హైజాక్ కాదు.. విమానాన్ని కూల్చే ప్రయత్నం! పైలట్ల మధ్య ఘర్షణ
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కలకలం రేగింది. విమానం నుంచి 7500, 7700 అత్యవసర సంకేతాలు అందడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు.విమానం హైజాక్‌కు గురైందని లేదా హైజాక్ ప్రయత్నం జరుగుతోందని సూచించడానికి ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు. అయితే, విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం జరగలేదని..కాక్‌పిట్‌లో ఓ పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. మరో పైలట్ అతడిని అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.

సెప్టెంబర్ 30వ తేదీన ఫ్లైట్ FZ1073 దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు వెళ్తోంది. జోర్డాన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడ్డాయి. విమానం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగులు వేగంగా కిందకు దిగింది. ఆ తర్వాత విమానం మళ్లీ నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. మరో అత్యవసర సంకేతం పంపించింది. చివరకు దిశ మార్చుకున్న పైలట్ .. సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసారు.
7500.. 7700 సంకేతాలు ఎందుకు కీలకం?
విమానం నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు 7500, 7700 సంకేతాలు పంపినట్లు కథనాలు చెబుతున్నాయి. విమానయాన రంగంలో 7700 కోడ్‌ను సాధారణంగా తీవ్రమైన అత్యవసర పరిస్థితిని సూచించేందుకు ఉపయోగిస్తారు. విమానంలో ఏదైనా తీవ్రమైన సమస్య తలెత్తినప్పుడు ఈ కోడ్‌ను పంపుతారు. అదే సమయంలో 7500 కోడ్ చాలా కీలకమైనది. విమానం హైజాక్‌కు గురైందని లేదా హైజాక్ ప్రయత్నం జరుగుతోందని సూచించడానికి ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు. ఈ రెండు సంకేతాలు అందడంతో విమానం హైజాక్‌కు గురైందనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి.
సౌదీ అరేబియా వైపు మళ్లింపు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సందేశాలకు పైలట్లు స్పందించకపోవడంతో విమానం హైజాక్‌కు గురైందనే అనుమానాలు మరింత పెరిగాయి. కొంతసేపటి తర్వాత విమానంతో సంబంధాలు కూడా తెగిపోయినట్లు కథనాలు చెబుతున్నాయి. విమానాన్ని మాన్యువల్ కంట్రోల్‌లోకి తీసుకుని అనంతరం విమానాన్ని సౌదీ అరేబియా వైపు మళ్లించారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి అనుమతి లభించలేదని సమాచారం. చివరకు విమానం సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
విమానంలో 174 మంది
ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఫ్లై దుబాయ్ విమానంలో 24 మంది పిల్లలు సహా మొత్తం 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కాక్‌పిట్‌లో అసలు ఏం జరిగింది? విమానాన్ని కూల్చేందుకు పైలట్ నిజంగానే ప్రయత్నించాడా? 7500 సంకేతం ఎందుకు పంపించారు? అనే అంశాలపై మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.
‘ఉగ్రదాడి ప్రయత్నం’గా అనుమానం
ఈ ఘటన వెనుక ఉగ్రదాడి కోణం ఉండొచ్చని ఇజ్రాయెల్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు? ఘటనకు అసలు కారణం ఏమిటి? అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కొన్ని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు ఇది విమానాన్ని కూల్చే ప్రయత్నం కావచ్చని, మరికొన్ని పైలట్ ఆత్మహత్యాయత్నం కోణాన్ని ప్రస్తావిస్తూ కథనాలు రాసాయి. పైలట్ల జాతీయతపై కూడా భిన్నమైన కథనాలు వెలువడ్డాయి. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ప్రయాణికులు ఏం చూశారు?
విమానంలోని ఓ ప్రయాణికురాలు మీడియాతో మాట్లాడుతూ, తనకు కాక్ పిట్ లో అరుపులు వినిపించాయని, కత్తి పట్టుకున్న వ్యక్తి పైలట్‌ను నేలపైకి తోసేయగా అక్కడ రక్తం కనిపించిందని ఆమె అన్నారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 174 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులు ఉన్నారు. విమానం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఫ్లై దుబాయ్ ప్రకటించింది. ఈ ఘటనతో ఇజ్రాయెల్ భద్రతా అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రయాణికులను తిరిగి ఇజ్రాయెల్‌కు తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.