Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణరంగం నుంచి కన్నబిడ్డ కోసం .. భర్త మోసంపై అలుపెరగని పోరాటం.. ఈ ఉక్రెయిన్‌ మహిళ కన్నీటి కథ చదివి తీరాల్సిందే

ఉక్రెయిన్ చట్టాల ప్రకారం అక్కడి న్యాయస్థానంలో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. పిల్లలిద్దరినీ న్యాయస్థానం తల్లి సంరక్షణలోనే ఉండేలా ఆదేశాలిచ్చింది. అయితే తండ్రి పిల్లలను చూసి వెళ్లడానికి మాత్రం అనుమతించింది. ఆ ప్రకారం వీలు చిక్కినప్పుడల్లా అఖిలేశ్ గుప్తా తన పిల్లలిద్దరినీ చూసి వెళ్తుండేవారు.

రణరంగం నుంచి కన్నబిడ్డ కోసం .. భర్త మోసంపై అలుపెరగని పోరాటం.. ఈ ఉక్రెయిన్‌ మహిళ కన్నీటి కథ చదివి తీరాల్సిందే
Ukrainian Woman
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Basha Shek

Updated on: Nov 17, 2022 | 6:05 AM

ఇది యుద్ధం రాసిన కడుపు తీపి కథ. కన్నబిడ్డ కోసం మీదపడుతున్న మిస్సైళ్ల నుంచి తప్పించుకుంటూ రణరంగం నుంచి బయల్దేరిన ఓ మహిళ వ్యథ. మోసపూరితంగా కన్న బిడ్డను ఎత్తుకెళ్లిన భర్తపై న్యాయపోరాటం.. కొడుకు కోసం ఆరాటం.. ఇదే ఇప్పుడు ఆమె జీవితం. లక్షలాది మందిని కట్టుబట్టలతో ఉన్నఊరిని వదిలి దేశవిదేశాలకు శరణార్థులుగా మార్చిన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆమె జీవితానికి పలు విధాలుగా శాపంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉక్రెయిన్‌కు చెందిన స్నిజానా గ్రైగోరివ్నా, భారతీయుడైన అఖిలేశ్ కుమార్ గుప్తా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉక్రెయిన్‌లోనే కాపురం పెట్టారు. వారికి ఇద్దరు సంతానం కలిగారు. మొదటి సంతానం వికా గుప్తా పుట్టిన చాలా కాలం తర్వాత రెండో సంతానంగా బాబు పుట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయి. ఉక్రెయిన్ చట్టాల ప్రకారం అక్కడి న్యాయస్థానంలో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. పిల్లలిద్దరినీ న్యాయస్థానం తల్లి సంరక్షణలోనే ఉండేలా ఆదేశాలిచ్చింది. అయితే తండ్రి పిల్లలను చూసి వెళ్లడానికి మాత్రం అనుమతించింది. ఆ ప్రకారం వీలు చిక్కినప్పుడల్లా అఖిలేశ్ గుప్తా తన పిల్లలిద్దరినీ చూసి వెళ్తుండేవారు.

విడిపోయినా సాఫీగా ఎవరి జీవితం వారు గడుపుతున్న సమయంలో ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమైన సమయం. వేల సంఖ్యలో తిరిగొచ్చే భారతీయ విద్యార్థులు, ఇతర భారతీయుల కోసం భారత ప్రభుత్వం భారీ ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో పాస్‌పోర్ట్, వీసా తదితర సరైన ధృవపత్రాలు లేకపోయినా.. యుద్ధభూమి నుంచి స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో భారత ప్రభుత్వం తాత్కాలిక పత్రాలను జారీ చేసి మరీ వెనక్కి తీసుకొచ్చింది. సరిగ్గా ఇదే అఖిలేశ్ గుప్తాకు అవకాశాన్ని సృష్టించింది. పిల్లల్ని చూసే వంకతో స్నిజానా ఇంటికి వెళ్లిన అఖిలేశ్, పిల్లాడితో కాసేపు వాకింగ్ చేస్తానంటూ బయటికి తీసుకొచ్చాడు. అంతే.. అటు నుంచి అటే మూడేళ్ల చిన్నారితో ఉక్రెయిన్ – రొమేనియా సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడున్న భారత రాయబార కార్యాలయ సిబ్బందితో తన భార్య, ఇతర కుటుంబ సభ్యులు యుద్ధంలో చనిపోయారని, తాను, మూడేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డామని చెప్పాడు. మొత్తంగా అక్కడి అధికారులకు కట్టుకథలు చెప్పి కొడుకుతో పాటు భారత్ చేరుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ నెంబర్లు మార్చేసి భార్యకు, కూతురుకు దొరక్కుండా భారత్‌లో తప్పించుకు తిరుగుతున్నాడు. కొడుకు కోసం స్నిజానా చేయని ప్రయత్నం లేదు. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నా.. అక్కడున్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లి అధికారుల సహాయం కోరింది. కానీ ఎవరి నుంచీ సహాయం దొరకలేదు.

Akhilesh Kumar

ఇవి కూడా చదవండి

‘జై భీమ్’ స్ఫూర్తితో..

చివరి ప్రయత్నంగా ‘జై భీమ్’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె చేస్తున్న న్యాయపోరాటానికి ఆమె స్నేహితురాలు, భారతీయ నృత్యాలు నేర్చుకున్న లిదియా లక్ష్మి (ఉక్రెయిన్ జాతీయురాలు) ఎంతో తోడ్పాటు అందించింది. ఇద్దరూ కలిసి భారత్‌లో అనేక మంది న్యాయవాదులను సంప్రదించారు. విదేశీ మహిళ తరఫున పిటిషన్ దాఖలు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఈ దశలో లిదియా తన స్నేహితురాలి సమస్య గురించి నాతో పంచుకుంది. నేను ఉక్రెయిన్ యుద్ధం కవరేజికి వెళ్లినప్పుడు లిదియాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమె నా సహాయం కోరగా.. నేను న్యాయవాది శ్రవణ్ కుమార్‌‌ను పరిచయం చేశాను. కన్న బిడ్డ కోసం ఆమె పడుతున్న తపన చూసి శ్రవణ్ కుమార్ వెంటనే ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు అఖిలేశ్ గుప్తాను, అతని దగ్గరున్న మూడేళ్ల చిన్నారిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు తరచుగా తానుండే ప్రదేశాలను మార్చుతున్న అఖిలేశ్ ఆచూకీని ఎట్టకేలకు కనిపెట్టారు. నవంబర్ 14న జరిగిన విచారణ సందర్భంగా తండ్రి అఖిలేశ్‌ను కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ సమయంలో కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని, అందుకే కోర్టుకు తీసుకురాలేదని, తదుపరి వాయిదాకు తీసుకొస్తానని అఖిలేశ్ చెప్పాడు. ఈ విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన స్నిజానా, అనువాదకుడి సహాయంతో కొడుకు యోగక్షేమాలపై ఆరా తీసింది. తన బిడ్డను తనకు అప్పగించాలని హైకోర్టును వేడుకుంది.

0

న్యాయం.. క్షేమం.. సందిగ్ధంలో న్యాయస్థానం

భారత చట్టాలైనా… అంతర్జాతీయ చట్టాలైనా.. సహజ న్యాయసూత్రాలైనా మూడేళ్ల చిన్నారి తల్లి సంరక్షణలోనే ఉంచాలని చెబుతాయి. ఆ ప్రకారం హైకోర్టు చిన్నారిని స్నిజానాకు అప్పగించాల్సి ఉంటుంది. అదే న్యాయం. కానీ ఇప్పుడు ఆమె ఉంటున్న ఉక్రెయిన్ దేశం యుద్ధంతో తీవ్ర సంక్షోభంలో ఉంది. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారిని యుద్ధభూమికి సాగనంపడం ఏమాత్రం క్షేమం కాదు. ఇదే సందిగ్ధం ఢిల్లీ హైకోర్టును వేధిస్తోంది. అప్పగింత సంగతెలా ఉన్నా.. ముందు తల్లీబిడ్డలను కలపాలని చూస్తోంది. కొడుకును చూసేందుకు స్నిజానా తన కూతురు వికా గుప్తాతో కలిసి భారత్‌ బయల్దేరింది. ఉక్రెయిన్ నుంచి పోలండ్‌ దేశ రాజధాని వార్సా చేరుకుని, అక్కణ్ణుంచి నేరుగా విమానంలో ఈ నెల 19న ఢిల్లీ చేరుకోనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..