America Strategies: అమెరికా యుద్దతంత్రంలో కొత్త వ్యూహాలు.. రెండు కూటమిల వెనుక వ్యూహమదేనా?
కొత్త యుద్ధతంత్రాలకు నాందీ పలకడం.. కొత్త కూటమిలను ఏర్పాటు చేస్తూ ప్రపంచ పెద్దన్న తానేనని చాటుకోవడంలో అమెరికా ఎప్పుడూ ముందే వుంటుంది. ఈక్రమంలోనే తాజాగా ఓవైపు క్వాడ్ (క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) పేరిట జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాతో ఓ కూటమిని బలోపేతం చేస్తున్న సంకేతాల్నిస్తోంది. ఈ నాలుగు దేశాల కూటమి...
America Strategies long-term plan for Asian continent: అమెరికా వ్యూహాలు అంత ఈజీగా అర్థం కావు. న్యూయార్క్ సిటీలోని రెండు టవర్లను అల్ ఖయిదా తీవ్రవాదులు కూల్చేసిన తరుణంలో మధ్యప్రాచ్యంలోని పలు దేశాలతోపాటు అఫ్గానిస్తాన్ వంటి ఆసియా దేశాలను టార్గెట్ చేసిన అమెరికా.. ఆ తర్వాత రెండు దశాబ్దాలపాటు అఫ్గానిస్తాన్‌లో ఉగ్రమూలాల ఏరివేత పేరు మీద పెత్తనం చెలాయించింది. ప్రపంచపటంలో ఎన్నో దేశాలలో చొరబడి.. అక్కడి ప్రభుత్వాల సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకంలో పడేసి మరీ తన పెత్తనాన్ని చెలాయించిన అమెరికా ఎన్నోసార్లు అంతర్జాతీయ సమాజం ముందు విమర్శలను మూటగట్టుకుంది. అయితే తాజాగా అమెరికా వేస్తున్న అడుగులపై విశ్లేషకులు పలు రకాల అంఛనాలను తెరమీదికి తెస్తున్నారు. దీనికి ఇటీవల అమెరికా వేదికగా జరిగిన కొన్ని సమావేశాలు ఉప్పందించాయి.
కొత్త యుద్ధతంత్రాలకు నాందీ పలకడం.. కొత్త కూటమిలను ఏర్పాటు చేస్తూ ప్రపంచ పెద్దన్న తానేనని చాటుకోవడంలో అమెరికా ఎప్పుడూ ముందే వుంటుంది. ఈక్రమంలోనే తాజాగా ఓవైపు క్వాడ్ (క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) పేరిట జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాతో ఓ కూటమిని బలోపేతం చేస్తున్న సంకేతాల్నిస్తోంది. ఈ నాలుగు దేశాల కూటమి పసిఫిక్ మహాసముద్రంపై చైనా పెత్తనాన్ని.. దురాక్రమణని అడ్డుకునేందుకు పని చేస్తుందని చెబుతున్నారు. ఇంకోవైపు ఆకస్ పేరిట మూడు దేశాల కూటమిని ఏర్పాటు చేసి.. కొన్ని యూరోపియన్ దేశాలకు ఇబ్బందికరమైన పరిణామాలకు తెరలేపింది అమెరికా. ఆకస్ అంటే.. ఆస్ట్రేలియా, యుకే, యుఎస్ అనే మూడు దేశాల సమాహారం. దీన్ని కూడా ఇండో పసిఫిక్ రీజియన్ లక్ష్యంగా పనిచేసే కూటమిగా సెప్టెంబర్ 15వ తేదీన ప్రకటించారు. తాము వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి యుద్ధానికి ఓ జెన్యూన్ కారణం వుందని చాటుకోవడం అమెరికా నైజం. అయితే, తాజాగా రెండు కూటమిలను తెరమీదికి తెచ్చిన అమెరికా వెనుక పెద్ద వ్యూహమే వుందని అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించే విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు.
