Chinese Virologist: అక్కడి నుంచే కరోనా వైరస్ వచ్చింది.. ఫౌచీకి తెలుసంటున్న చైనీస్ వైరాలజిస్ట్
Chinese Virologist:
కోవిడ్ వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందని అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ బలంగా వినిపిస్తున్నాయి. ఈ థియరీని మొదటగా తెరపైకి తీసుకొచ్చినవారిలో చైనాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ లి మెంగ్ యాన్ కూడా ఒకరు. తాజాగా బయటపడిన అమెరికా కరోనా వైరస్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీకి చెందిన ఈమెయిల్స్ తాను చెప్పిందే నిజమని నిరూపించాయని ఆమె మరోసారి గట్టిగా వాధిస్తున్నారు. అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అభ్యర్థన కింద వాషింగ్టన్ పోస్ట్‌లాంటి పలు మీడియా సంస్థలు ఫౌచీ ఈమెయిల్స్‌ను బయటపెట్టాయి.
అందులో గతేడాది ఏప్రిల్‌లో పంపిన ఓ మెయిల్‌లో ఈ ల్యాబ్ లీక్‌కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిదే విషయాన్ని లి మెంగ్ యాన్ ప్రస్తావిస్తున్నారు. కోవిడ్-19 వైరస్ మూలాలపై పరిశోధనలు చేసిన వాళ్లలో ఆమె కూడా ఒకరు. ఈ ల్యాబ్ లీక్ విషయాన్ని ఎక్కడ బయటపెడుతానో అని తనను కొన్ని రోజులుగా డ్రాగన్ కాంట్రీ నిర్బంధించిందని ఆరోపిస్తున్నారు. ఫౌచీ ఈమెయిల్స్‌లో చాలా ఉపయోగకరమైన సమాచారం ఉన్నదని… బయటకు చెప్పిన దాని కంటే ఎక్కువే ఆయనకు తెలుసని ఈ ఈమెయిల్స్ నిరూపిస్తున్నాయని ఆమె అన్నారు.
కరోనా వైరస్ విషయంలో తాను చెప్పిందే నిజమైందని ట్రంప్ కూడా ఈ ఈమెయిల్స్‌ను ఉద్దేశించి అన్నారు. నా పనిని మొదటి నుంచీ వాళ్లు పరిశీలించారు. అసలు ఏం జరిగిందో వాళ్లకు తెలుసు. కానీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ల ప్రయోజనాల కోసం ఇన్నాళ్లూ ఏమీ తెలియనట్లుగా నటిస్తోందని యాన్ ఆరోపించారు. ఫౌచీకి అన్ని విషయాలూ తెలుసని ఆమె స్పష్టం చేశారు. కొవిడ్-19 వైరస్ విషయంలో గెయిన్-ఆఫ్-ఫంక్షన్ ప్రయోగం జరిగి ఉండొచ్చని గతేడాది ఫిబ్రవరి 1న ఫౌచీ పంపిన ఈమెయిల్‌లోనే ఉన్నదని యాన్ తెలిపారు.