఉన్న సన్నిహితులు, స్నేహితులు.. వారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: Hyderabad: ప్రియుడితో భర్తను కిడ్నాప్ చేయించిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్