AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Population of China: ముగ్గుర్ని కనాలా.. మీకో దండం బాబోయ్.. చేతులెత్తేస్తున్న చైనా జంటలు

Population of China: ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలని షరతు విధించిన తాజాగా ముగ్గురు సంతానానికి అనుమతించిన విషయం తెలిసిందే.

Population of China: ముగ్గుర్ని కనాలా.. మీకో దండం బాబోయ్.. చేతులెత్తేస్తున్న చైనా జంటలు
Three Child Policy
Shiva Prajapati
|

Updated on: Jun 04, 2021 | 5:30 PM

Share

Population of China: ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలని షరతు విధించిన తాజాగా ముగ్గురు సంతానానికి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల చైనా ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు పిల్లలు అంటే సాధ్యమయ్యే పని కాదంటున్నారు. వాస్తవానికి చైనాలో 1950 నాటికే జనాభా పెరుగుదల అధికంగా ఉంది. ఆ నేపథ్యంలో 1970 జనాభా నియంత్రణ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 1970 నుంచి 2016 వరకు ఒకరిని మాత్రమే కనాలనే నిబంధనను తీసుకువచ్చింది. ఆ పాలసీని కఠినంగా అమలు చేసింది కూడా. అయితే, ఆ విధానమే ఇప్పుడు చైనా కొంపముంచింది. ఒక్క సంతానం విధానంతో దేశంలో యువ మానవ వనరు లభ్యత తగ్గి.. వృద్ధుల సంఖ్య గనణీయంగా పెరిగింది. దాంతో అప్రమత్తమైన చైనా.. 2016లో ఇద్దరు సంతానానికి అనుమతించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో తాజాగా ముగ్గురు పిల్లలను కనొచ్చని స్పష్టం చేసింది.

అయితే, చైనా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన విధానంపై ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు పిల్లలను కనాలని ప్రోత్సహించడం సరికాదంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యాయాలు, గృహనిర్మాణం, విద్య, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దంపతలు ఒక్కరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే.. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆదేశ ప్రజలు ఊహించని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దాదాపు 90 శాతం మంది ప్రజలు ముగ్గురు పిల్లలను కనేందుకు అనాసక్తత కనబరిచారు. ప్రభుత్వ నిబంధనను పరిగణించబోమని స్పష్టం చేశారు. మీకోదండం బాబోయ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రజలు ఈ విధానాన్ని వ్యతిరేకించడానికి మరొక కారణం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. చాలా మంది మహిళలు తాము పని చేసే కార్యాలయాల్లో వివక్షత ఎదుర్కొనడమే కాకుండా.. వారికి ప్రసూతి సెలవులు ఇవ్వడానికి కంపెనీల యజమానులు విముఖత ప్రదర్శిస్తున్నారు. దాంతో ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల ఇబ్బందులే తప్ప ప్రయోజనం ఉండదనే భావనకు వస్తున్నారు. ప్రసూతి సెలవులు అడిగినందుకు కంపెనీల యజమానులు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించిన దాఖలాలను ఉదాహరణగా చూపుతున్నారు. అంతేకాదు.. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చాలా కంపెనీల్లో మహిళలు ఉద్యోగం పొందాలంటే ముందుగా గర్భం దాల్చబోమని ఒప్పంద పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందట. ముగ్గురు పిల్లలను కనేందుకు నిరాసక్తత చూపేందుకు ఇది ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, దేశ జనాభా నిర్మాణంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని, ఆ కారణంగా ముగ్గురు సంతానానికి అనుమతించడం జరిగిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. ముగ్గురు సంతానం విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని చెప్పింది. దేశంలో పెరుగుతున్న వృద్ధాప్య జనాభా నియంత్రణకు.. దేశాభివృద్ధికి అవసరమైన మానవ వనరుల అభివృద్ధికి ఈ చర్య ఉపకరిస్తుందని చెప్పుకొచ్చింది. చైనా కొత్త విధానం స్థిరమైన శ్రామిక శక్తితో పాటు ఉత్పాదక శక్తిగా ప్రపంచంలో నిలిపేందుకు ఉపకరిస్తుందని ఆదేశం చెబుతోంది. అలాగే.. పదవీ విరమణ వయస్సును పెంచడం వంటి ఇతర విధానాలు కూడా దేశ శ్రామిక శక్తిని కొనసాగించడమే అవుతుందని పేర్కొంది.

ఇదిలాఉంటే.. జననాల రేటును పెంచడానికి ఈ చర్య పెద్దగా ఉపయోగపడదని విమర్శకులు అంటున్నారు. ఈ పాలసీకి బదులుగా మహిళలపై వివక్ష తగ్గించడం, సరైన సామాజిక భద్రతా నియమాలు, విద్య, గృహాలను అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం మంచిదంటున్నారు.

‘‘ప్రభుత్వ పాలసీ కీలకమైనదే. కానీ.. ముగ్గురు పిల్లల విధానం మాత్రమే సంతానోత్పత్తి రేటులో స్థిరమైన వృద్ధి పుంజుకోవడానికి దారితీయదు’’ అని ప్రొఫెసర్ యువాన్ జిన్ అన్నారు. ‘‘పిల్లల సంరక్షణ, తల్లిదండ్రులకు పన్ను రాయితీలు, హౌసింగ్ సబ్సిడీలు, లింగ సమానత్వం వంటి విధానాలు అమలు చేయడం అవసరం. అలాగే తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటానికి ప్రోత్సాహకాలను, సామాజిక వాతావరణాన్ని సృష్టించడం అవసరం’’ అని ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ముగ్గురు సంతానం విధానం ప్రభావవంతంగా ఉండటానికి పన్ను ప్రోత్సాహకాలు, విద్య, గృహ రాయితీలు, ఉదార​ప్రసూతి సెలవులు, పిల్లల సంరక్షణ వంటి సమగ్ర పాలసీ అవసరం అని మేనేజింగ్ డైరెక్టర్, చైనా ప్రముఖ ఆర్థికవేత్త లియు లి-గ్యాంగ్ అన్నారు.

Also read:

Viral Video: ఫుల్లుగా తాగేసిన పెళ్లికొడుకు.. వధువుకు బదులుగా కాబోయే అత్త మెడలో.. వైరల్ వీడియో.!