AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డంకీ రూట్‌లో అస్సలు వెళ్లకండి.. నరకం కళ్లజూస్తారు నాలాగా! యువకుడి వీడియో వైరల్‌

అమెరికాలోకి ఎలాగైనా అడుగుపెట్టాలని వెళ్లి మెక్సికోలో చిక్కుకున్న ఓ పంజాబీ యువకుడు నేను తప్పు చేశాను.. ఎవరూ ఆ రూట్‌లో అమెరికాకు వెళ్లొద్దు అంటూ వేడుకున్నాడు. వీడియో చూసిన వారిని విపరీతంగా కదిలిస్తోంది. ఏజెంట్లు తీవ్రంగా కొట్టడంతో కాళ్లకు గాయాలై నడవలేకపోతున్నానని. అన్నాడు

డంకీ రూట్‌లో అస్సలు వెళ్లకండి.. నరకం కళ్లజూస్తారు నాలాగా! యువకుడి వీడియో వైరల్‌
Dunki Route Danger
Sharada V
|

Updated on: Aug 16, 2026 | 7:39 PM

Share

అమెరికాలోకి అక్రమంగా ఎంట్రీ ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో డంకీ రూట్‌ ద్వారా వెళ్లి మెక్సికోలో చిక్కుకున్న ఓ పంజాబీ యువకుడు పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలిస్తోంది. నేను తప్పు చేశాను.. ఎవరూ ఆ రూట్‌లో అమెరికాకు వెళ్లొద్దు ..వైరల్‌గా మారిన వీడియోలో అతను అభ్యర్థించాడు. వీడియోలో యువకుడు ఒక గదిలో మంచంపై పడుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చేతులు జోడించి వేడుకోవడం వీడియో చూసిన వారిని కదిలిస్తోంది. ‘డంకీ’ రూట్‌లో ఎవరూ అమెరికాకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశాడు.

తను ఏజెంట్ల బారి నుంచి తప్పించుకోవాలని చూసాననీ ఆ తర్వాత ఏజెంట్లు తనపై దాడి చేశారని ఆ యువకుడు ఆరోపించాడు. తనను తీవ్రంగా కొట్టడంతో కాళ్లకు గాయాలై నడవలేకపోతున్నానని.. తనలాగా ఎవరూ తప్పు చేయకూడదంటూ ఆ యుకుకులు పదే పదే వేడుకున్నాడు. సురక్షితంగా తీసుకువెళతామని నమ్మించిన ఏజెంట్లు తనపై తీవ్రంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసాడు. అలాంటి ఏజెంట్ల మాటలు నమ్మొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు.

33 సెకన్ల వీడియోలో అతని పేరు కానీ, చిరునామా కానీ చెప్పలేదు. ఆగస్టు 13న వీడియో క్లిప్‌ను అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. అతని లాగానే ‘డంకీ’ మార్గం ద్వారా అమెరికాలోకి అడుగుపెట్టాలని ప్రయత్నించిన మరికొంత మంది యువకులు మెక్సికోలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. వారు సురక్షితంగా అమెరికా చేరుకోవాలని వారి కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు కొందరు వీడియో కింద కామెంట్లు పెట్టారు.

అమెరికా, కెనడా, యూకే వంటి ధనిక దేశాలకు సరైన వీసాలతో ప్రవేశించకుండా అక్రమంగా చొరబడాలని చూసే నెట్‌వర్క్‌ను ‘డంకీ రూట్’ అంటారు. యువత నుంచి భారీ మొత్తంలో డబ్బుల్ని గుంజి నకిలీ పత్రాలను తయారుచేసి పలు దేశాల మీదుగా ప్రమాదకర పరిస్థితుల్లో ఏజెంట్లు వారిని తరలిస్తుంటారు. ఈ ప్రయాణంలో ఎందరో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లతారు లేదా ఏజెంట్ల చేతిలో మోసపోవడం సాధారణ ప్రక్రియగా మారింది. డాలర్లలో పౌండ్లలో రెండు చేతులా సంపాదించాలని, మంచి జీవితం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పంజాబీ యువకుడి వీడియో ఒక హెచ్చరిక చేసింది. ఏజెంట్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రయాణిస్తే పెను ప్రమాదాలు పొంచి ఉంటాయన్నదానికి ఈ ఘటన అద్దం పడుతోంది.

డంకీ రూట్‌ కోసం ఏజెంట్లు రూ.20 నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేస్తారు. అయినా వారి ప్రయాణం ఆద్యంతం నరకప్రాయంగా సాగుతుంది. అమెరికా చేరుకోవాలంటే ఈక్వెడార్, కొలంబియా, పనామా అడవులు, మెక్సికో గుండా ప్రాణాలకు తెగించి ప్రయానం చేయాలి. తీవ్రమైన అలసట, ఒత్తిడి, ప్రాణాపాయ పరిస్థితులకు తోడు దారి దోపిడీలు అత్యాచారాలు ఎదురవుతాయి. చట్టబద్ధమైన స్టడీ లేదా వర్క్ వీసాలు పొందడానికి అవసరమైన విద్య కానీ భాష పై పట్టు కానీ, ఆర్థిక స్తోమత వారికి లేకపోవడం వల్ల అక్రమ మార్గాలను ఎంచుకుంటారు. మెరుగైన భవిష్యత్తు కోసం, అలాగే విదేశీ ఆదాయంపై ఆశలతో పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి అనేకమంది యువకులు ఏజెంట్ల ట్రాప్‌లో పడి ఇరుక్కుంటున్న ఘటనలు కోకొల్లలు.

Follow Us