Honest Village: మన దేశంలో నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఈ గ్రామం.. అసలు తాళాలే వేయరు.. జీరో క్రైం..
దసరా సెలవులు వచ్చేస్తున్నాయి.. దీంతో ఎక్కడికైనా వెళ్ళాలంటే.. ఇంటికి తాళం వేసి వెళ్ళాలి.. అయితే దొంగల భయంతో ఆ ఇంటి గలవారు ఎన్నో రకాలుగా కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఒక గ్రామంలో దొంగల భయం లేదు. అక్కడ నివసించే ప్రజలకు దొంగతనం అనే భయం ఉండదు. దీంతో వారికి తమ వస్తువులు దొంగతనం చేస్తారేమో అనే భయం లేకుండా నిర్భయంగా జీవిస్తారు. అంతేకాదు షాప్ యజమాని తాను షాప్ లో ఉన్నా లేకున్నా.. వస్తువులు, డబ్బులు పోతాయేమో అనే భయం ఉండదు. అందుకనే దుకాణాలకు తాళాలు కూడా వేయరు. నీతికి, నిజయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆ గ్రామం మన దేశంలోనే ఉంది. ఎక్కడ పెట్టిన వస్తువులు, డబ్బు అక్కడే ఆ స్థలంలోనే సురక్షితంగా ఉండే ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం..

నేటి కాలంలో.. బయట వాళ్ళని కాదుకదా.. ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా నమ్మే పరిస్థితి లేదు. అవును ఇప్పటి సమాజంలో నమ్మకం, పరస్పర సహకారం అనేది ఊహకు అందని దృశ్యం. ఆసలు ప్రపంచంలో ఇలాంటి ప్రజలు ఉన్నారా అని ఆలోచించే రోజుల్లో ఉన్నాం. అయితే ఒక గ్రామంలో దుకాణాలకు తాళం వేయడం కూడా పాపంగా పరిగణించబడేంతగా .. ఒకరిపై ఒకరు విశ్వాసం కలిగి ఉన్న గ్రామస్తులున్నారని తెలుసా..
అవును అలాంటి గ్రామం భారతదేశంలోనే ఉంది. నాగాలాండ్‌లోని అందమైన కోనోమా గ్రామంలోని ప్రజలు నీతికి నిజయతీకి నిలువెత్తు నిదర్శనం. ఈ గ్రామం అందానికి మాత్రమే కాకుండా దాని సాటిలేని నిజాయితీతో కూడా ప్రసిద్ధి చెందింది. నేటి స్వార్ధ పూరిత ప్రపంచంలో ఈ చిన్న గ్రామం సంవత్సరాలుగా నిజాయితీకి ఎలా ఉదాహరణగా నిలుస్తుందో తెలుసా..
నమ్మకంతో నడిచే దుకాణాలు కోనోమా గ్రామ వీధుల్లో నడుస్తున్నప్పుడు.. చిన్న కూరగాయల దుకాణాలు లేదా పుస్తక దుకాణాలను చూస్తారు. అయితే ఆ షాప్ లలో ఏ దుకాణదారుడు కనిపించడు. కనుక కస్టమర్ తనకు అవసరమైన వస్తువులను తీసుకొని సమీపంలోని పెట్టెలో సూచించిన మొత్తాన్ని వేస్తాడు. ఇది చూసినప్పుడు ఎవరికైనా సరే వేరే ప్రపంచానికి వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఈ వ్యవస్థ సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇప్పటికీ పూర్తి నిజాయితీతో అనుసరిస్తున్నారు.
ఇళ్లకు తాళాలు లేవు. కోనోమా ప్రజలు చాలా నిరాడంబరంగా జీవిస్తారు. నమ్మకంగా ఉంటారు. వీరు తమ ఇళ్లకు కూడా తాళం వేసుకోరు. తమ వస్తువులు సురక్షితంగా ఉన్నాయని, ఎవరూ వాటిని దొంగిలించరని నమ్మకంతో ఉంటారు. ఇలాంటి వాతావరణం మరెక్కడా చూడలేము.
కోనోమా సంప్రదాయం నుంచే పాఠాలు ఈ నిజాయితీ, క్రమశిక్షణ అక్కడ ఉండే అంగామి తెగతో ముడిపడి ఉన్న ‘కెన్యో’ సంప్రదాయం నుంచి వచ్చింది. ఇందులో 154 రకాల నియమాలు , నిషిద్ధాలు ఉన్నాయి. ఇవి ప్రకృతిని ప్రేమించడం, ఇతరులను గౌరవించడం, తప్పుడు పనులకు దూరంగా ఉండటం నేర్పుతాయి. క్రమశిక్షణ, నైతికత గ్రామంలో లోతుగా పాతుకుపోవడానికి ఇదే కారణం.
ఆసియాలోనే తొలి పచ్చని గ్రామం ఈ నిజాయితీ కేవలం యాదృచ్చికం కాదు. ఈ గ్రామంలో లోతైన సంస్కృతి.. పిల్లల పెంపకం దీని వెనుక కారణం. ఇక్కడి ప్రజలు బాల్యం నుండే పరస్పర గౌరవం, నమ్మకం అనే పాఠాన్ని నేర్చుకుంటారు. ఇక్కడ దొంగతనం ఒక పెద్ద పాపంగా పరిగణిస్తారు. దొంగతనం అంటే మొత్తం గ్రామానికి అవమానంగా భావిస్తారు. దీనితో పాటు ఈ గ్రామాన్ని ఆసియాలోనే మొట్టమొదటి హరిత గ్రామంగా కూడా ప్రకటించారు. ఇక్కడ వేట, అటవీ నిర్మూలన పూర్తిగా నిషేధించబడింది. ఇక్కడి ప్రజలు ప్రకృతి.. మానవుల మధ్య సంబంధం కూడా మానవుల మధ్య మాదిరిగానే నమ్మకంపై ఆధారపడి ఉంటుందని నమ్ముతారు.
చేతిపనులు, కళల నిధి ఈ గ్రామం వెదురు, చెరకుతో చేసే చేతిపనులతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చేతివృత్తులవారు అందమైన వస్తువులను మాత్రమే కాదు మన్నికైన వస్తువులను సృష్టించడానికి తమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తారు. ఈ నైపుణ్యం తరం నుంచి తరానికి అందించబడుతుంది.
నమ్మకం, నిజాయితీతో నిండిన ప్రపంచం ఇప్పటికీ సాధ్యమేనని కోనోమా గ్రామం ప్రతి ఒక్కరికీ చెబుతోంది. ఈ గ్రామం కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, మానవత్వం, పరస్పర విశ్వాసమే ఇప్పటికీ గొప్ప సంపద అని మనకు గుర్తు చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








