Eid 2025: పవిత్ర రంజాన్ మాసం: షవ్వాల్ నెల మొదటి రోజే.. ‘ఈద్ ఉల్ ఫితర్’!
ఆకాశాన నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం మొదలవుతుంది. ఇక ఆ రోజు నుంచి ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠగా ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ నెలంతా ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో ఆ అల్లా చింతనలోనే ముస్లింలు సమయం గడుపుతారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలతో నెల పూర్తవగానే షవ్వాల్ నెలవంక ఆకాశంలో ప్రత్యక్షమవుతుంది.

ఆకాశాన నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం మొదలవుతుంది. ఇక ఆ రోజు నుంచి ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠగా ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ నెలంతా ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో ఆ అల్లా చింతనలోనే ముస్లింలు సమయం గడుపుతారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలతో నెల పూర్తవగానే షవ్వాల్ నెలవంక ఆకాశంలో ప్రత్యక్షమవుతుంది. షవ్వాల్ నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు అప్పటివరకు ఆచరిస్తున్న ఉపవాస దీక్షలను అంతటితో విరమిస్తారు. ఆ మరుసటి రోజే రంజాన్ పర్వదినం. అత్యంత భక్తిశ్రద్దలతో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ముస్లింలు ఘనంగా రంజన్ పండుగను జరుపుకుంటారు.
ఈ రంజాన్ మాసంలో అత్యంత నియమ నిష్ఠలతో జరుపుకునే పండుగలలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉంటాయి. షవ్వాల్ నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈ పండుగను పేద, ధనిక అనే తేడా లేకుండా అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. ఇంట్లోని ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి అందంగా తయారవుతారు. ఆ అల్లాను భక్తితో కొలవడానికి నమాజు చేస్తారు. ఈ నమాజును పఠించే ప్రదేశాన్ని ఈద్గాలు అంటారు. ముస్లింలు అంతా ఒకచోట చేరి ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆ రోజంతా సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఈ పవిత్ర దినాల్లో జరుపుకునే మరో ముఖ్యమైన కార్యక్రమమే ఇఫ్తార్ విందులు. చిన్నాపెద్ద అంతా ఒక్కచోట చేరి ఆ అల్లాను భక్తితో తలుస్తూ విందు ఆరగిస్తారు. ఇదే ఇఫ్తార్ విందు. ఈ విందులో ఎన్నెన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయో లెక్కే లేదు. ముఖ్యంగా రకరకాల పండ్లకు ఈ విందులో ప్రాధాన్యం ఇస్తారు.
ఇంతటితోనే అయిపోలేదు. రంజాన్ పవిత్ర మాసంలో నెల రోజుల పాటు ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాస దీక్షల గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మాసం మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్ర లేస్తారు. ఆపై ఆహారం తీసుకుని, తర్వాత రోజంతా కఠిన ఉపవాసం ఉంటారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్ష విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని సహర్ అని, సాయంత్రం ఉపవాస దీక్షను విరమించడాన్ని ఇఫ్తార్ అని పిలుస్తారు. మరీ ముఖ్యంగా ఈ ఇఫ్తార్ సమయంలో ఎలాంటి బేధాలు చూడరు. చిన్నా, పెద్ద, బీద, ధనిక అక్కడ ఎవరైనా సమానమే. అందరూ అల్లాకి దాసోహులే. రోజంతా ఉపవాసం ఉన్న ముస్లింలు సూర్యాస్తమయం దగ్గర పడుతుందనగా పెద్దఎత్తున మసీదులకు చేరుకుని అత్యంత భక్తిశ్రద్దలతో ప్రార్థనలు చేస్తారు. ఏ మసీదులో చూసినా బారులు తీరి ముస్లింలు కనిపిస్తారు. అంతా ఒక్కచోట చేరి ఆ భగవంతుని ప్రార్థించడంలో ఒక ఐక్యత కనిపిస్తుంది.
పవిత్ర రంజాన్ మాసంలో జకాత్, ఫిత్రాలు మరింత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అంటే ముస్లింలు ఈ నెలలో దానధర్మాలకు ఎంతో విలువ ఇస్తారు. జకాత్ పద్ధతిలో భాగంగా సంపాదించిన దాంట్లో కొంత భాగం అవసరంలో ఉన్నవారికి అందించాలానే నియమం ఉంది. ఇలా చేసినట్లయితే మనం పేదవారి కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నేరుగా అల్లాకి చేరుతుందని బలంగా నమ్ముతారు. ఖురాన్ ప్రకారం.. జకాత్ పేరున పెట్టిన ప్రతి పైసాకు ఏడు వందల రెట్లు పుణ్యఫలం లభిస్తుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇది అవసరంలో ఉన్న ముస్లింలకు తప్ప వేరే మతస్తులకు ఇవ్వడానికి కుదరదు. ఇదిలా ఉంటే, ఇలా అవసరం ఉన్నప్పటికీ చేయి చాచి అడగనివారు కూడా ఉంటారు. వాళ్లనే మిస్కీన్లు అంటారు. ఈ మిస్కీన్లు కేవలం తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఉన్న దాంట్లోనే సర్దుకుని బతికేస్తారన్న మాట. పరిస్థితులు ఎంత దీనంగా ఉన్నా ఒకరి ముందు చస్తే చేయిచాచి అడగరు. అలాంటి వారిని గుర్తించి మరీ వారికి తోచినంత సహాయం చేయడం మంచిదని అంటారు. మరీ ముఖ్యంగా ఇలాంటివారినే ఆదుకోవాలని, వీళ్లే జకాత్ దానాలకు అసలైన అర్హులని చెబుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..