Viral: ఇదెక్కడి పార్కురా నాయనా.! ఆ పనులు అస్సలు చెయ్యొద్దట.. బోర్డు చూసి ఖంగుతిన్న జనాలు..
పెట్‌లను తీసుకెళ్లడం, అసభ్యకరమైన పనులు చేయడం, సిగరెట్ తాగడం, చెత్త పారేయడం లాంటి పనులపై...
కొందరు వాకింగ్ చేసేందుకు.. ఇంకొందరు రన్నింగ్ చేసేందుకు.. మరికొందరు ఎంచక్కా సేద తీరేందుకు సాయంత్రం వేళ దగ్గరలోని పార్కులకు వెళ్తుంటారు. ఇక అబ్బాయిల్లో కొంతమంది అయితే తమ ప్రియురాలిని తీసుకుని జాలీగా గడిపేందుకు పార్క్‌కు వెళ్తారు. ఈ విషయాలు మనందరికీ తెలిసినవే. అయితే పెట్‌లను తీసుకెళ్లడం, అసభ్యకరమైన పనులు చేయడం, సిగరెట్ తాగడం, చెత్త పారేయడం లాంటి పనులపై నిషేధం విధిస్తూ కొన్ని పార్కుల్లో హెచ్చరిక బోర్డులు పెట్టడం మనం చూసే ఉంటాం. కాని ఇక్కడ ఓ పార్క్ ముందు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు చూసి స్థానిక జనాలు ఖంగుతిన్నారు. ‘ఇవేం రూల్స్ సామీ.. ఎక్కడా చూడలేదు’ అంటూ అవాక్కవుతున్నారు. మరి ఆ కథేంటంటే.?
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఓ పార్క్ ముందు వింత నిబంధనలతో ఓ హెచ్చరిక బోర్డు వెలిసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) ఈ బోర్డును ఏర్పాటు చేసింది. ఇంతకీ ఆ బోర్డులో ఏం పేర్కొన్నారంటే.. ” జాగింగ్ చెయ్యొద్దు.. రన్నింగ్ చెయ్యొద్దు.. యాంటీ క్లాక్ తరహాలో నడవొద్దు” ఈ పనులు ఇక్కడ నిషేధం అంటూ బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ‘ఇదెక్కడి పార్క్‌రా నాయనా’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇవన్నీ చేయకపోతే.. ఇంకేం చేయాలి.. పాకాలా.?’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. ‘నడవడం నిషేదమైతే.. నాగిని డ్యాన్స్ చేయమంటారా’ అంటూ ఇంకొకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.