Bride Crisis: అన్నీ ఉన్నాయి..పెళ్ళికి పిల్లనిచ్చేవారు లేరు.. వివాహం కోసం యువకుల పాదయాత్ర.. శివయ్యకు అర్జీలు
ఏడాదికి మూడు పండిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయినా వారి జీవితంలో ఒకటే వెలితి. వివాహ వయస్సు దాటిపోతున్నా పెళ్లిళ్లు కావడంలేదు. వారికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.
పెళ్లెప్పుడవుతుంది బాబోయ్.. నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబోయ్… ఇది నా మాట కాదు.. పెళ్లికాని ప్రసాదుల ఆవేదన..మాకు పిల్లనివ్వండి బాబోయ్.. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటామన్నా వారికి పిల్ల దొరకట్లేదట. దాంతో ఆ పరమేశ్వరుడిముందు వారిగోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమయ్యారు. వయసు మీరిపోతోంది… మాకు పెళ్లి చెయ్యి స్వామీ అంటూ శివాలయానికి పాదయాత్ర చేపట్టారు.
కర్నాటక మాండ్యా జిల్లాలోని ఓ 200 మంది యువకులు ఒక్కొక్కరికీ పదెకరాలు పైనే భూములున్నాయి. ఏడాదికి మూడు పండిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయినా వారి జీవితంలో ఒకటే వెలితి. వివాహ వయస్సు దాటిపోతున్నా పెళ్లిళ్లు కావడంలేదు. వారికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో అక్కడి యువకులంతా కలిసి ప్రముఖ శైవక్షేత్రమైన మలెమహదేవన బెట్టకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాండ్య నుంచి 105 కిలోమీటర్ల దూరంలో చామరాజనగర జిల్లాలోని బెట్టకు ఫిబ్రవరి 23న పాదయాత్రకు ముహూర్తం నిర్ణయించారు.
స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా, ఇతర ప్రాంతాల వారు పిల్లను ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఆయా గ్రామాల్లోని యువకులకు పెళ్లిళ్లు జరగడం కష్టంగా మారింది. దాంతో తమ ఆవేదనను భగవంతుడికి విన్నవించుకుందామని ‘బ్రహ్మచారుల పాదయాత్ర’ పేరిట యాత్ర చేస్తున్నట్టు యువకులు ప్రకటించారు. ఈ ప్రకటనతో మూలమూలల్లో ఉన్న పెళ్లికాని ప్రసాదులంతా బయటికొచ్చారు. అలా మొత్తం 200 మంది అమ్మాయి కోసం పాదయాత్ర చేపడుతున్నారు. ఇప్పుడీ పాదయాత్ర హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ యాత్ర తర్వాతైనా వీరికి వివాహాలవుతాయో? లేదో? చూడాలి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..