Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: రెండ్రోజుల్లో అతిపెద్ద వ్యాక్సిన్ వార్.. డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ సాధ్యమేనా?

జనవరి 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో ఇప్పటి దాకా 15 కోట్ల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ చేరింది. అయితే, రెండో డోసు చేరిన వారి సంఖ్య  3 కోట్లకు లోబడే వుండడం ఆలోచించవలసిన విషయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో 18 ఏళ్ళు పైబడిన వారందరికీ టీకా చేరడం సాధ్యమేనా?

Covid Vaccine: రెండ్రోజుల్లో అతిపెద్ద వ్యాక్సిన్ వార్.. డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ సాధ్యమేనా?
Corona.
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 28, 2021 | 3:15 PM

Covid Vaccine war to begin day after: మరో రెండు రోజుల్లో అంటే మే 1 నుంచి దేశవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ (VACCINATION PROGRAM) ప్రారంభం కాబోతోంది. 18 సంవత్సరాలు నిండిన అందరికీ కరోనా వ్యాక్సిన్ (CORONA VACCINE) అందించాలని కేంద్ర ప్రభుత్వం (CENTRAL GOVERNMENT) లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో అందుకు మే 1వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు. 2021 జనవరి 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో ఇప్పటి దాకా 15 కోట్ల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ చేరింది. అయితే, రెండో డోసు చేరిన వారి సంఖ్య  3 కోట్లకు లోబడే వుండడం ఆలోచించవలసిన విషయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో 18 ఏళ్ళు పైబడిన వారందరికీ టీకా చేరడం సాధ్యమేనా? అందుకోసం ఏ స్థాయిలో కసరత్తు అవసరం అనే అంశాలు తెరమీదికి వస్తున్నాయి.

ప్రపంచంలోనే భారత దేశం (INDIA) జనాభా ప్రాతిపదికన రెండో అతిపెద్ద దేశం. మరో దశాబ్ధంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి దేశంగా చైనా (CHINA)ను రెండో స్థానంలోకి ఇండియా నెట్టేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. దానికి తోడు జనసాంద్రత కూడా మన దేశంలో ఎక్కువే. లక్షలాది మంది ప్రజలు ఏ సౌకర్యాలు లేకుండా మురికి వాడల్లో నివసిస్తున్నారు మన దేశంలో అనడానికి ముంబై (MUMBAI) నగరంలోని ధారవి ఏరియాను ఉదాహరణగా చూపించవచ్చు. ఇలాంటి దేశంలో కరోనా మొదటి వేవ్‌ (CORONA SECOND WAVE)ను విజయవంతంగా, మరీ ఎక్కువ స్థాయిలో మరణాలు లేకుండా నియంత్రించడం మన దేశం సాధించిన విజయంగానే చూడాలి. కానీ సెకెండ్ వేవ్ (SECOND WAVE) మాత్రం చాలా తీవ్రంగా వుండడంతో రాజకీయపరమైన విమర్శలు మీడియాలో వినిపిస్తున్నాయి.

గత సంవత్సరం (2020)లో సడన్ లాక్ డౌన్ (LOCK DOWN) ప్రకటనతో వలస జీవులను ఇబ్బందుల పాలు చేశారంటూ విమర్శించిన విపక్షాలు ఇపుడు లాక్ డౌన్ ఎందుకు విధించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. నిజానికి ఆనాటి సడన్ లాక్ డౌన్ వల్ల ఒనగూడిన ప్రయోజనాలు ఎన్నో. ఏప్రిల్ (2020 APRIL) నుంచి సెప్టెంబర్ (SEPTEMBER 2020) దాకా వివిధ దశల్లో కొనసాగిన లాక్ డౌన్ కారణంగానే దేశంలో ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) నియంత్రణలోకి వచ్చాయి.. మరోవైపు అసలు కరోనా వైరస్‌ (CORONA VIRUS)నే గుర్తించలేని దశ నుంచి వైరస్‌ను గుర్తించడమే కాదు.. దాన్ని శరీరంలోనే చంపేసి.. ప్రాణాలను కాపాడే స్థాయిలో మన దేశ వైద్య రంగం ఎదిగింది. అసలు వైరస్‌నే గుర్తించే సత్తా పూర్తి స్థాయిలో లేని సందర్భంలో లాక్ డౌన్ ఒక్కటే దిక్కైందన్న విషయం ఏ కాస్త బుర్ర వున్న వారికైనా బోధపడుతుంది.

కానీ ప్రస్తుతం పరిస్థితి వేరు. వైరస్.. దాని మ్యూటెంట్ వెర్షన్లను కూడా విజయవంతంగా గుర్తించడంతోపాటు.. అది సోకిన వారిని కాపాడే స్థాయికి మన వైద్య రంగం ఎదిగింది. అయితే.. అనాదిగా దేశంలో వైద్య రంగాన్ని అభివృద్ధి పరచకపోవడం ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్న మ్యూటెంట్ వైరస్ బారిన పడి సడన్‌గా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ కనిపించేలా చేస్తున్నది. దేశం స్వతంత్రం పొందిన 5, 6 దశాబ్దాల పాటు దేశంలో ఎన్ని వైద్య కళాశాలులున్నాయి… ఆ తర్వాత గత ఏడేళ్ళలో దేశంలో ఎన్ని వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయే ఓ సారి లెక్క చూసుకుంటే పరిస్థితి మెరుగ్గా వుందా లేదా అన్నది బోధపడుతుంది. ఈనాటి వైద్య సౌకర్యాల కొరతకు దశాబ్ధాల కాలంపాటు కొనసాగిన నిర్లక్ష్యమే కారణమంటే కాదనలేం.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం మే ఒకటవ తేదీ నుంచి దేశంలో వ్యాక్సినేషన్ యుద్దం ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే అందరికీ వ్యాక్సిన్ అందుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఒక వేళ అందరికీ అందినా… ఎంత కాలం పాటు ఈ వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగించాల్సి వస్తుంది? మరి అంతకాలం కరోనా సెకెండ్ వేవ్‌ నియంత్రణ సాధ్యమా? ఇలాంటి అంశాలిపుడు హాట్ టాపిక్‌గా మారాయి.

