కరోనా పరిస్థితుల్లో నిలబడింది వ్యవసాయరంగం మాత్రమే.. రైతులను ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలన్న వెంకయ్య
కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందంటే అందుకు వ్యవసాయ రంగమే కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
Venkaiah Naidu on agriculture: కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందంటే అందుకు వ్యవసాయ రంగమే కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రైతులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలని సూచించారు. హైదరాబాద్‌లోని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మోహన్‌కందా రాసిన ‘‘భారత్‌లో వ్యవసాయం.. రైతుల ఆదాయం రెట్టింపులో సవాళ్లు’’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశంలో మారుతున్న కాలానుగుణంగా వృత్తులు మారుతున్నాయన్న ఆయన.. రానురాను వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ఆయన… రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వెంకయ్య నాయుడు సూచించారు.
‘‘దేశంలో సగం మందికి పైగా వ్యవసాయమే ఆధారం. సాగు లాభసాటిగా లేకపోవడంతో వ్యవసాయాన్ని వీడుతున్నారు. కొవిడ్ వల్ల అన్ని రంగాలు దెబ్బతింటే వ్యవసాయం తట్టుకొని నిలబడింది. కరోనా వల్ల పౌష్టికాహారంపై శ్రద్ధ పెరిగింది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రుణమాఫీ అవసరం లేదు’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. కాలానుగుణంగా మారుతున్న శాస్త్ర సాంకేతికనను ఉపయోగించి వ్యవసాయ సాగు పెరగాలని వెంకయ్య నాయుడు అకాంక్షించారు.