AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: జంట పక్షిని రక్షించుకునేందుకు హంస ఆరాటం.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హంసల జంటకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ఒకటి బయటకు వచ్చింది, అందులో ఒక హంస అచేతనంగా పడి ఉన్న తన భాగస్వామిని మేల్కొలపడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఇది చూసిన తర్వాత, నన్ను నమ్మండి, మీ కళ్ళు కూడా ఒక్క క్షణం తడిసిపోతాయి.

Watch: జంట పక్షిని రక్షించుకునేందుకు హంస ఆరాటం.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో
Swan Magic Viral Video
Balaraju Goud
|

Updated on: Aug 07, 2025 | 10:09 AM

Share

జంట పక్షులను చూసి ప్రేమికులు తమ ప్రేమ కూడా అలా ఉండాలని భావిస్తారు. అంటే మనుషులనే ఇన్‌స్పైర్‌ చేసేంత ప్రేమ భావం పక్షుల్లో ఉంటుందని మనకు అర్ధమవుతోంది. పక్షుల మధ్య ప్రేమ బోయవాడిని కవిగా మార్చింది. అది అద్భుత కావ్య రచనకు బాటలు వేసింది. తత్ఫలితంగా ప్రేమ, మానవ సంబంధ బాంధవ్యాల విలువలు తెలిపే రామాయణ మహాకావ్యం వెలువడింది. దీనిని రుజువు చేస్తూ మరోసారి జంట పక్షుల ప్రేమ చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తన జంటను కోల్పోయిన ఓ హంస తనను బ్రతికించుకునేందుకు పడిన తపన కలచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఓ చెరువులో హంసల జంటలో ప్రమాదవశాత్తు ఒకటి ప్రాణాలు విడిచి నీటిపై చలనం లేకుండా తేలియాడుతోంది. ఇది గమనించిన దాని తోడు హంస, తన జంటను వదిలి వెళ్లలేకపోయింది. తన నేస్తం చనిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోలేని ఆ పక్షి, దాన్ని తిరిగి బతికించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. తన ముక్కుతో నెడుతూ, రెక్కలతో కదుపుతూ మేలుకొలిపేందుకు చేసిన విఫలయత్నం అక్కడున్న వారిని కలచివేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మరణం కూడా విడదీయలేని ప్రేమ. ఈ హంస తన ప్రాణం లేని భాగస్వామిని మేలుకొలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. హంసలు జీవితాంతం ఒకే జంటతో కలిసి జీవిస్తాయని, వాటి మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుందని పక్షి శాస్త్రవేత్తలు చెబుతుంటారు. తమ జంటలో ఒకటి దూరమైతే, రెండోది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. కొన్ని బంధాలు శాశ్వతంగా ఉంటాయి” అని నందా ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా చలించిపోతున్నారు. “ఇదే కదా నిజమైన ప్రేమంటే” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన జంతువులకు కూడా మనుషుల్లాగే ప్రేమ, బాధ వంటి భావోద్వేగాలు ఉంటాయనే చర్చకు మరోసారి దారితీసింది. ప్రాణం లేని తన జంటను వదిలి వెళ్లలేక హంస పడుతున్న వేదన, నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..