China Coronavirus: చైనాలో మళ్లీ కరోనా పంజా.. వైరస్ కట్టడికి పలు నగరాల్లో లాక్‌డౌన్..
చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి భయాందోళనకు గురిచేస్తోంది. సెలవుల తర్వాత పెరిగిన కరోనా కేసులతో నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించింది సర్కార్..దీంతో మరోసారి ఇళ్లకే పరిమితమైయ్యారు ప్రజలు..

చైనాపై కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. పోయిందనుకున్న మహమ్మారి మరోసారి స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్ కట్టడికి చైనాలోని జిన్ పింగ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. తాజాగా ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో ఉన్న ఫెన్‌యాంగ్ సిటీలో లాక్‌డౌన్ విధించారు. సిటీలో వైరస్ టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో కొన్ని పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు స్థానిక మీడియా చెబుతోంది. ఇక ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న రాజధాని హోహాట్‌లో ఆంక్షలు విధించారు. బయిటి నుంచి వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గడిచిన 12 రోజుల్లో ఆ నగరంలో సుమారు 2వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
చైనాలో అక్టోబర్ తొలి వారంలో జాతీయ సెలువులు దినాలను ప్రజలు ఎంజాయ్ చేశారు. వాస్తవానికి ప్రయాణాలు తగ్గించుకోవాలని నిబంధనలు ఉన్నా.. ప్రజలు మాత్రం ఆ సెలవు రోజుల్లో తెగ తిరిగారు. దీంతో మళ్లీ చైనాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా రిపోర్ట్‌లు చెబుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో కొన్ని పట్టణాల్లో సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్లు ప్రారంభించారు. కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగిన తరువాత చైనాని ప్రధాన నగరాల్లో పరిమితులను విధించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
మరోవైపు, వచ్చే వారం నుంచి బీజింగ్‌లో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగానే లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. కరోనా నియంత్రణ విషయంలో చైనా ఇంకా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. కానీ కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మరింత కలవరం పెరిగింది. పార్టీ సమావేశాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ముందుగానే పలు నగరాల్లో లాక్‌డౌన్లు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..
