AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Taliban: తాలిబన్ల రాజ్యంలో ఆకలి కేకలు.. అవయవాలు అమ్ముకుంటున్న ఆఫ్గాన్లు..

Afghans hunger crisis: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. తాలిబన్ల పాలనలో

Afghanistan Taliban: తాలిబన్ల రాజ్యంలో ఆకలి కేకలు.. అవయవాలు అమ్ముకుంటున్న ఆఫ్గాన్లు..
Afghans Hunger Crisis
Shaik Madar Saheb
|

Updated on: Jan 14, 2022 | 6:53 PM

Share

Afghans hunger crisis: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. తాలిబన్ల పాలనలో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఆఫ్గానిస్తాన్‌లో ఆకలిచావులు పెరిగిపోయాయి. ఆహార సంక్షోభంతో అల్లాడిపోతోంది ఆఫ్గానిస్తాన్‌. నేనే బతుకుతానో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరికి జన్మనిచ్చి ఎలా పోషించాలి. కడుపులోనే నా బిడ్డను చంపేయండి.. ఇదీ ఆఫ్గానిస్తాన్‌లోని పేద గర్భిణుల పరిస్థితి. తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. అంతర్జాతీయ సమాజం కూడా సహాయం చేయకపోవడంతో దేశంలో వైద్య, ఆర్ధిక వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. ఫలితంగా రెండు వారాల్లో కొత్తగా పుట్టిన ఎందరో శిశువులు ఆకలి బాధతో మరణించారు. ఆఫ్గానిస్తాన్‌లో తీవ్ర ఆకలి సంక్షోభం నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐక్యరాజ్య సమితి. ఈ శీతాకాలంలో కనీసం 1.4 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడతారని అంచనా వేసింది.

దేశవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రులన్నీ మూతపడేలా ఉన్నాయి. ఇప్పటికే సుమారు 2300 ఆరోగ్య కేంద్రాలు మూసేశారు. కనీసం ప్రాథమిక ఔషధాలు అందించలేకపోతున్నట్లు చెబుతున్నారు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లు. 10 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతీ వారం పోషకాహార లోపం, దాని సంబంధిత రోగాలతో మరణిస్తున్నారు అక్కడ. ఈ సంక్షోభానికి ఎక్కువగా చిన్న పిల్లలు బలవుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ప్రపంచ మీడియాకు అక్కడి వాస్తవ పరిస్థితిని చూపించే స్వేచ్ఛ ఇవ్వడంలేదు తాలిబన్లు. ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్‌లో ఆకలు కేకలు ఆకాశానంటుతున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కేవలం 65 వేల కోసం పిల్లల్ని అమ్ముకుంటున్నారు తల్లిదండ్రులు. అంతేకాదు, గుండె తరుక్కుపోయే విషయం ఏంటంటే, ఆఖరికి ఉయ్యాలలో పడుకున్న బిడ్డను కూడా అమ్మి ఆకలి తీర్చుకుంటున్నారు ఆఫ్గాన్ పేదలు. మనసు ఒప్పుకోకున్నా బిడ్డల్ని అమ్ముకుంటున్నాం అంటున్నారు పేరెంట్స్.

అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధికంగా విదేశీ నిధులపై ఆధారపడి ఉంది. ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టిన తరువాత విదేశీ సహాయం పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే జీతలతో సహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఫలితంగా అట్టడుగు వర్గాలు దీనస్థితికి చేరుకున్నాయి. ప్రపంచదేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం తోనే ఈ పరిస్థితి వచ్చిందని తాలిబన్‌ నేతలంటున్నారు. తమ పాలనను అధికారికంగా గుర్తించాలని అమెరికా సహా ప్రపంచ దేశాలకు కు విజ్ఞప్తి చేశారు తాలిబన్లు. వివిధ దేశాల్లో స్తంభించిపోయిన నిధులను విడుదల చేయాలని కోరారు. సీజ్‌ చేసిన ఆఫ్గాన్‌ ఆస్తులను విడుదల చేయాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో అంతర్జాతీయ సంక్షోభంగా మారే అవకాశముందని తాలిబన్‌ నేతలు హెచ్చరించారు. గతంలో తాలిబన్లను అమెరికా తప్పుగా అర్ధం చేసుకోవడం తోనే యుద్దం వచ్చినట్టు గుర్తు చేశారు.

తాలిబన్ల పాలనలో అఫ్గాన్లకు చేసేందుకు పని.. చేతిలో డబ్బు.. తినేందుకు తిండి కరవయ్యాయి. ఆకలి బాధతో చిన్నాపెద్దా అలమటిస్తున్నారు. పిల్లల కడుపు నింపేందుకు తండ్రులు దిక్కుతోచని స్థితిలో తమ శరీర భాగాలను అమ్ముకుంటున్నారు. చిన్నారులను కాపాడుకొనేందుకు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. బయటకు వెళ్లి డబ్బులు అడుక్కోవడం ఇష్టంలేని తల్లితండ్రులు తమ కిడ్నీని బజార్లలో అమ్మకానికి పెడుతున్నారు. ఆ డబ్బుతో తమ పిల్లలకు కొంతకాలమైనా తిండి పెట్టొచ్చని అవయవాలు అమ్ముకుంటున్నారు. హెరాత్‌ ప్రావిన్స్‌లో కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలామంది కిడ్నీలు అమ్మేందుకు ముందుకొస్తున్నారని స్థానిక వైద్యులు తెలిపారు. కిడ్నీ దాత, కొనుగోలుదారు పరస్పర అంగీకారంతోనే ఇలా జరుగుతోందన్నారు. కిడ్నీని కోల్పోవడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకంటే వారి కుటుంబ పోషణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు.

కిడ్నీ తొలగించాక కనీసం ఏడాది పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నప్పటికీ.. ఎవరూ లెక్క చేయడం లేదు. రెండు నెలలకే దొరికిన పనికి వెళ్లిపోతున్నారు. తమ ఆర్థిక స్థితికి ఖాళీగా ఉండలేమని గోడు వెళ్లబోసుకుంటున్నారు. చాలామంది ప్రాణ భయంతో ఇప్పటికే దేశం విడిచివెళ్లారని, వారిలో కొందరిని ఆయా దేశాలు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపాయని స్థానిక మత పెద్ద చెప్పారు. దేశం విడిచి వెళ్లేముందు.. ఇక్కడున్న అప్పులు తీర్చేందుకు కూడా చాలా మంది కిడ్నీలు అమ్ముతున్నారని వివరించారు.

ఆఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చైనా, పాకిస్తాన్‌ మినహా ఏ దేశమూ అధికారికంగా గుర్తించలేదు. చాలా దేశాలు ఆఫ్గాన్‌ ఆస్తులు, నిధులను స్తంభింపచేశాయి. కరువుతో అల్లాడిపోతోంది ఆష్గానిస్తాన్‌. పాలన చేతకాక చేతులెత్తేసిన తాలిబన్లు ఇప్పుడు ప్రపంచదేశాలు తమను గుర్తించాలని వేడుకుంటున్నారు. ఆఫ్గాన్‌లో ఆకలి సునామీ రాబోతోందని డబ్ల్యూఎఫ్‌పీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి తక్షణమే మానవతా సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తుంది.

Also Read: