Coronavirus: కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌..!

Coronavirus: గత ఏడాదికిపైగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయాసియా..

Coronavirus: కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌..!
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Sep 29, 2021 | 11:46 AM

Coronavirus: గత ఏడాదికిపైగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ పూనమ్‌ ఖత్రేపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. అయితే ప్రజలపై వ్యాక్సిన్‌ ప్రభావం, రోగనిరోధక శక్తి పెరగడం వల్ల వైరస్‌ ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశాలున్నట్లు వెల్లడించారు. మనం వైరస్‌ ఆధీనంలో ఉన్నామని కానీ, వైరస్‌ మన ఆధీనంలో ఉంది అని కానీ భావించకూడదని అన్నారు. కరోనా బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న వారిపై వ్యాధి ప్రభావం తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు.

పీటీఐ వార్తా సంస్థతో పూనమ్‌ ఖత్రేపాల్‌సింగ్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ వైరస్ చాలాకాలం పాటు కొనసాగుతుందని భావిస్తున్నా. వ్యాధి త్వరలోనే అంతమవుతుందా? సుదీర్ఘ కాలం కొనసాగుతుందా? అనే విషయం పలు రకాల అంశాల మీద ఆధారపడి ఉంది. సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలే ఉన్నప్పటికీ.. టీకాలు, రోగనిరోధక శక్తి కారణంగా కరోనా ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశం ఉంది.. అని ఆయన అన్నారు. వ్యాధి నిర్మూలన కాని పక్షంలో దాన్ని నివారించేందుకు కృషి చేయాలన్నారు. దీని ద్వారా ఆసుపత్రిలో చేరడం, మరణాలను అరికట్టవచ్చని.. అలాగే సామాజిక, ఆర్థిక, ఆరోగ్య నష్టాలను నివారించవచ్చని వ్యాఖ్యానించారు.

బూస్టర్‌ డోస్‌ను నిలిపివేస్తే 40 దేశాలకు టీకాలు:

ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్‌ డోస్‌ వినియోగాన్ని ఆమె వ్యతిరేకించారు. బూస్టర్‌ డోస్‌ వినియోగం కారణంగా.. పలు దేశాల్లో మొదటి డోసు కోసం వేచి చూస్తున్న మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ సరఫరా ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. బూస్టర్‌ డోసు వినియోగంపై డబ్ల్యూహెచ్‌లో ఈ ఏడాది చివరి వరకు మారటోరియం విధించింది. బూస్టర్‌ డోసును నిలిపివేస్తే అన్ని దేశాల్లోని కనీసం 40 శాతం మందికి టీకాలు అందుతాయని అన్నారు. అందరూ సురక్షితంగా ఉండే వరకు ఎవరూ సురక్షితం కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అని పేర్కొన్నారు. మూడో డోసు అందరికీ అవసరం ఉండకపోవచ్చని తెలిపిన ఆమె.. శాస్త్రీయంగా నిరూపితం అయిన తర్వాతే మూడో డోసు వినియోగంపై డబ్ల్యూహెచ్‌లో మార్గనిర్దేశం చేయనుందని వెల్లడించారు.

థర్డ్‌వేవ్‌ తీవ్రత అనేది మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది:

కాగా, థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలపై పూనమ్‌ స్పందించారు. థర్డ్‌వేవ్‌ అనేది మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉంటూ థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడ్డారు. ఒక వేళ థర్డ్‌వేవ్‌ వస్తే అది ఎంత తీవ్రత ఉంటుందనేది మన అందరి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరిగితే వైరస్‌ ఎక్కువ మందికి సోకే అవకాశం లేదని తెలిపారు. కోవిడ్‌ వైరస్‌ కారణంగా అత్యధికంగా మృతి చెందుతున్నవారిలో టీకాలు తీసుకోనివారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని స్పష్టం చేశారు.

ఇవీ కూడా చదవండి:

Covid Deaths: కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!

AP Covid 19: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu