AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం.. 111 మంది మృతి! శిధిలాల కింద వందలాది మంది

పశ్చిమ కొలంబియాలో సోమవారం 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకంపనల ధాటికి కనీసం 111 మంది ప్రాణాలు కోల్పోగా.. పలుచోట్ల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు విమానాశ్రయాలు దెబ్బతినడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి..

కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం.. 111 మంది మృతి! శిధిలాల కింద వందలాది మంది
Colombia Earthquake
Srilakshmi C
|

Updated on: Aug 11, 2026 | 7:16 AM

Share

బొగోటా, ఆగస్ట్ 11: పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో కనీసం 111 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. అనేక మంది గాయపడటంతో పాటు భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) ప్రకారం.. భూకంప కేంద్రం చోకో ప్రాంతంలోని శాన్‌ జోస్‌ డెల్‌ పాల్మార్‌ వద్ద నమోదైంది. బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 4,800 మంది నివసిస్తున్నారు. భూకంపం 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు USGS వెల్లడించింది. పొరుగున ఉన్న ఈక్వెడార్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.

పెరీరా నగర మేయర్‌ మౌరిసియో సలాజర్‌ స్థానిక రేడియోతో మాట్లాడుతూ.. తమ నగరానికి చెందిన 18 మంది మృతి చెందినట్లు తెలిపారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. స్థానిక మీడియా ప్రసారం చేసిన దృశ్యాల్లో పెరీరా, కాలి, క్విబ్డో నగరాల్లో ఇళ్లు, చిన్న భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. బొగోటాకు 300 కిలోమీటర్ల పశ్చిమాన ఉన్న మనిజలెస్‌ నగరంలోని నయా-గోతిక్‌ శైలిలో నిర్మించిన ఓ కేథడ్రల్‌ టవర్‌ కూడా భూకంప ధాటికి కూలిపోయింది.

ఇవి కూడా చదవండి

ఆరు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిపివేత

భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని ఆరు విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. దీంతో వాటిలో విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పెరీరా, మనిజలెస్‌, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా నగరాలకు సేవలందించే విమానాశ్రయాలు ప్రభావితమైనట్లు పౌర విమానయాన సంస్థ తెలిపింది. కొలంబియాలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో చిన్నపాటి భూకంపాలు సాధారణమే. వీటిని స్థానికంగా ‘టెంబ్లోర్స్‌’ అని పిలుస్తారు. అయితే 6.0కుపైగా తీవ్రత కలిగిన భూకంపాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. గతంలో ఆర్మేనియా నగరం సమీపంలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

తాజా విపత్తు నేపథ్యంలో కొలంబియా నూతన అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా శాన్‌ జోస్‌ డెల్‌ పాల్మార్‌లో సహాయక చర్యలను ప్రభుత్వం తరఫున స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ‘మీరు ఒంటరిగా లేరు. ప్రభుత్వం మీకు అండగా ఉంది, చర్యలు తీసుకుంటోంది’ అని ఆయన పేర్కొన్నారు. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వందల మందిని వెలికితీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Follow Us