‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
24 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. మరణానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పలు స్టేటస్‌లు పెట్టడం, తన మరణం తర్వాత స్నేహితులు ఎలా స్పందిస్తారనే విషయాలను ప్రస్తావించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

చిత్తూరు, ఆగస్ట్ 11: ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన మరణానికి ముందు వరుసగా ఐదు రకాల స్టేటస్‌లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం..
గంగాధరనెల్లూరు మండలం బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక దంపతుల కుమారుడు జనార్దన్‌రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందడంతో అతడు ఒంటరిగా జీవిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యానికి బానిసైనట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ చెట్టుకు జనార్దన్‌రెడ్డి మృతదేహం వేలాడుతూ కనిపించింది. విషయాన్ని అతడి బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరణానికి ముందు వరుసగా ఇన్‌స్టా స్టేటస్‌లు
జనార్దన్‌రెడ్డి మృతి చెందడానికి సుమారు 24 గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలు స్టేటస్‌లు పెట్టినట్లు తెలిసింది. తాను మరణించబోతున్నట్లు సూచించే ఓ సినిమా వీడియోతో పాటు.. మరణించిన తర్వాత స్నేహితులు ఎలా స్పందిస్తారనే భావనను వ్యక్తం చేసేలా మరికొన్ని స్టేటస్‌లు పోస్టు చేసినట్లు సమాచారం. అందులో ఒక స్టేటస్‌లో.. మనిషి చనిపోయిన తర్వాత కొంతసేపు మెదడు పనిచేస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలోనూ ఓ యువతినే తాను గుర్తు చేసుకుంటానని పేర్కొన్నట్లు తెలిసింది. తన మరణం తర్వాత స్నేహితులు బాధతో అంత్యక్రియలు నిర్వహిస్తారనే అర్థం వచ్చేలా కూడా కొన్ని పోస్టులు చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ముందుగానే తన మరణాన్ని సూచించేలా స్టేటస్‌లు పెట్టి ఉండటం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు లేదా తీవ్ర నిరాశ ఎదురైతే ఒంటరిగా ఉండకుండా నమ్మకమైన వ్యక్తిని వెంటనే సంప్రదించడం లేదా టెలీ మానస్ 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.




