మామను చంపించిన కోడలి కేసులో ట్విస్ట్ .. కొడుకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఇంటి నిండా సీసీటీవీలు పెట్టి వేధిస్తున్నాడని మామపై కోపంతో ఉన్న కోడలు.. మాజీ పనిమనిషితో అతన్ని హత్య చేయించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో పోలీసులు విచారణ జరిపి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. హత్య చేసిన వ్యక్తి తన కొత్త సిమ్ కార్డు నుంచి కొడుకు సుబ్రత్‌కు ఆరసార్లు ఫోన్ చేసినట్లు కాల్ డేటా ద్వారా పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సంచలనం సృష్టించిన వ్యాపారి వినీత్ మీనోచా హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రూ. 40 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కుటుంబ వ్యాపారంలో కోడలు శాలుకు స్వేచ్ఛ లేకపోవడం, చిన్న ఖర్చులకైనా మామను అడగాల్సి రావడం ఆమెకు తీవ్ర కోపం తెప్పించింది. ఇంటి నిండా సీసీటీవీలు పెట్టి తన కదలికలపై నిత్యం నిఘా పెట్టడం, అర్ధరాత్రి వరకు పార్టీలకు వెళ్లనివ్వకపోవడం, ఆలస్యంగా వస్తే నిలదీయడం వంటి విషయాలపై రగిలిపోయిన శాలు.. మామపై కక్ష పెంచుకుని ఈ హత్యకు పథకం వేసింది. పోలీసులు నిందితుల కాల్ రికార్డ్స్ పరిశీలిస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. హత్య జరగడానికి ముందు కేవలం 21 రోజుల్లోనే మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్‌తో ఆ ఇంట్లోని వారు విపరీతంగా ఫోన్లలో మాట్లాడారు.
మే 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్య సుబ్రత్, నిందితుడు విశాల్ సుమారు 309 సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి రెండ్రోజుల ముందు కూడా నిందితుడు కొత్త సిమ్ కార్డు ద్వారా సుబ్రత్‌తో మాట్లాడినట్లు తేలడంతో, పోలీసులు ఆ కోణంలో విచారణను వేగవంతం చేశారు. కోడలు శాలు సుమారు 30 సార్లు, ఆమె భర్త సుబ్రత్ సుమారు 300 సార్లు విశాల్‌తో టచ్‌లో ఉన్నారు. వీళ్లందరి కాల్స్ కలిపితే ఏకంగా 330 సార్లు మాట్లాడినట్లు తేలింది. ఇక హత్య జరిగిన రోజైతే ఉదయం నుంచి రాత్రి వరకు శాలు, విశాల్ మధ్య ఏకంగా 14 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
జూలై 28న రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన షాలు.. మామతో గొడవపడిన తర్వాతే ఈ హత్యకు ప్లాన్ వేసింది. మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్‌కు రూ. 6 లక్షలకు సుపారీ ఇచ్చి, అడ్వాన్స్‌గా రూ. 2 లక్షలు చెల్లించి ఇంట్లోకి వెళ్లడానికి డూప్లికేట్ తాళం చెవి కూడా ఇచ్చింది. ప్లాన్ ప్రకారం హత్య జరిగిన రోజు షాలు, ఆమె భర్త తమ పాపతో కలిసి కాన్పూర్‌లోని కాస్మోజిన్ లాంజ్‌లో జరిగిన పార్టీకి వెళ్లిపోయారు.
అక్కడ షాలు తన ఫ్రెండ్స్‌తో కలిసి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. అదే సమయంలో ఫోన్‌లో మామను ఎలా హత్య చేయాలో నిందితులకు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చింది. సరిగ్గా అదే టైమ్‌లో విశాల్, మరో నిందితుడు రాజ్ కిషోర్.. “మామగారికి మందులు ఇవ్వడానికి వచ్చాం” అని సెక్యూరిటీ గార్డ్‌ను నమ్మించి లోపలికి వెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించి 63 ఏళ్ల వినీత్ మీనోచాను కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు.
అర్ధరాత్రి 3 గంటలకు షాలు దంపతులు ఇంటికి వచ్చేసరికి, మామ వినీత్ మీనోచా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులు విశాల్, రాజ్ కిషోర్‌లతో పాటు ఈ హత్యకు ప్రధాన సూత్రధారైన కోడలు షాలును కూడా అరెస్టు చేశారు. మొదట ఏమీ తెలియనట్లు అమాయకురాలిగా నటించినప్పటికీ, పోలీసుల గట్టి విచారణలో షాలు తన నేరాన్ని అంగీకరించింది.