YS Sharmila Medak : సీఎం జిల్లా అంటే ఎలా ఉండాలి.. ? వైఎస్సార్ ఉంటే మెదక్ రూపు రేఖలు మారిపోయేవి : వైఎస్ షర్మిల
YS Sharmila meeting with Medak fans : 'సీఎం జిల్లా అని చెప్పుకుంటారు.. కాని అక్కడ రైతుల పరిస్థితి ఏంటి..?' అని వైఎస్ షర్మిల మెదక్ అభివృద్ధిపై..
YS Sharmila meeting with Medak fans : ‘సీఎం జిల్లా అని చెప్పుకుంటారు.. కాని అక్కడ రైతుల పరిస్థితి ఏంటి..?’ అని వైఎస్ షర్మిల మెదక్ అభివృద్ధిపై నిలదీశారు. వైఎస్సార్ ఉండి ఉంటే మెదక్ రూపు రేఖలు మారిపోయేవని ఆమె అన్నారు. కొత్త పార్టీ నిర్మాణంలో భాగంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల అభిమానులతో ఆమె సమావేశాలు నెరపుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె, మెదక్ వైఎస్ అభిమానులతో ఇవాళ లోటస్ పాండ్ లో సమావేశం నిర్వహించారు.
ఒకప్పుడు అన్నం పెట్టే మెతుకు సీమనే ఇప్పటి మెదక్ జిల్లా అని షర్మిల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సిద్దిపేట గొల్లభామ చీరలు తెలంగాణకే గర్వకారణమని ఆమె చెప్పుకొచ్చారు. “విప్లవానికి ఊపిరి పోసిన గద్దర్ పూట్టింది ఇక్కడే.. ‘నాగేటి సాలల్లోన..నా తెలంగాణ’ పాట రాసిన వ్యక్తి ఇక్కడి వాడే.” అని షర్మిల అన్నారు.
ఆర్మీకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉండడం అందరికీ గర్వకారణమన్న ఆమె, వైఎస్సార్ కి మెదక్ అంటే ఎంతో అభిమానమన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న స్వర్గీయ వైఎస్ మెదక్ లో ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు. గంజాయి సాగు చేసే వారికి ఉపాధి కల్పించింది వైఎస్సార్ అని షర్మిల తెలిపారు.
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బడుగులకు భూములు అందించారు. ఇప్పటి పాలకులు రిడిజైన్ పేరుతో ప్రజలకు నష్టం చేశారని షర్మిల.. కేసీఆర్ సర్కారుని పరోక్షంగా విమర్శించారు. ఐఐటి ని సంగారెడ్డి లో ఏర్పాటు చేసింది వైఎస్సార్ అని, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల మెదక్ ఖ్యాతి పెరిగిందని షర్మిల అన్నారు.
వైఎస్సార్ సీఎం గా ఉన్నప్పుడు మెదక్ నుంచే నలుగురిని క్యాబినెట్ లో తీసుకున్నారని షర్మిల చెప్పారు. సీఎం జిల్లా అని చెప్పుకునే జిల్లా ఇది. దీనిని ఇంకెంత అభివృద్ధి చేయొచ్చు.. మాట ఇస్తే, అంత కంటే ఎక్కువ పని చేసే పాలన మళ్ళీ రావాలి. ఇందుకు అందరూ కలిసి రావాలి అని షర్మిల కోరారు.
Read also : Tirumala Corona : భక్తులకు మనవి : కోవిడ్ సెకండ్ వేవ్‌పై సమీక్ష, తిరుమలేశుని కొండపై చేయాల్సినవి, కూడనివి..