మే 1 నుంచి అందరికీ టీకాలు అందిస్తామంటున్న ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి వుంది. డిమాండ్‌కు సరిపడా టీకాలు సప్లయ్‌ లేకపోతే జనం ఉక్కిరి బిక్కిరి అవడం ఖాయంగా కనిపిస్తోంది. కోవిన్‌ (COWIN) యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఆ యాప్‌కు జనం తాకిడి పెరిగితే తట్టుకునేలా దాన్ని రూపొందించిందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ సందేహాలకు సమాధానం ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం తెలిసే అవకాశం వుంది. అయితే.. ప్రస్తుతం వ్యాక్సిన్‌ కొరత కనిపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 28వ తేదీన నమోదు చేసుకునే యువతకు ఏనాటికి టీకా అందుతుందోనన్న కలవరం కనిపిస్తోంది.

ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు (TELUGU STATES GOVERNMENTS) తమ రాష్ట్రాల్లోని 18 నుంచి 44 ఏళ్ళ వయసు వారందరికీ ఉచితంగా టీకాలు (FREE VACCINATION) ఇస్తామని ప్రకటించాయి. కానీ ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే మొదటి డోస్‌ కరోనా టీకా వేసుకున్న వారికి ఇంకా సెకండ్‌ డోస్‌ అందని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో తొలిడోసు 37.58 లక్షల మందికి చేరగా.. రెండో డోసు 5 లక్షల 30 వేల మందికి మాత్రమే పంపిణీ అయ్యింది. ఏపీలో ఏప్రిల్‌ 24 వ తేదీ నాటికి తొలిడోసు తీసుకున్న వారు 45 లక్షల మంది కాగా.. రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 11 లక్షలు మాత్రమే. తెలంగాణలో 18-44 వయసు కల వారి సంఖ్య 1.80 కోట్లుగా కనిపిస్తుండగా.. ప్రస్తుతం వీరికి రెండు డోసుల టీకాలు వేయాలంటే 3.60 కోట్ల టీకా డోసులు అవసరం వుంది. ఏపీలో 18-44 వయసు కల వారి సంఖ్య 2.4 కోట్లు కాగా.. వీరికి రెండు డోసుల టీకాలు వేయాలంటే 4.8 కోట్ల టీకా డోసులు అవసరం వుంది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతీ రోజు కరోనా వ్యాక్సిన్ 22 లక్షల మందికి మాత్రమే చేరుతోంది. దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 94 కోట్లు కాగా.. వీరికి 188 కోట్ల డోసులు అవసరం పడుతుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 15 కోట్ల మందికి మొదటి డోసు పంపిణీ జరిగింది. కాగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య మాత్రం కేవలం 2.38 కోట్లు మాత్రమే. తొలి డోసు తీసుకున్న వారికి రెండో డోసు అందించాలంటే 12.12 కోట్ల వ్యాక్సిన్ వయళ్ళు అవసరం అవసరం వున్నాయి. కానీ ఆ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి లేకపోవడం వల్ల దేశంలో వ్యాక్సిన్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గణాంకాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తుండగా… సరైన సన్నద్ధత లేకుండా వ్యాక్సినేషన్ వార్ ప్రారంభిస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఊహించకుండా వుండలేము. ఈ ఏడాది ఆఖరు నాటికి దేశంలో అందరు పౌరులకు కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఆ స్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండానే మే ఒకటవ తేదీ నుంచి అతిపెద్ద వ్యాక్సిన్ వార్‌కు తెరలేపుతారా అంటే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఉత్పత్తి పెంచడమే మార్గం..

మన దేశ జనాభా 140 కోట్లు. ఇందులో కేవలం పది శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ మొదటి డోసు చేరింది. కేవలం రెండు శాతం మందికి మాత్రమే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ చేరింది. మరి ఇంత పెద్ద దేశంలో భారీ జనాభాకు వ్యాక్సిన్ చేరాలంటే ఏదీ మార్గం? ప్రస్తుతం ఉన్న రెండు (కోవాక్సిన్, కోవిషీల్డు) వ్యాక్సిన్లకు తోడుగా మరికొన్నింటికి అనుమతులు ఇవ్వడంతోపాటు.. వీలైనంత త్వరగా వాటి ఉత్పత్తి శరవేగంగా చేపట్టాల్సి వుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి అందరికీ రెండు డోసుల టీకా అందించాలంటే ఎంతో వేగంగా ఉత్పత్తి పెంచాలి… అదే వేగంతో పంపిణీ చేయాల్సి వుంటుంది. ఇప్పటి మాదిరిగానే రోజుకు 22 లక్షల డోసుల చొప్పున పంపిణీ చేస్తే.. 94 కోట్ల మందికి రెండు డోసులు వేసేందుకు వేయి రోజులు పట్టే అవకాశం. అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలన్నమాట. అందుకే డిమాండ్‌కు తగ్గట్లుగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. అప్పుడే అందరికీ సకాలంలో టీకాలు ఇవ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.