America Population: అగ్రరాజ్యంలో జన విస్ఫోటం.. గత పదేళ్ళలో భారీగా పెరిగిన అమెరికా జనాభా

అగ్రరాజ్యం అమెరికాలో జనాభా గణనీయంగా పెరుగుతోంది. గత పదేళ్ళలో గతంలో ఏ దశాబ్ధంలోను నమోదు కాని స్థాయిలో అమెరికా జనాభాలో...

America Population: అగ్రరాజ్యంలో జన విస్ఫోటం.. గత పదేళ్ళలో భారీగా పెరిగిన అమెరికా జనాభా
America
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 28, 2021 | 4:44 PM

America Population raised in last decade: అగ్రరాజ్యం అమెరికాలో జనాభా గణనీయంగా పెరుగుతోంది. గత పదేళ్ళలో గతంలో ఏ దశాబ్ధంలోను నమోదు కాని స్థాయిలో అమెరికా జనాభాలో పెరుగుదల నమోదైంది. 2010-2020 మధ్య కాలంలో అమెరికాలో పెరిగిన జనాభా గణాంకాలను యూఎస్ పాపులేషన్ బ్యూరో విడుదల చేసింది. మన దేశంలోలాగానే అమెరికాలోను పదేళ్ళకు ఓసారి జనాభాను గణిస్తారు. ఈ బాధ్యతను యూఎస్ పాపులేషన్ బ్యూరో నిర్వహిస్తుంది.

2020 జనాభా లెక్కల డేటాను యూఎస్ పాపులేషన్ బ్యూరో తాజాగా విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం అమెరికా జనాభా 33 కోట్లను దాటేసింది. 2020 ఏప్రిల్ 1వ తేదీ నాటికి అగ్రరాజ్య జనాభా అక్షరాలా 33 కోట్ల 14 లక్షల 49 వేల 281 మంది. అమెరికాలోను 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సహా ఈ జనాభా వున్నట్లు పాపులేషన్ బ్యూరో వెల్లడించింది. 2010-2020 మధ్య కాలంలో అమెరికా జనాభా 7.4 శాతం పెరిగినట్లు బ్యూరో ప్రకటించింది. ఇది గతంలో ఏ దశాబ్ధంలోను నమోదు కానంతటి నెంబర్.

యూఎస్‌లోని ప్రతీ రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారంగానే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లను ఖరారు చేస్తారు. ఈ జనాభా ప్రకారమే రాష్ట్రాలకు ప్రభుత్వ పథకాలు, సహాయం అందుతుంటాయి. తాజా జనాభా లెక్కల ప్రకారం టెక్సాస్, కొలరాడో, ఫ్లోరిడా, మోంటానా, నార్త్ కరోలినా, ఒరెగాన్ రాష్ట్రాల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మిచిగాన్, న్యూయార్క్, ఒహియో, పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లు తగ్గే పరిస్థితి వుంది. ప్రపంచంలోని వలసవాదులకు గమ్యస్థానంగా మారిన అమెరికాలో సహజంగానే జనాభా పెరిగినట్లు భావిస్తున్నారు.

2019 నవంబర్ అమెరికన్ కమ్యూనిటీ సర్వే లెక్కల ప్రకారం చూస్తే.. అమెరికా జనాభా మొత్తం 327 (32 కోట్ల 70 లక్షలు) మిలియన్లు. కాగా వీరిలో విదేశీ సంతతికి చెందినవారు 13.7 శాతం అంటే 44.7 మిలియన్లు. గత కొన్నేళ్లుగా 0.4 శాతం చొప్పున అమెరికాలో విదేశీ సంతతి జనాభా పెరుగుతున్నట్లు తేలింది. 2010 నాటికి విదేశీ సంతతి జనాభా 40 మిలియన్లు కాగా.. 2018 నాటికి 11.8 శాతం పెరిగింది. జులై 1, 2018 నాటికి అమెరికాలో భారత సంతతి ప్రజలు 2.5 మిలియన్లు (సుమారు 25 లక్షలు). 2010 నాటితో పోలిస్తే భారత సంతతి ప్రజలు 1.5 శాతం పెరిగింది. అమెరికాలోని మొత్తం విదేశీ సంతతి జనాభాలో భారతీయుల శాతం 5.9. ఇది అమెరికా జనాభాలో 1 శాతం. 2010-2018లో భారతీయుల సంఖ్య 8.7 లక్షలకు పెరిగింది. 49 శాతంగా పెరుగుదల నమోదైంది.

1990కి పూర్వం అమెరికాలో భారతీయ సంతతి జనాభా కేవలం 4.5 లక్షల మంది కాగా.. 2018 నాటికి 489 శాతం పెరగింది. 2018కి 2.84 మిలియన్లతో చైనా సంతతికి చెందిన జనాభా 32 శాతం పెరిగింది. అమెరికా జనాభా లెక్కల బోర్డు ప్రకారం.. విదేశీ సంతతి అంటే అమెరికన్ పౌరులు కాదని అర్ధం. 1990 తర్వాత ఇండియాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దరిమిలా పలు విదేశీ సంస్థలు దేశంలోకి ప్రవేశించడం.. అందులో అమెరికా సంస్థల పాత్ర అధికంగా వుండడంతో మానవ వనరుల బదలాయింపు పెద్ద ఎత్తున మొదలైంది. 90వ దశకం నుంచి దాదాపు ముప్పై ఏళ్ళలో భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వలస వెళ్ళారు. ఉద్యోగాల కోసం కొందరు, ఉన్నత విద్య కోసం మరికొందరు అమెరికా బాట పట్టారు. ఇందువల్లనే అమెరికాలో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు.

ALSO READ: రెండ్రోజుల్లో అతిపెద్ద వ్యాక్సిన్ వార్.. డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ సాధ్యమేనా?