క్వాడ్ (ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా) కూటమి అయినా.. ఇప్పుడు కొత్తగా అమెరికా నాయకత్వంలో ఏర్పడిన ఆకస్ (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా) కూటమి అయినా అమెరికన్ యుద్ధనీతిలో సరికొత్త వ్యూహాలేనని చెప్పాలి. అసియా–పసిఫిక్‌లో భద్రత, శ్రేయస్సు కోసమని ఎప్పటిలాగే అమెరికా చెబుతున్నప్పటికి.. చైనా విస్తరణకు సాకుగా చూపెట్టి కొత్త యుద్ధరంగాన్ని సిద్ధం చేస్తున్న పెద్దన్న వ్యూహంలో భాగమే ఈ డ్రామా అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ పేరిట పసిఫిక్ మహాసముద్రంలో పెద్దరికానికి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే.. చైనా పసిఫిక్ ఓషియన్‌లో కృత్రిమ దీవులను ఏర్పాటు చేస్తూ.. వాటిలో కొత్త జనావాసాలను ఏర్పాటు చేస్తూ.. అవి తమ సొంతమని చాటుకునేందుకు యత్నిస్తోంది. ఇండియా, చైనా బోర్డర్‌లో కృత్రిమ గ్రామాలను సృష్టిస్తూ మనకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న డ్రాగన్ కంట్రీ అదే తరహా వ్యూహాన్ని పసిఫిక్ మహాసముద్రంపై పెత్తనానికి అనుసరిస్తోంది. పసిఫిక్ ఓషియన్ ద్వారా హిందూ మహాసముద్రంలోకి జలాంతర్గాములను పంపుతున్న చైనాతో ఇటు మనకు, అటు ఆస్ట్రేలియా దేశానికి ఇబ్బంది వుండొచ్చు కానీ అమెరికాకు ఏ రకమైన ఇబ్బంది అనేదే ప్రశ్న. అమెరికా దగ్గర 8 వేలకు పైచిలుకు అణ్వస్త్రాలున్నాయి. అదేసమయంలో చైనా దగ్గర 300 న్యూక్లియర్ వెపన్స్ వున్నాయి. కానీ ఇటీవల కాలంలో చైనా తమ అణ్వస్త్ర సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోందని అమెరికా భావిస్తోంది.
ఇంకోవైపు మూడు దేశాలు.. ఆస్ట్రేలియా, యుకే. యుఎస్‌ల కూటమిగా ఏర్పాటైన ఆకస్.. ద్వారా పసిఫిక్ ఓషియన్‌లో నిఘా పెంచేందుకుగాను ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే జలాంతర్గాములను నిర్మించే సాంకేతిక సమాచారాన్ని యుకే, యుఎస్ అందిస్తాయి. అయితే… ఈ విషయంలో ఆస్ట్రేలియా ఇదివరకే ఫ్రాన్స్ దేశంతో ఓ ఒప్పందాన్ని చేసుకుంది. ఇపుడు ఆకస్ పేరిట కొత్త కూటమి ఏర్పాటుతో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ పాత ఒప్పందం అటకెక్కనున్నదని విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. అయితే.. ఇక్కడే అమెరికా దీర్ఘకాల వ్యూహం కనిపిస్తోందని వారు చెబుతున్నారు. ఈ కొత్త కూటమి ఏర్పాటు అసియా–పసిఫిక్ ఓషియన్ రిజీయన్‌లో భద్రత, శ్రేయస్సు కోసమని అమెరికా వాదిస్తోంది. దానికోసమే ఆకస్ అగ్రిమెంట్ అని అంటోంది. కానీ ఇదంతా అమెరికా ప్రచ్ఛన్న యుద్దానికి తెరలేపేందుకే చేస్తోందని డ్రాగన్ కంట్రీ కొత్త వాదనను తెరమీదికి తెచ్చింది. మరికొందరు విశ్లేషకుల అంఛనా ప్రకారం చూస్తే.. అసియా ఖండంపై పెత్తనం చేసేందుకు భారత్, చైనాలను యుద్దంలోకి అమెరికా దింపుతోందని తెలుస్తోంది. రెండు దేశాలను యుద్దంలోకి దింపి.. వారిద్దరి మధ్య మధ్యవర్తిత్వం నెరపడం ద్వారా తన పెత్తనాన్ని చాటుకునేందుకు అమెరికా యత్నిస్తోందని చైనా అనుకూల విశ్లేషకులు కథనాలు రాస్తున్నారు. అయితే.. ఈ విశ్లేషకుల వాదనకు బలం చేకూర్చేందుకు ఓ ప్రకటన తార్కాణంగా నిలుస్తోంది. 2011లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసియా పివోట్ పథకాన్ని ప్రకటించడాన్ని వీరు ఉదాహరణగా చూపిస్తున్నారు.
తాజాగా అకస్ కూటమి ఏర్పాటుతో చిరకాలంగా కొనసాగుతున్న నాటో యుద్ధ కూటమిలోను.. ఈయూ దేశాల్లో లుకలుకలు కూడా ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ తన రాయబారులను అమెరికా, ఆస్ట్రేలియాలనుంచి వెనకకు రప్పించి, ఇది అమెరికా వెన్నుపోటని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. బ్రిటన్‌తో రక్షణశాఖ చర్చలను రద్దు చేసుకొంది. ఈ ఆకస్ ఒప్పందం అసలు ఉద్దేశం భద్రతకు సంబంధించినది కానేకాదు, అమెరికా యుద్ధ పరిశ్రమల కార్పొరేట్లకు లాభాలను ఆర్జించడం కోసమేనని అంటున్నారు. ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్ లోగడ 2016లో డీజిల్‌తో నడిపే 12 జలాంతర్గాములను 36 వేల 400 కోట్ల డాలర్లతో ఎగుమతి చేయటానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజా ఆకస్ ఏర్పాటుతో ఫ్రాన్స్ ఒప్పందం చిత్తు కాగితంగా మారింది. ఈక్రమంలో మనదేశం ఎలాంటి అంతర్జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.